Onion Pickle: ఉల్లిపాయతో ఇలా నిల్వ పచ్చడి పెట్టేయండి, కూర లేకపోయినా అన్నం తినేయచ్చు, రెసిపీ ఇదిగో
Onion Pickle: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏదో ఒక పచ్చడి వేసుకుని తినేస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఇంట్లో నిల్వ పచ్చళ్లు కచ్చితంగా ఉంటాయి. ఇక్కడ మేము ఉల్లిపాయ నిల్వ పచ్చడి రెసిపీ ఇచ్చాము.
ఉల్లిపాయలు వంటింట్లో ఉండాల్సిన ముఖ్యమైన పదార్థాలు. పప్పు నుంచి బిర్యానీ వరకు ఏది వండాలన్నా ఉల్లిపాయలు ఉండాల్సిందే.ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఉల్లిపాయలు కూర చేసుకున్నా సరిపోతుంది. కూర వండే ఓపిక లేకపోతే ఎంతో మంది నిల్వ పచ్చళ్లు వేసుకుని అన్నం తినేస్తూ ఉంటారు. ఉల్లిపాయతో కూడా నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చడితో భోజనం చేసేయచ్చు. ఈ పచ్చడి ఎన్నో పోషకాలను కూడా కలిగి ఉంటుంది. ఈ ఉల్లిపాయ పచ్చడిని చాలా సులువగా పెట్టేయచ్చు. ఈ రెసిపీని ఫాలో అయిపోండి.
ఉల్లిపాయ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
ఉల్లిపాయలు - అయిదు
బెల్లం తురుము - మూడు స్పూన్లు
చింత పండు - ఉసిరికాయ సైజులో
ఎండు మిర్చి - 20
నూనె - అర కప్పు
మినపప్పు - ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
ఆవాలు - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - పది
కరివేపాకులు - గుప్పెడు
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
ఉల్లిపాయ పచ్చడి రెసిపీ
1. ఉల్లిపాయలను తొక్కను మీడియం సైజులో ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి.
2. ఎండు మిర్చిని కూడా నీటిలో వేసి అరగంట పాటూ నానబెట్టాలి.
3. మరో పక్క చింతపండును కూడా కొంచెం నీళ్లలో నానబెట్టాలి.
4. ఎండు మిర్చి మెత్తగా నానిని తరువాత మిక్సీలో జార్లో వేసుకోవాలి.
5. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, బెల్లం తురుము, చింతపండు గుజ్జు కూడా అందులో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
6. రుచికి సరిపడా ఉప్పును కూడా అందులో వేసి ఒకసారి రుబ్బుకోవాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
8. ఆ నూనెలో ఆవాలు, గుప్పెడు ఎండుమిర్చి, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కరివేపాకులు వేసి వేయించాలి.
9. ఈ మిశ్రమంలో రుబ్బుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
10. చిన్న మంట మీద ఉండి దీన్ని వేయిస్తూనే ఉండాలి.
11. నూనె పచ్చడి నుంచి విడిపోయి పైకి తేలుతుంది. ఆ సమయంలో స్టవ్ ఆఫ్ చేయాలి.
12. ఈ పచ్చడిని చల్లార్చి ఒక సీసాలో వేసి భద్రపరుచుకోవాలి. అంతే స్పైసీ ఉల్లిపాయ పచ్చడి రెడీ అయినట్టే.
ఈ ఉల్లిపాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. ఈ పచ్చడిని ఇడ్లీ, దోశెలు, ఊతప్పం వంటి వాటితో కూడా తినవచ్చు. ఈ పచ్చడిని ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల పాటూ తాజాగా ఉంటుంది. కాబట్టి ఉల్లిపాయ పచ్చడి ఒక్కసారి చేసుకుంటే బ్రేక్ ఫాస్ట్ కోసం ప్రత్యేకంగా పచ్చళ్లు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
టాపిక్