Gatte ki sabzi: రాజస్థానీ స్పెషల్ కర్రీ.. గట్టే కీ సబ్జీ.. శనగపిండి ఉంటే చాలు..
Gatte ki sabzi: గట్టే అంటే శనగపిండితో చేసే కుడుముల్లాంటివి. వాటితో చేసే గట్టే కీ సబ్జీని ఇంట్లోనే సులువుగా, పక్కా కొలతలతో ఎలా చేయాలో చూసేయండి.
గట్టే కీ సబ్జీ అనేది ఒక రాజస్థానీ కర్రీ రెసిపీ. గట్టే అంటే శనగపిండితో చేసిన కుడుములు అనుకోవచ్చు. వాటితో చేసే కూరనే గట్టే కీ సబ్జీ అంటాం. శనగపిండి కుడుముల్ని ఉడికించుకుని మంచి మసాలాలున్న గ్రేవీలో ఉడికించుకుని ఈ కూర చేస్తారు. దీన్ని చపాతీలోకి, పుల్కాల్లోకి, నాన్స్ లోకి తిన్నా అదిరిపోతుంది. అన్నం, పప్పుతో పాటూ ఈ కూరను వేసుకుని తిన్నా నచ్చేస్తుంది. తయారీ విధానం కాస్త వివరంగా, సులభంగా అర్థమయ్యేట్టు కుడుముల్ని, కూరని ఎలా చేసుకోవాలో విడివిడిగా చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు:
గట్టే తయారీకి కావాల్సినవి:
ముప్పావు కప్పు శనగపిండి
పావు చెంచా పసుపు
పావు చెంచా కారం
పావు చెంచా జీలకర్ర
పావు చెంచా గరం మసాలా
1 చెంచా నూనె
కొద్దిగా ఉప్పు
గ్రేవీ కోసం కావాల్సినవి:
పావు చెంచా ఆవాలు
పావు చెంచా జీలకర్ర
చిటికెడు ఇంగువ
1 చెంచా అల్లం తురుము
1 పచ్చిమిర్చి తరుగు
1 ఉల్లిపాయ, సన్నని ముక్కలు
అరచెంచా ధనియాల పొడి
అరచెంచా కారం
పావు చెంచా గరం మసాలా
2 చెంచా నెయ్యి లేదా నూనె
కొద్దిగా కొత్తిమీర తరుగు
తయారీ విధానం:
- ఒక గిన్నెలో శనగపిండి, పసుపు, కారం, జీలకర్ర, గరం మసాలా, చెంచా నూనె, ఉప్పు వేసుకుని బాగా కలపుకోవాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దలా, చపాతీ పిండిలాగా కలుపుకోవాలి.
- చేతికి నూనె రాసుకుని ఈ పిండిని పొడవుగా, గుండ్రంగా రోల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇక పాత్రలో మూడు కప్పుల నీళ్లు పోసుకుని బాగా మరగనివ్వాలి. ముందుగా సిద్దం చేసుకున్న రోల్స్ ఈ నీళ్లలో వేసుకోవాలి.
- ఒక పది నిమిషాలకు అవి ఉడికి పైకి తేలతాయి. ఇప్పుడు వాటిని బయటికి తీసి పక్కన పెట్టుకుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇవి ఉడికించిన నీళ్లని గ్రేవీ కోసం వాడుకోవాలి.
- ఇప్పుడు కడాయిలో ఒక చెంచా నూనె వేసుకుని కట్ చేసుకున్న గట్టే వేసుకుని వేయించుకోవాలి. రెండు నిమిషాలు వేగాక పక్కన పెట్టుకోవాలి.
- మరో చెంచా నూనె తీసుకుని వేడెక్కాక ఆవాలు వేసుకుని చిటపటలాడనివ్వాలి. పావు చెంచా జీలకర్ర, ఇంగువ, అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసుకుని వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేగనివ్వాలి.
- ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఉప్పు వేసుకుని వేగాక కొద్దిగా పెరుగు వేసుకుని బాగా కలపాలి. నూనె పైకి తేలాక ఒక కప్పు నీల్లు పోసుకోవాలి. ఇప్పుడు నీల్లు మరుగుతున్నప్పుడు ముందుగా చేసుకున్న గట్టే వేసుకోవాలి. గ్రేవీ చిక్క బడే దాకా ఉడికించుకోవాలి. కొత్తిమీర చల్లుకుని దించుకోవాలి. అంతే రాజస్థానీ స్పెషల్ గట్టే కీ సబ్జీ తయార్.