Chanakya Niti । డబ్బు, హోదా, ఆత్మ సంతృప్తి ఈ మూడు దక్కాలంటే మీలో ఈ లక్షణాలు ఉండాలి!
30 November 2022, 15:05 IST
- Chanakya Niti: ఏ మనిషైనా జీవితంలో కోరుకునేది ఏమిటి? అవసరాలకు డబ్బు, సమాజంలో మంచి గౌరవం, గుండె నిండా ఆత్మసంతృప్తి. మరి ఈ మూడు కలగాలంటే ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకోండి.
Chanakya Niti
దైనందిన జీవితంలో అనేక అంశాలపై చాణక్యుడుకి విశేషమైన జ్ఞానం కలిగి ఉండేవారు. ఆయన బోధనలు అందరికీ అమోదయోగ్యంగా నిలిచాయి అందుకే ఆయన ఒక ఎవర్‌గ్రీన్ ఆచార్యుడు అనిపించుకున్నారు. ఆచార్య చాణక్యుడు అందించిన నీతిశాస్త్రం జీవితంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నీతి, నియమాల గురించి తెలియజేస్తుంది. ఏ వ్యక్తి అయినా తలెత్తుకొని జీవించాలంటే చాణక్యుడి నీతి సూత్రాలను అనుసరించడం ద్వారా అది సాధ్యమవుతుంది.
వైవాహిక జీవితం, సంబంధ బాంధవ్యాలు, ఉద్యోగం, వ్యాపారం వంటి విషయాల గురించి ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ప్రస్తావించారు. అవినీతి రాజ్యమేలుతున్న ఈరోజుల్లో చాణక్యుడి నీతి సూత్రాలను ఒక్కసారి అర్థం చేసుకుంటే అసలైన ఆనందం ఏమిటి అనేది బోధపడుతుంది. ఈరోజు డబ్బు ఏ ఆటనైనా ఆడిస్తుంది, కానీ డబ్బు ఎంత సంపాదించిన ఆత్మ సంతృప్తి లభించడం లేదు. ఇంకా సంపాదించాలనే యావ కనిపిస్తోంది. డబ్బు కోసం చేసే నేరాలు, పరాయి స్త్రీలపై మోజు, అక్రమ సంబంధాలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. చిట్టచివరికి ఏం సాధించకుండా, ఆత్మసంతృప్తి లేకుండా తమ జీవితాలను ముగించేవారు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు.
Chanakya Niti for Self-Satisfaction- ఆత్మ సంతృప్తి చాణక్యుడి సూచనలు
ఏ వ్యక్తికైనా లక్ష్మీ కటాక్షం, సమాజంలో గౌరవం, ఆత్మ సంతృప్తి లభించాలంటే అందుకు ఆచార్య చాణక్యుడు కొన్ని సూచనలు చేశారు. అవేంటో ఇక్కడ చూడండి.
1) ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి ఎప్పుడూ తన వద్ద ఉన్న డబ్బుతో అసంతృప్తి చెందకూడదు. ఇతరులతో తనని తాను పోల్చుకోకూడదు. అంతే కాకుండా అందం, ఆహారం విషయంలోనూ అసంతృప్తి ఉండకూడదు. ఉన్న వాటితో సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి, మరో మెట్టు ఎదిగేందుకు ప్రయత్నించాలి.
2) చాణక్యుడి ప్రకారం, జ్ఞానం లేని జీవితం అసంపూర్ణం. జ్ఞానం సంపాదించని మనిషికి విజయం లభించదు. అందుకే మనిషికి జ్ఞానం ఉండాలి.
3) చాణక్య నీతి ప్రకారం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ లాభనష్టాల గురించి ఆలోచించండి. దీని వల్ల మీరు జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కోరు.
4) చాణక్య నీతి ప్రకారం వివాహానంతరం ఇతర స్త్రీల పట్ల ఆకర్షితులు కాకూడదు. ఇది మీ వైవాహిక జీవితంలో సమస్యలను సృష్టించవచ్చు.
5) చాణక్యుడి నీతి ప్రకారం మీ కంటే ఎక్కువ లేదా తక్కువ హోదా ఉన్న వ్యక్తులతో స్నేహం చేయవద్దు. అలాంటి వారి స్నేహం మిమ్మల్ని ఎప్పుడూ సంతోషపెట్టదు. ఈ రకమైన స్నేహంతో మీరు ఏదో ఒకరోజున అవమానానికి గురవుతారు.
6) చాణక్యుడి ప్రకారం, ఇతరుల తప్పుల నుండి ఎల్లప్పుడూ నేర్చుకోండి. తప్పుల నుంచి ఒప్పులు నేర్చుకున్న వ్యక్తులు ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు. అలాంటి వ్యక్తులే జీవితంలో చాలా దూరం వెళ్లి అపారమైన విజయాలు సాధిస్తారు.
ఈ సూత్రాలను పాటించే వ్యక్తులకు అవసరానికి డబ్బు, సమాజంలో మంచి గౌరవం, జీవితంలో ఆత్మసంతృప్తి మూడు కచ్చితంగా లభిస్తాయి.
టాపిక్