Chanakya Niti । జీవితంలో విజయం సాధించాలంటే ఈ మూడు సూత్రాలు పాటిస్తే చాలు!
29 November 2022, 15:08 IST
- Chanakya Niti for Success in Life: విజయం ఎవరికీ అంత సులభంగా దక్కదు. అయితే చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే విజయం తథ్యం.
Chanakya Niti
ప్రాచీన భారతదేశంలో ఆచార్య చాణక్యుడుకి విశేష స్థానం ఉంది. ఆయన వివిధ రంగాలలో శాస్త్రజ్ఞుడిగా పేరుగాంచారు. ఉపాధ్యాయుడిగా, తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, న్యాయవేత్తగా, వ్యూహకర్తగా, రాజ సలహాదారుగా ఇలా అనేక రంగాలలో అత్యుత్తమంగా నిలిచారు. ఆచార్య చాణక్యుడు తాను రచించిన నీతిశాస్త్రం ద్వారా మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేశారు. ఆయన బోధనలను ఆచరించడం ద్వారా ఏ వ్యక్తి అయినా విజయం పొందుతారు. అది ఆనాటి నుంచి నేటి కాలంలో కూడా రుజువు అవుతుంది.
నీతి శాస్త్రం మానవ సంబంధాలు, ఉద్యోగాలు, వ్యాపారం, ఆర్థిక వృద్ధి ఇలా అనేక అంశాల గురించి వివరిస్తుంది. మనిషి తన జీవితంలో ఏదైనా విషయంలో ఆందోళన చెందుతుంటే చాణక్య నీతులు తెలుసుకోవడం ద్వారా కచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. చాలా మంది తమ జీవితం వ్యర్థం అని, తాము ఫెయిల్యూర్ అని చింతిస్తుంటారు. కానీ చాణక్యుడి ప్రకారం వైఫల్యం కూడా విజయంలో ఒక భాగం.
Chanakya Niti for Success in Life- జీవితంలో విజయానికి చాణక్యుడు చెప్పిన సూత్రాలు
ఏ వ్యక్తి అయినా తన జీవితంలో విజయం సాధించాలంటే మూడు సూత్రాలను పాటించాలని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో తెలిపారు. అవేంటో ఇక్కడ చూడండి.
నిజాయితీ
ఆచార్య చాణక్య ప్రకారం, మీరు మీ లక్ష్యాలను సాధించాలంటే, అందుకు నిజాయితీగా ప్రయత్నించాలి. లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నప్పుడు మొహమాట పడకుండా అందరినీ కలుపుకుపోవాలి. లక్ష్యానికి అవసరమైన సంపూర్ణమైన సమాచారం ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఆ రంగంలోని అనుభవజ్ఞులైన వ్యక్తులతో మాట్లాడండి. షార్ట్‌కట్‌లు వెతకకుండా ఏది సరైనదో అదే మార్గంలో వెళ్లాలి. అబద్దపు ప్రయత్నాలతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు.
బాగా కష్టపడు
కష్టం ఎప్పుడూ ఎవరికీ ఇష్టమైనది కాదు, కానీ ఆ కష్టం తర్వాత వచ్చే ఫలితాన్ని ఇష్టపడతారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం, కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ భయపడకండి. లక్ష్యం దిశగా ముందడుగు వేస్తున్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. వరుస వైఫల్యాలతో మీరు నిరాశ చెందవచ్చు, కానీ దాని గురించి చింతించవద్దు. దు:ఖంలో ఉన్నాసరే దృఢంగా ఎదుర్కొని ముందుకు సాగాలి. ఒకసారి విజయం దక్కిందటే, మీకు ఉన్న ఈ అనుభవంతో వరుస విజయాలు సాధించవచ్చు.
ప్రణాళిక- గోప్యత
ఆచార్య చాణక్య ప్రకారం, విజయం సాధించాలంటే అందుకు కచ్చితంగా ఒక బలమైన ప్రణాళిక అంటూ ఉండాలి. మీరు సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఒక్కో అడుగు ముందుకు వేయండి. అదే సమయంలో మీ ప్రణాళికను ఒక మంత్రంలా రహస్యంగా ఉంచాలి, పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. మీరు మీ ప్రణాళికను ఎంత రహస్యంగా ఉంచుకుంటే, మీరు అంత సులభంగా విజయం సాధిస్తారు. ప్రణాళిక పూర్తికాకముందే మీరు ఎవరికైనా చెబితే, జనం మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. మీ శత్రువు మీ మార్గంలో ఇబ్బందులను సృష్టిస్తూ, తాను ప్రయోజనం పొందవచ్చు. కాబట్టి మీ లక్ష్యం, ప్రణాళికపై మీకు స్పష్టత ఉంటే చాలు, అది అందరికీ తెలియాల్సిన పనిలేదు. మొదలు పెట్టిన కార్యాన్ని పూర్తి చేసేవరకు విశ్రమించవద్దు.
ఈ మూడు సూత్రాలను పాటిస్తే ఏ వ్యక్తి అయినా విజయం సాధిస్తారు.