Crispy cauliflower fry: కాలీఫ్లవర్ వేపుడు ఇలా క్రిస్పీగా చేస్తే టేస్టీగా ఉంటుంది, సాంబార్‌కి జతగా అదిరిపోతుంది
Crispy cauliflower fry: కాలీఫ్లవర్ కర్రీని ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ గోబీ మంచూరియాను మాత్రం ఎంతో లైక్ చేస్తారు. ఒకసారి ఇంట్లోనే కాలీఫ్లవర్ వేపుడు క్రిస్పీగా చేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
Crispy cauliflower fry: సాంబారో, రసం చేసినప్పుడు దాంతోపాటు ఏదో ఒక వేపుడు జతగా ఉండాల్సిందే. ఒకసారి కాలీఫ్లవర్ వేపుడు ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టపడతారు. వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకుని ఈ క్రిస్పీ కాలీఫ్లవర్ వేపుడు నంజుకుంటే ఆ టేస్టే వేరు. దీన్ని చేయడం చాలా సులువు.
క్రిస్పీ కాలీఫ్లవర్ వేపుడు రెసిపీకి కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్ ముక్కలు - ఒక కప్పు
కార్న్ ఫ్లోర్ - అరకప్పు
వెల్లుల్లి పొడి - ఒక స్పూను
కారం - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - పావు స్పూను
నూనె - వేయించడానికి సరిపడా
పసుపు - అర స్పూన్
బియ్యప్పిండి - పావు కప్పు
పచ్చిమిర్చి - రెండు
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
క్రిస్పీ కాలీఫ్లవర్ వేపుడు రెసిపీ
1. కాలీఫ్లవర్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఒక గిన్నెలో వెల్లుల్లి పొడి, కారం, ఉప్పు, మిరియాలపొడి, కార్న్ ఫ్లోర్, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. పసుపును కూడా వేయాలి.
3. ఇప్పుడు అందులో ముక్కలుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ వేసి బాగా కలపాలి.
4. అవసరమైతే కాస్త నీటిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి దానికి సరిపడా నూనెను వేయాలి.
5. ఈ కాలీఫ్లవర్ ముక్కలను అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
6. మూడు నాలుగు నిమిషాలు వేయిస్తే కాలీఫ్లవర్ త్వరగా వేగిపోతుంది.
7. ఆ తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
9. అందులో జీలకర్ర, ఆవాలు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకులు వేసి వేగనివ్వాలి.
10. ఆ తర్వాత వేయించుకున్న క్రిస్పీ కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసి ఒకసారి టాస్ చేయాలి.
11. అంతే క్రిస్పీ కాలీఫ్లవర్ వేపుడు రెడీ అయినట్టే.
12. దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది.
13. కాలిఫ్లవర్ ముక్కలను మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవద్దు.
14. కాస్త సన్నగా, నిలువుగా కట్ చేసుకుంటే మరింత క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది.
కాలీఫ్లవర్ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్రకోలి, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఒకే జాతికి చెందినవి. అయితే కాలీఫ్లవర్ ను వారానికి ఒకటి రెండు సార్లు తింటే ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుంది. కానీ అధికంగా తింటే మాత్రం కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా గ్యాస్ అధికంగా ఉత్పత్తి కావచ్చు. కాబట్టి వారానికి రెండుసార్లకు మించి కాలీఫ్లవర్ తినక పోవడమే మంచిది. మితంగా కాలీఫ్లవర్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన కూరగాయల జాబితాలోకి వస్తుంది. దీని మితంగా తింటే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గే ప్రయాణంలో మీకు సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ అధికమే, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కాలీఫ్లవర్ లో 92 శాతం వరకు నీరే ఉంటుంది. శరీరం డిహైడ్రేషన్ సమస్యకు గురికాకుండా కాలీఫ్లవర్ కాపాడుతుంది. అలాగే పొట్టలోని ఆరోగ్యకరమైన పేగులను కాపాడే శక్తి కూడా కాలీఫ్లవర్ కి ఉంది. మధుమేహం ఉన్నవారు కాలీఫ్లవర్ ను వారానికి రెండుసార్లు తింటే ఎంతో మేలు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తికి బలాన్ని అందిస్తాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు మాత్రం దీన్ని తక్కువగా తినడం ఉత్తమం. కాలీఫ్లవర్ తో ఎన్నో రకాల రెసిపీలు చేసుకోవచ్చు. ఇవన్నీ టేస్టీగా ఉంటాయి. గోబీ మంచూరియా, గోబీ పులావ్, గోబీ ఫ్రై ఇవన్నీ కూడా ఎంతో మందికి నచ్చుతాయి. ఇక్కడ మేము క్రిస్పీ కాలీఫ్లవర్ ఫ్రై రెసిపీ ఇచ్చాము. ఒకసారి ప్రయత్నించి చూడండి.
టాపిక్