Cauliflower Rice: కాలీఫ్లవర్ రైస్ ఇలా చేస్తే పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా బాగుంటుంది
Cauliflower Rice: కాలీఫ్లవర్‌తో చేసే వంటకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా ఒకసారి కాలీఫ్లవర్ రైస్ రెసిపీ ప్రయత్నించండి. ఇది వారికి కచ్చితంగా నచ్చుతుంది.
Cauliflower Rice: పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఒకసారి కాలీఫ్లవర్ రైస్ పెట్టి చూడండి. వారు ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం చాలా సులువు. ఈ కాలీఫ్లవర్ రైస్‌లో క్యాప్సికం, బేబీ కార్న్ వేస్తే మరిన్ని పోషకాలు అందుతాయి. దీన్ని చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. కాబట్టి పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టడానికి సులువుగా ఉంటుంది. ఈ వంటకాన్ని కీటో డిష్ గా చెప్పుకోవచ్చు. కీతో డైట్ పాటించేవారు ఈ రెసిపీని తింటూ ఉంటారు.
కాలీఫ్లవర్ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కాలీఫ్లవర్ ముక్కలు - ఒక కప్పు
అన్నం - ఒక కప్పు
క్యాప్సికం - ఒకటి
బేబీ కార్న్ - 5
ఉల్లికాడలు- మూడు
సోయాసాస్ - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - చిటికెడు
వెల్లుల్లి రెబ్బలు - ఐదు
పచ్చి బఠానీలు - పావు కప్పు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
కాలీఫ్లవర్ రైస్ రెసిపీ
1. కాలీఫ్లవర్ చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
2. నీరు వేయకూడదు. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేయాలి.
4. ఆ నూనెలో కచ్చాపచ్చాగా రుబ్బుకున్న కాలీఫ్లవర్ మిశ్రమాన్ని వేసి ఐదు నుంచి ఏడు నిమిషాలు చిన్న మంట మీద రోస్ట్ చేయాలి.
5. దీనివల్ల పచ్చివాసన పోతుంది. ఆ మిశ్రమంలో సన్నగా తరిగిన వెల్లుల్లిని కూడా వేయాలి.
6. అలాగే తరిగిన ఉల్లికాడలు, పచ్చి బఠానీలను వేసి వేయించుకోవాలి.
7. ఇవన్నీ వేగుతున్నప్పుడే చిన్న ముక్కలుగా కోసిన క్యాప్సికం, బేబీ కార్న్‌లను కూడా వేసి వేయించాలి.
8. ఉప్పు, కారం చల్లి వీటన్నింటిని పచ్చివాసన పోసే పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
9. పైన మిరియాల పొడిని చల్లుకోవాలి. ఇవి కాస్త ఉడికాక నీటిని విడుదల చేస్తాయి.
10. ఆ నీరు కూడా ఆవిరిపోయి ఫ్రై లాగా ఈ మిశ్రమం అయ్యే వరకు వేయించాలి.
11. పైన సోయా సాస్‌ను వేసుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించుకున్న అన్నం చేసి ఓసారి కలుపుకోవాలి.
12. పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.
13. అంతే కాలీఫ్లవర్ రైస్ రెసిపీ సిద్ధమైనట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి వండి చూడండి మీ పిల్లలకు నచ్చడం ఖాయం. దీనిలో కాలిఫ్లవర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఎన్నో పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.
కాలీఫ్లవర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ సి, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. అలాగే మన శరీరానికి అత్యవసరమైన ఫోలేట్ కూడా ఉంటుంది. ఇది మన శరీరంలోని కణాల పెరుగుదలకు అవసరం. గర్భిణీ స్త్రీలు కచ్చితంగా తినాల్సిన వాటిలో కాలీఫ్లవర్ ఒకటి. ఎందుకంటే దీని ద్వారా ఫోలేట్ అందుతుంది. కాబట్టి పిండం ఆరోగ్యంగా ఎదుగుతుంది. కాలీఫ్లవర్ తినడం వల్ల ఎలాంటి కొలెస్ట్రాల్ శరీరంలో చేరుకాదు. కాబట్టి బరువు తగ్గాలనుకున్నవారు కాలీఫ్లవర్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనిలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండవు. అలాగే సోడియం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి హైబీపీతో బాధపడే వారు కాలీఫ్లవర్ తినవచ్చు. అయితే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్‌ను తక్కువగా తింటే మంచిది. అంటే తినేటప్పుడు ఎక్కువ మొత్తంలో తినకుండా చిన్న చిన్న భాగాలుగా చేసుకుంటే ఉత్తమం. ఇది ఒక్కోసారి గ్యాస్ ఉత్పత్తి చేసేందుకు సహకరిస్తుంది. పిల్లలకు ఒకసారి ఇలా కాలీఫ్లవర్ రైస్ రెసిపీ పెట్టి చూడండి. వారు ఇష్టంగా తింటారు.