Cauliflower Rasam: రెగ్యులర్ రసం బోర్ కొడితే ఒకసారి కాలీఫ్లవర్ రసం చేసుకుని చూడండి, వెరీ టేస్టీ-cauliflower rasam recipe in telugu know how to make this charu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cauliflower Rasam: రెగ్యులర్ రసం బోర్ కొడితే ఒకసారి కాలీఫ్లవర్ రసం చేసుకుని చూడండి, వెరీ టేస్టీ

Cauliflower Rasam: రెగ్యులర్ రసం బోర్ కొడితే ఒకసారి కాలీఫ్లవర్ రసం చేసుకుని చూడండి, వెరీ టేస్టీ

Haritha Chappa HT Telugu
Aug 02, 2024 11:30 AM IST

Cauliflower Rasam: ఎన్ని కూరలు ఉన్నా పక్కన రసం ఉండాల్సిందే. ఆరోగ్యానికి రసం ఎంతో మేలు చేస్తుంది. ఒకసారి కాలీఫ్లవర్‌తో కూడా రసం వండుకొని చూడండి. ఇది మీకు ఎంతో నచ్చుతుంది.

కాలిఫ్లవర్ రసం రెసిపీ
కాలిఫ్లవర్ రసం రెసిపీ (Youtube)

Cauliflower Rasam: టమోటో రసం, చింతపండు రసం ఎక్కువగా తెలుగిళ్లల్లో కనిపిస్తూ ఉంటాయి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో చారు అని కూడా పిలుస్తారు. ఎప్పుడూ ఒకేలా చారును వండుకుంటే కొత్తదనం ఏముంది? ఓసారి టమోటో రసంలాగే కాలీఫ్లవర్‌తో రసం పెట్టి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కూర అవసరం లేకుండానే దీన్ని తినేయవచ్చు. కాలీఫ్లవర్‌ను తినడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటిని వండడం చాలా సులభం. కాబట్టి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కాలీఫ్లవర్ రసం రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కాలీఫ్లవర్ ముక్కలు - ఒక కప్పు

కందిపప్పు - ఒక స్పూను

శనగపప్పు - ఒక స్పూను

చింతపండు - నిమ్మకాయ సైజులో

జీలకర్ర - ఒక స్పూను

మిరియాలు -ఒక స్పూను

టమాటాలు - రెండు

పచ్చిమిర్చి - రెండు

కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - పావు స్పూను

కరివేపాకులు - గుప్పెడు

నెయ్యి - ఒక స్పూను

ఎండుమిర్చి - రెండు

ఆవాలు - అర స్పూను

నీళ్లు - తగినన్ని

కాలీఫ్లవర్ రసం రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి కందిపప్పు, శనగపప్పు వేసి వేయించాలి.

2. అలాగే మిరియాలు, జీలకర్రను కూడా వేసి వేయించాలి. వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన అదే కళాయిలో నెయ్యిని వేయాలి.

4. ఆ నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు, ఎండుమిర్చి వేసి చిటపటలాడించాలి.

5. అందులోనే కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి వేయించాలి.

6. టమాటోను సన్నగా తరిగి అవి కూడా వేసి బాగా వేయించాలి.

7. ఈ రెండూ బాగా ఉడికి ఇగురులాగా అవుతాయి. ఆ సమయంలో నీళ్లను పోయాలి.

8. మీకు రసం ఎంత ఎక్కువ కావాలనుకుంటున్నారో అంత నీటిని పోసుకోవాలి.

9. ఇందులోనే పచ్చిమిర్చి తరుగును, నానబెట్టిన చింతపండు పులుసును, ఉప్పు, పసుపు కూడా వేసి కలుపుకోవాలి.

10. ముందుగా చేసి పెట్టుకున్న పొడిని వేసి బాగా కలుపుకోవాలి.

11. అందులోనే కొత్తిమీర తరుగును వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.

12. దీన్ని మీడియం మంట మీద మరిగించాలి.

13. ఘుమఘుమలాడే వాసన వచ్చేవరకు మరిగించాలి.

14. దాదాపు అరగంట సేపు మరిగిస్తే రసం రెడీ అయిపోతుంది.

15. స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో ఈ రసాన్ని కలుపుకొని తాగితే టేస్టీగా ఉంటుంది.

16. టమోటో రసం సాధారణ చారు కన్నా ఇది రుచిగా ఉంటుంది.

17. పైగా ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది. ఇది ఉంటే కూర కూడా అవసరం లేదు. అప్పడాలు, వడియాలు వేపుకుంటే సరిపోతుంది.

కూరా, చారు, పచ్చడి... అన్నీ వండుకునే ఓపిక లేనప్పుడు కాలీఫ్లవర్ రసం ఒకటి పెట్టుకుంటే చాలు. అన్నం తినేయచ్చు. దీంతో పాటు పక్కన వడియాలు అప్పడాలో ఉంటే సరిపోతుంది. కాలీఫ్లవర్లో ఉన్న పోషకాలు అన్నీ ఈ రసంలో ఉంటాయి. ఇందులో మనం కాలీఫ్లవర్, టమోటోలు, కొత్తిమీర ఎక్కువగా వాడేమో ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. ఒక్కసారి ఈ కాలీఫ్లవర్ రసం చేసుకుని చూడండి. మీకు కచ్చితంగా ఇది నచ్చుతుంది.

Whats_app_banner