Chicken Chinthamani: చికెన్ చింతామణి ఎప్పుడైనా తిన్నారా? ఓసారి తినండి నోరూరిపోతుంది
09 December 2024, 17:30 IST
- Chicken Chinthamani: చికెన్‌తో చేసే వంటకాలు కొన్ని ఎంతో రుచిగా ఉంటాయి. వాటిలో చికెన్ చింతామణి ఒకటి. ఇది తమిళనాడు స్టైల్ చికెన్ రెసిపీ, ఒకసారి కొత్తగా ప్రయత్నించి చూడండి.
చికెన్ రెసిపీలు
చికెన్‌తో చేసిన వంటకాలు ఏవైనా కూడా నాన్ వెజ్ ప్రియులకు తెగ నచ్చేస్తాయి. ఇక్కడ కూడా మేము ఒక కొత్త రెసిపీ ఇచ్చాము. దాని పేరు చికెన్ చింతామణి. తమిళనాడులో దీన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. సాధారణ కూరకు చికెన్ చింతామణికి తేడా ఒక్కటే. సాధారణ చికెన్ కూరలో మసాలాలు దట్టిస్తారు. చికెన్ చింతామణిలో మాత్రం మసాలా వేయకుండానే రుచిని తెప్పిస్తారు. తిన్నారంటే మీకు ఇది బాగా నచ్చుతుంది. ముఖ్యంగా పిల్లలు ఇది తినేలా ఉంటుంది. ఎక్కువ మసాలా దట్టించిన ఆహారాన్ని తినడం కొంతమందికి ఆరోగ్యానికి మంచిది కాదు. అలాంటివారు చికెన్ చింతామణిని ప్రయత్నించి చూడండి.
చికెన్ చింతామణి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ - కిలో
ఎండుమిర్చి - పది
ఉల్లి తరుగు - ఒక కప్పు
నూనె - సరిపడినంత
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
మిరియాల పొడి - ఒక స్పూను
సోంపు పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర స్పూను
కరివేపాకులు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
ఇంగువ - చిటికెడు
చికెన్ చింతామణి రెసిపీ
1. ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నాలుగు స్పూన్ల నూనె వేయాలి.
3. ఆ నూనెలో కరివేపాకులు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకోవాలి.
4. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయల తరుగును వేసి బాగా కలుపుకోవాలి.
5. ఇది రంగు మారేవరకు వేయించుకోవాలి.
6. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి వేయించుకోవాలి.
7. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
8. చిన్న మంట మీద వండితే మాడిపోకుండా ఉంటుంది.
9. ఇప్పుడు చికెన్ ముక్కలను ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.
10. పైన రుచికి సరిపడా ఉప్పును చల్లుకొని ఒకసారి కలిపి మూత పెట్టాలి. ఓ 10 నిమిషాలు అలా ఉడికించాలి.
11. ఆ తర్వాత పసుపు, సోంపు పడి కూడా వేసి బాగా కలుపుకోవాలి.
12. మిరియాల పొడిని కూడా చల్లుకోవాలి.
13. మిరియాల పొడిలో ఉన్న ఘాటే కూరకు వస్తుంది. అలాగే ఎండుమిర్చిని కూడా అధికంగా వేశాము కాబట్టి కారాన్ని వేయాల్సిన అవసరం లేదు.
14. పైన మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
15. మీకు ఇగురులా కావాలనుకుంటే నీళ్లను వేయండి. వేపుడులా కావాలనుకుంటే నీళ్లను వేయాల్సిన అవసరం లేదు.
16. ముక్క ఉడికే దాకా చిన్న మంట మీద ఉడికించుకోవాలి. దించే ముందు పైన కొత్తిమీర తరుగున చల్లుకోవాలి.
17. అంతే చికెన్ చింతామణి రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.
వేపుడులా చేసినా ఇగురులా చేసినా కూడా చికెన్ చింతామణి రుచి అదిరిపోతుంది. దీనిలో మనం కారం మసాలా, గరం మసాలా వంటివి ఇవి వేయము. కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు చేసుకుని చూడండి మీకు నచ్చడం ఖాయం.
చికెన్ తో చేసిన వంటకాలు వారానికి రెండు మూడు సార్లు అయినా తినడం అవసరం. ఇది ఆరోగ్యానికి కూడా మేలే చేస్తుంది. దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి తీవ్రంగా బరువు పెరిగే అవకాశం ఉండదు. ఆయన చికెన్‌లో మితంగా తీసుకోవడమే ఆరోగ్యం. పిల్లలకు కూడా చికెన్ తో చేసినా వంటకాలు అప్పుడప్పుడు తినిపిస్తే వారికి ప్రోటీన్ అందుతుంది.