CauliFlower Masala rice: కాలీఫ్లవర్ మసాలా రైస్, లంచ్ బాక్స్ రెసిపీగా ఇలా ఉండేయండి
04 October 2024, 17:30 IST
- CauliFlower Masala rice: కాలీఫ్లవర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాలీఫ్లవర్ కూర నచ్చకపోతే కాలీఫ్లవర్ మసాలా రైస్‌ను వండి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
కాలీఫ్లవర్ మసాలా రైస్ రెసిపీ
కాలిఫ్లవర్ కూరను కొంతమంది ఇష్టపడతారు, మరి కొంతమంది ఇష్టపడరు. కానీ కాలీఫ్లవర్ మసాలా రైస్ చేసుకొని తిని చూడండి. ప్రతి ఒక్కరికీ ఇది నచ్చుతుంది. లంచ్ బాక్స్‌లోను, రాత్రి డిన్నర్ లోనూ కూడా దీన్ని వండుకోవచ్చు. పక్కన రైతా పెట్టుకొని ఈ కాలీఫ్లవర్ రైస్ తింటే ఆ రుచే వేరు. దీన్ని చేయడం చాలా సులువు. కాలీఫ్లవర్ పురుగులు ఉంటాయని ఎంతోమంది తెచ్చుకోరు. కాస్త జాగ్రత్తగా పురుగులు లేని కాలీఫ్లవర్‌ని ఎంపిక చేసుకొని తెచ్చి ఒకసారి కాలీఫ్లవర్ మసాలా రైస్ వండి చూడండి. మీ ఇంట్లో ఉన్న వారంతా దానికి అభిమానులు అయిపోవడం ఖాయం. కాలీఫ్లవర్ మసాలా రైస్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కాలీఫ్లవర్ మసాలా రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్ ముక్కలు - ఒక కప్పు
బియ్యం - ఒకటిన్నర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - ఒక స్పూను
నీరు - తగినంత
జీలకర్ర - ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్
పచ్చిమిర్చి - రెండు
పచ్చి బఠానీలు - గుప్పెడు
గరం మసాలా - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ధనియాల పొడి - ఒక స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
నూనె - తగినంత
పుదీనా తరుగు - రెండు స్పూన్లు
కాలీఫ్లవర్ మసాలా రైస్ రెసిపీ
1. కాలీఫ్లవర్ మసాలా రైస్ చేయడానికి ముందుగానే అన్నాన్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. అన్నం 80 శాతం ఉడికితే చాలు పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు.
3. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి కాలీఫ్లవర్ ముక్కలు, నీళ్లు, చిటికెడు ఉప్పు, పసుపు వేసి పది నిమిషాలు ఉడికించి వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. ఆ నూనెలో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. బఠానీలను కూడా వేసి వేయించుకోవాలి.
6. ఆ తర్వాత కాలీఫ్లవర్ ముక్కలను వేసి వేయించాలి.
7. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. పుదీనా తరుగు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి.
8. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసి పులిహోర లాగా కలుపుకోవాలి.
9. పైన కొత్తిమీరను చల్లుకోవాలి.
10. చిన్న మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
11. తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతే టేస్టీ కాలీఫ్లవర్ మసాలా రైస్ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.
కాలీఫ్లవర్ తో ఆరోగ్యం
కాలీఫ్లవర్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు చేకూరుతాయి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కాలీఫ్లవర్ ముందుంటుంది. అలాగే చర్మంపై మచ్చలు రాకుండా కూడా ఇది కాపాడుతుంది. శరీరంలో ఉన్న వ్యర్ధాలను, విషాలను బయటకు పంపించేందుకు కాలీఫ్లవర్ సహాయపడుతుంది. రక్తపోటు ఉన్నవారు కచ్చితంగా కాలీఫ్లవర్ ను తినాలి. హై బీపీ ఉన్నవారు కాలీఫ్లవర్ ని తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడే గుణం కూడా కాలీఫ్లవర్ కు ఉంది. కాబట్టి వారానికి ఒకసారైనా కాలీఫ్లవర్ తినేందుకు ప్రయత్నించండి. ఇది సీజనల్‌గా దొరికేదే కాబట్టి దీన్ని కచ్చితంగా తినాల్సిన అవసరం ఉంది.
టాపిక్