Coconut Fish Curry Recipe । నోరూరించే చేపలకూర.. నోట్లే వేస్తే కరిపోయేలా ఇలా చేయండి!
02 April 2023, 12:30 IST
- Coconut Fish Curry Recipe: చేపలకూరను కొబ్బరిపాలతో చేస్తే టేస్టీగా ఉంటుంది, నోట్లో వేస్తే కరిగిపోతుంది. కేరళ స్టైల్ కొకొనట్ ఫిష్ కర్రీ రెసిపీని ఇక్కడ చూడండి.
Coconut Fish Curry Recipe
Summer Fish Recipes: ఎండాకాలంలో మాంసాహార ప్రియులు చికెన్, మటన్ లాంటి దట్టమైన మాంసంకూరలను ఎంచుకునే బదులు చేపలు వంటి తేలికైన నాన్-వెజ్ తినడం మంచిది. ఎందుకంటే మాంసం జీర్ణం అవటానికి ఎక్కువ సమయం పడుతుంది, ఈ ప్రక్రియలో శరీరంలో వేడి ఉత్పన్నం అవుతుంది. బయట వేడి వాతావరణం మిమ్మల్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. అయితే చేపలు తేలికగా జీర్ణం అవుతాయి, చాలా ఆరోగ్యకరం కూడా. మీ కోసం ఇక్కడ కొకనట్ ఫిష్ కర్రీ రెసిపీని అందిస్తున్నాం.
కొకనట్ ఫిష్ కర్రీ అనేది కొబ్బరిపాలతో కమ్మగా వండే చేపల కూర. ఈ వంటకం ఈ వంటకం కేరళ ఫిష్ కర్రీ రుచిని పోలి ఉంటుంది. అయితే కొబ్బరిపాల గుణాలతో మరింత మృదువుగా నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది. అదనంగా ఇది గ్లూటెన్-రహితమైన, కేలరీలు తక్కువగా ఉండే ఆహారం. కొబ్బరిపాలు చెట్టు నుంచి తీసిన ఉత్పత్తి కాబట్టి డెయిరీ పాలతో కలిగే ఇబ్బందులు ఏమి ఉండవు.
కేవలం 30 నిమిషాల్లో ఈ చేపల కూరను వండుకోవచ్చు, ఎలా చేయాలో ఈ కింద సూచనలను చదవండి.
Coconut Fish Curry Recipe కోసం కావలసినవి
- 700 గ్రాముల టిలాపియా చేప ముక్కలు (మంచినీటి చేపలు)
- 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె
- 2 కప్పుల కొబ్బరి పాలు
- 1 టీస్పూన్ ఆవాలు
- 1 రెమ్మ కరివేపాకు
- 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్
- 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్
- 3 లవంగాలు
- 1 మీడియం సైజ్ ఉల్లిపాయ
- 2 పచ్చి మిరపకాయలు
- 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు
- 1/2 టీస్పూన్ కారం
- 1/2 టీస్పూన్ పసుపు
- 1 టీస్పూన్ గరం మసాలా
- 2 టీస్పూన్లు ధనియాల పొడి
- 1 టీస్పూన్ తాజా నిమ్మరసం
- ఉప్పు రుచికి తగినంత
- కొత్తిమీర
కొకనట్ ఫిష్ కర్రీ తయారీ విధానం
- ముందుగా చేపలను శుభ్రంగా కడిగి 2-అంగుళాల ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే క్యాప్సికమ్, ఉల్లిపాయలను ముక్కలుగా కోసుకోండి, అల్లం, వెల్లుల్లిని మెత్తగా తురుముకోవాలి లేదా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు ఒక బాణాలిలో నూనె పోసి మీడియం నుంచి అధిక మంట వేడి చేయండి, ఆపై ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి.
- అనంతరం కరివేపాకు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 30 సెకన్ల పాటు వేయించండి. ఆపై ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
- ఇప్పుడు కారం, ఉప్పు సహా అన్ని మసాలాలు వేసి, బాగా కలపండి, అనంతరం కొబ్బరి పాలు వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత చేప ముక్కలు వేసి మృదువుగా కలపండి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర, కావాలనుకుంటే కొన్ని పుదీనా ఆకులు వేసి కలపండి.
- ఇప్పుడు మూతపెట్టి ఒక 10 నిమిషాలు లేదా చేపలు ఉడికేంత వరకు మీడియం మంటపై ఉడికించండి.
- చివరగా, మూత తీసి నిమ్మరసం పిండండి.
అంతే, కొకొనట్ ఫిష్ కర్రీ రెడీ. అన్నంతో కలుపుకొని తింటే ఆహా అనే రుచి.