Chickpeas Dosa: కొమ్ము శనగలతో టేస్టీ దోశలు, ఇది బెస్ట్ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్
17 February 2024, 6:00 IST
- Chickpeas Dosa: ఒకసారి కొమ్ము శనగలతో దోశలు చేసి చూడండి. ఇవి రుచిలో కొత్తగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటాయి. వీటిని చేయడం చాలా సులువు. కొమ్ము శనగలతో చేసే దోశలు ఎలాగో తెలుసుకుందాం.
కొమ్ము శెనగల దోశె
Chickpeas Dosa: కొంతమంది వీటిని అట్లు అని పిలిస్తే, మరికొందరు శెనగల దోసెలు అని అంటారు. ఈ శెనగల దోసెలు చేయడం చాలా సులువు. కొమ్ము శనగల్ని ఇంగ్లీషులో చిక్ పీస్ (Chickpeas) అంటారు. వీటితో చేసే దోసెలు రుచిలో కొత్తగా ఉంటాయి. మీకు కొత్త అనుభూతిని అందిస్తాయి. ఈ శెనగల దోశలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కొమ్ము శెనగల దోశెల రెసిపీకి కావలసిన పదార్థాలు
కొమ్ము శెనగలు - రెండు కప్పులు
పచ్చిమిర్చి - మూడు
అల్లం - చిన్న ముక్క
బియ్యం - నాలుగు స్పూన్లు
జీలకర్ర - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
నీళ్లు - సరిపడినన్ని
నూనె - తగినంత
కరివేపాకులు - గుప్పెడు
కొమ్ము శెనగల దోశెల రెసిపి
1. కొమ్ము శెనగలను బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
2. వాటిని నీళ్లు వేసి రాత్రంతా నానబెట్టాలి.
3. ఉదయం లేచాక వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
4. ఆ మిక్సీలో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి జీలకర్ర, కరివేపాకులు, తగినన్ని నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
5. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.
6. ఇప్పుడు ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.
7. ఆ గిన్నెలో పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
8. అవసరమైతే నీళ్లు కలుపుకోవచ్చు. దోశెలు వేయడానికి జారేలా ఆ మిశ్రమాన్ని జారుగా చేసుకోవాలి.
9. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి.
10. దోశెల మాదిరిగా ఈ కొమ్ము శనగలు పిండిని గరిటతో వేసుకోవాలి.
11. రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
12. కొబ్బరి చట్నీతో వీటిని తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి ప్రయత్నించండి, మీకు నచ్చడం ఖాయం. ముఖ్యంగా పిల్లలకు కచ్చితంగా తినాల్సిన దోశెలు ఇవి.
కొమ్ము శెనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారంలో ఒకటి రెండుసార్లు కొమ్ము శెనగలను తినడం చాలా అవసరం. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఎవరైతే బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారో... అలాంటివారు చేసుకుని తినడం మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. దీనిలో లెగ్యూమ్ అనే ప్రోటీన్ అధికంగా ఉంటుంది. శాకాహారులు కొమ్ము శనగలను తినడం వల్ల అధిక ప్రోటీన్ పొందగలరు. శాఖాహారులు మాంసాన్ని తినరు. కాబట్టి వారికి ఇది మంచి ప్రత్యామ్నాయమని చెప్పవచ్చు.
కొమ్ము శెనగలు మొక్కల ఆధారిత ప్రోటీన్లు అందిస్తాయి. కాబట్టి ఇది అద్భుతమైన ఆహారం. కొమ్ముశెనగల్లో రిబోఫ్లేవిన్, ఫోలేట్, విటమిన్ ఏ, థయామిన్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరమైనవి. కాబట్టి వారంలో రెండు సార్లు ఈ కొమ్ము శనగలతో చేసే వంటకాలను తినడం అలవాటు చేసుకోండి. పోషకాహార లోపం రాకుండా ఉంటుంది.