Cauliflower Bonda: ఆలూ బోండాలకు బదులు ఈసారి కాలీఫ్లవర్ బోండాలు ట్రై చేయండి, రెసిపీ ఇదిగో
01 March 2024, 6:00 IST
- Cauliflower Bonda: అల్పాహారంలో గట్టిగా తినాలని చెబుతారు పోషకాహార నిపుణులు. మైసూర్ బోండాలు, ఆలూ బోండాలు తిని బోర్ కొడితే ఒకసారి కాలీఫ్లవర్ బోండాలు చేసుకుని చూడండి. ఈ రెసిపీ చాలా సులువు.
కాలిఫ్లవర్ బోండాల రెసిపీ
Cauliflower Bonda: మైసూర్ బోండాలు, పునుకులు, ఆలూ బోండాలు, దోశ, ఇడ్లీ ఇలాంటివన్నీ తరచూ తినేవే. ఓసారి కొత్తగా బ్రేక్ ఫాస్ట్‌లో కాలీఫ్లవర్ బోండాలను ప్రయత్నించండి. ఇది శరీరానికి కావలసిన పోషకాలను అందించడంతోపాటు రోజంతా శక్తిని అందిస్తుంది. అలాగే బరువు పెరగకుండా కూడా కాపాడుతుంది. దీంతో పాటు పుదీనా చట్నీ తోడుగా ఉంటే రుచి అదిరిపోతుంది. పిల్లలకు ఈ రెసిపీ నచ్చడం ఖాయం. కాలీఫ్లవర్ బోండా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కాలీఫ్లవర్ బోండా రెసిపీకి కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్ ముక్కలు - ఒక కప్పు
బియ్యప్పిండి - 50 గ్రాములు
శెనగపిండి - పావు కిలో
పచ్చిమిర్చి - ఏడు
కారం - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - అర స్పూను
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
బేకింగ్ సోడా - పావు స్పూను
నీరు - సరిపడినంత
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
కాలీఫ్లవర్ బోండాల రెసిపీ
1. కాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా విడదీసుకోవాలి.
2. పచ్చిమిర్చిని కడిగి మిక్సీ జార్లో వేయాలి. ఆ పచ్చిమిర్చిలో జీలకర్ర వేసి మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక గిన్నెలో కాలీఫ్లవర్‌ను వేసి నీటిని వేయాలి. స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడికించాలి.
4. తరువాత వాటిని వడకట్టి కాలీఫ్లవర్‌ను ఒక గిన్నెలో వేసుకోవాలి.
5. ఆ గిన్నెలో రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర మిశ్రమం, బియ్యప్పిండి, కొత్తిమీర తరుగు, బేకింగ్ సోడా, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి.
6. ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసుకోవాలి.
8. మరోపక్క ఒక గిన్నెలో శనగపిండి, ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. నీటిని కూడా వేసి కాస్త చిక్కగా కలుపుకోవాలి.
9. ఇప్పుడు కాలీఫ్లవర్ ముద్దను తీసుకొని రౌండ్‌గా చుట్టి ఆ శెనగపిండి మిశ్రమంలో ముంచాలి.
10. దాన్ని వేడి నూనెలో వేసి అన్ని వైపులా కాల్చుకోవాలి.
11. ఇలా మొత్తం మిశ్రమాన్ని ఉండల్లా చేసి శనగపిండిలో ముంచి నూనెలో వేయించుకోవాలి.
12. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని పుదీనా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.
కాలీఫ్లవర్ ఆరోగ్యానికి మంచిదే. కాబట్టి ఉదయాన్నే తినడం వల్ల ఎలాంటి సమస్య రాదు. పిల్లలకు కూడా ఈ బ్రేక్ ఫాస్ట్ నచ్చే అవకాశం ఉంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే అల్పాహారంలో ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినమని చెబుతారు. కాలీఫ్లవర్ లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లో చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి ఇది ఉదయాన్నే అల్పాహారంలో తినడం వల్ల అంతా ఆరోగ్యమే. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు కాలీఫ్లవర్‌ను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అలాగే చర్మవ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలో ఇన్ఫ్మమేషన్‌ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. కాబట్టి కాలీఫ్లవర్ తో చేసిన వంటకాలు అల్పాహారంలో తినడం వల్ల అంతా మేలే జరుగుతుంది.