Chicken Garelu: స్పైసీగా క్రంచీగా చికెన్ గారెలు ఇలా చేసేయండి, బ్రేక్ ఫాస్ట్‌లో తినేయవచ్చు రెసిపీ ఇదిగో
17 December 2024, 6:30 IST
- Chicken Garelu: బ్రేక్ ఫాస్ట్‌లో కొత్తగా ఏం తినాలని ఆలోచిస్తున్నారా? ఇక్కడ మేము చికెన్ కీమా గారెలు ఇచ్చాము. వీటిని తింటే టేస్టీగా ఉంటాయి. పైగా ప్రోటీన్ నిండుగా ఉంటుంది.
చికెన్ గారెలు రెసిపీ
చికెన్ రెసిపీలలో చికెన్ కీమా గారెలు కూడా ఒకటి. చికెన్ కి మాతో ఇంట్లోనే చాలా సులువుగా ఈ గారెలు చేసుకోవచ్చు. అప్పుడప్పుడు బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తింటే రుచి అదిరిపోతుంది. రెండు మూడు గారెలు తింటే చాలు పొట్ట నిండిపోతుంది. పైగా ఎంతో ప్రోటీన్ కూడా అందుతుంది. 45 నిమిషాల్లో ఈ చికెన్ గారెలు వండేసుకోవచ్చు. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
చికెన్ గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు
చికెన్ కీమా - పావు కిలో
పచ్చిమిర్చి - రెండు
అల్లం - చిన్న ముక్క
బియ్యప్పిండి - మూడు స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
కరివేపాకులు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
జీలకర్ర పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర స్పూను
సోంపు పొడి - అర స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
చికెన్ గారెలు రెసిపీ
1. చికెన్ కీమాను నేరుగా తెచ్చుకుంటే చికెన్ గారెలు వండుకోవడం సులభమవుతుంది.
2. అదే చికెన్ ముక్కలు తెచ్చుకుంటే అందులో మెత్తటి భాగాన్ని తీసి శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి చికెన్ కీమాలా మార్చుకోవాలి.
3. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసి మెత్తగా రుబ్బండి.
4. ఆ మిశ్రమాన్ని చికెన్ కీమాలో వేసి కలపండి.
5. అలాగే బియ్యప్పిండి, ఉల్లిపాయల తరుగు, కరివేపాకుల తరుగు, కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలుపుకోండి.
6. కారం పొడి, ఉప్పు, సోంపు పొడి, జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలపండి.
7. చికెన్ లో కాస్త తేమ ఉండేలా చూసుకోండి. అలా అని జారేలా ఉండకూడదు గారెలకు ఎంత గట్టిగా పిండిని కలుపుతామో చికెన్ కీమా కూడా అంతే గట్టిగా ఉండాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయండి.
9. నూనె వేడెక్కాక చికెన్ లోని చిన్న ముద్దను తీసి గారెల్లా ఒత్తుకొని నూనెలో వేయండి.
10. రెండువైపులా రంగు మారేవరకు వేయించుకోండి.
11. నాలుగు నిమిషాలు పాటు వేయిస్తే చికెన్ బాగా ఉడుకుతుంది.
12. ఇప్పుడు వీటిని తీసి టిష్యూ పేపర్ పై వేయండి.
13. అందులో ఉన్న అదనపు నూనెను టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. అంతే టేస్టీ చికెన్ గారెలు రెడీ అయినట్టే.
14. వీటితో చికెన్ గ్రేవీలో ముంచుకొని వీటిని తింటే రుచి అదిరిపోతుంది లేదా ఏ చట్నీ అవసరం లేకుండా కూడా తినవచ్చు. ఒక్కసారి వీటిని తిని చూడండి. మీకు ఎంతో నచ్చడం ఖాయం.
తరచూ చికెన్ గారెలను చేసుకోవడం కష్టమే. కాబట్టి ఆదివారం పూట ఖాళీగా ఉన్నప్పుడు ఈ చికెన్ గారెల బ్రేక్ ఫాస్ట్ ప్రయత్నించండి. పక్కన చికెన్ గ్రేవీ కూడా ఉండేలా చూసుకోండి. ఈ రెండింటి కాంబినేషన్లో రుచి అదిరిపోతుంది. ఇది అందరికీ నచ్చుతుంది. చికెన్ తినడానికి ఇష్టపడని పిల్లలకు ఇలా గారెలు రూపంలో పెడితే వారు ఇట్టే తినేస్తారు.