Slow Metabolism Reasons : రోజూ చేసే ఈ తప్పులతో జీవక్రియ రేటు తగ్గుతుంది
04 February 2024, 15:30 IST
- Slow Metabolism Reasons In Telugu : జీవక్రియ రేటు సరిగా ఉంటేనే మెుత్తం ఆరోగ్యం బాగుంటుంది. అయితే మనం రోజూ చేసే తప్పులతో మన ఆరోగ్యం దెబ్బతింటుంది.
జీవక్రియ రేటు తగ్గేందుకు కారణాలు
శరీరాన్ని దృఢంగా ఉంచడంలో జీవక్రియ పాత్ర చాలా ముఖ్యమైనది. మెటబాలిజం రేటు వేగంగా ఉంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. ఫలితంగా శరీరం కూడా ఫిట్‌గా ఉంటుంది. అయితే మెటబాలిక్ రేటు నెమ్మదిగా ఉంటే సమస్య తలెత్తుతుంది.
జీవక్రియ అంటే శరీరం ఆహారం నుండి అవసరమైన శక్తిని నిల్వ చేసే ప్రక్రియ. అందువల్ల శరీరంలోని జీవక్రియ ఆహారపు అలవాట్లపై చాలా ఆధారపడి ఉంటుంది. కానీ ఆహారం కాకుండా రోజువారీ జీవితంలో మనం చేసే కొన్ని తప్పులు శరీరంలోని జీవక్రియ రేటును ప్రభావితం చేస్తాయి. జీవక్రియ రేటును ఏ అలవాట్లు ప్రభావితం చేస్తాయో చూద్దాం..
ఒత్తిడితో జీవక్రియ మీద ప్రభావం
దైనందిన జీవితంలో బిజీ పెరిగిపోవడంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుంది. కార్యాలయంలో పని ఒత్తిడి, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి వంటి కారణాల వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది చాలా సమస్యలు తెస్తుంది. మానసిక ఆరోగ్యం సరిగా లేకుంటే ఆకలి తగ్గుతుంది. నిరాశ, ఆందోళన, ఒత్తిడి వంటి పరిస్థితులు ఆకలిని కోల్పోయేలా చేస్తాయి. ఫలితంగా జీవక్రియ రేటు తగ్గుతుంది.
ఆహారం సరిగ్గా తినాలి
బరువు వేగంగా తగ్గుతుందని కొందరు చాలా మంది ఆహారం తక్కువగా తింటారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి చాలా మంది రోజువారీ భోజనంలో సగమే తినేస్తారు. కానీ పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం తక్కువ తినడం వల్ల బరువు తగ్గదు. రోజులో సరైన సమయంలో సరైన మొత్తంలో ఆహారం తీసుకోకపోవడం జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా రావచ్చు.
రాత్రి నిద్ర అవసరం
మంచి ఆరోగ్యానికి మంచి రాత్రి నిద్ర అవసరం. సరిగ్గా నిద్రపోకపోతే శరీరం అలసిపోతుంది. రకరకాల శారీరక సమస్యలు తలెత్తుతాయి. ప్రతిరోజూ కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. తగినంత నిద్ర లేకపోవడం జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జీవక్రియ మందగిస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
ఎనర్జీ డ్రింక్స్ తాగకూడదు
కార్బోనేటేడ్ పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ చాలా చక్కెరను కలిగి ఉంటాయి. ఇది మానసిక, శారీరక ఆరోగ్యం రెండింటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ పానీయాల రెగ్యులర్ వినియోగం జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది.
బరువు తగ్గేప్పుడు ఈ తప్పులు చేయెుద్దు
తక్కువ కార్బ్ ఆహారం చాలా ఆరోగ్యకరమైనది. ఈ ఆహారాన్ని అనుసరించడం సాధారణంగా బరువు తగ్గడానికి సిఫార్సు చేస్తారు. కానీ ఏదైనా అతిగా తింటే హానికరం. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ ఆహారం నుండి పిండి పదార్థాలను పూర్తిగా తగ్గించడం ప్రతికూలంగా ఉంటుంది. ఇది జీవక్రియ రేటును తగ్గిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.
వ్యాయామం చేయకపోవడం తప్పే
మెటబాలిజిం రేటు ప్రభావితం అయ్యేందుకు గల కారణాలలో ఒకటి క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం. చాలా మందికి బిజీ షెడ్యూల్ కారణంగా వ్యాయామం చేయడానికి సమయం ఉండదు. పైగా ఆఫీసులో ఒకే చోట కూర్చోవడం వల్ల నడిచే సమయం ఉండదు. ఈ అలవాటు జీవక్రియ రేటును కూడా తగ్గిస్తుంది.