తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Carrot Omelette: సాయంత్రం పూట పిల్లలకు క్యారెట్ ఆమ్లెట్ పెట్టండి, చురుకుగా ఉంటారు

Carrot omelette: సాయంత్రం పూట పిల్లలకు క్యారెట్ ఆమ్లెట్ పెట్టండి, చురుకుగా ఉంటారు

Haritha Chappa HT Telugu

19 March 2024, 15:30 IST

google News
    • Carrot omelette: స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఖచ్చితంగా శక్తివంతమైనది ఏదో ఒకటి తినిపించాలి. క్యారెట్ ఆమ్లెట్ తినిపించడం వల్ల వారు మళ్ళీ చురుగ్గా మారుతారు.
క్యారెట్ ఆమ్లెట్ రెసిపీ
క్యారెట్ ఆమ్లెట్ రెసిపీ (pixabay)

క్యారెట్ ఆమ్లెట్ రెసిపీ

Carrot omelette: ఉదయం నుంచి స్కూల్లో ఉన్న పిల్లలు సాయంత్రానికి నీరసపడిపోతారు. ఇంటికి వచ్చిన పిల్లలకు తల్లిదండ్రులు ఏం తినిపించాలని? ఆలోచిస్తారు. ప్రతిరోజూ పాలు కాకుండా ఒక్కోరోజు క్యారెట్ ఆమ్లెట్ వంటివి తినిపించి చూడండి. ఇది ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. వారికి నీరసం రానివ్వదు. చక్కగా నిద్ర పట్టేలా కూడా ప్రోత్సహిస్తుంది. దీన్ని తయారు చేయడం చాలా సులువు. కేవలం పావుగంటలో దీన్ని తయారు చేసి పిల్లలకు తినిపించవచ్చు. దీని ఎలాగో ఇప్పుడు చూద్దాం.

క్యారెట్ ఆమ్లెట్ రెసిపీకి కావలసిన పదార్థాలు

క్యారెట్ తురుము - పావు కప్పు

గుడ్లు - రెండు

ఉల్లిపాయ - ఒకటి

మిరియాలపొడి - అర స్పూను

పచ్చిమిర్చి - ఒకటి

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

క్యారెట్ ఆమ్లెట్ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక్క స్పూను నూనె వేయాలి.

2. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తురిమిన క్యారెట్ వేసి వేయించుకోవాలి.

3. అవి బాగా వేగాక స్టవ్ కట్టేయాలి.

4. ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కోడిగుడ్లను కొట్టి బాగా గిలకొట్టాలి.

5. అందులోనే అర స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుమును వేసి బాగా కలుపుకోవాలి.

6. పైన కొత్తిమీర తరుగును కూడా చల్లుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి.

8. ఈ గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్ లా పోసుకోవాలి.

9. రెండు వైపులా కాల్చాక తీసి ప్లేట్లో వేసి పిల్లలకు సర్వ్ చేయాలి.

10. దీన్ని చేయడం చాలా సులువు. కాబట్టి వారానికి రెండు మూడు సార్లు ఇలా క్యారెట్ ఆమ్లెట్‌ను తినిపించడం వల్ల పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందుతాయి.

11. దీన్ని కేవలం కేవలం సాయంత్రం పూట మాత్రమే కాదు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా కూడా అందించవచ్చు.

12. దీనిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజంతా పిల్లలు చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు.

గుడ్డుతో చేసిన వంటకాలు అన్ని రకాల ఆరోగ్యకరమే. ఒక గుడ్డులో మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే దీన్ని సంపూర్ణ ఆహారంగా చెబుతారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో లేదా సాయంత్రం స్నాక్స్ లో గుడ్డును భాగం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు గుడ్డును తినిపించాల్సిన అవసరం ఉంది.

ఇక క్యారెట్ అన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసేది. దీనిలో ఉండే బీటా కెరాటిన్ పిల్లల కంటి చూపుకు ఎంతో సహాయపడుతుంది. త్వరగా దృష్టి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే వారి చర్మానికి, జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. దీనివల్ల వారి చర్మం కాంతివంతంగా మారుతుంది. వారానికి మూడుసార్లు కచ్చితంగా క్యారెట్ ఆమ్లెట్ ను తినిపించడం అలవాటు చేయండి. ఇది వారిలో పోషకాహార లోపం రాకుండా అడ్డుకుంటుంది. కేవలం పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడా ఈ ఆమ్లెట్‌ను తినవచ్చు. దీనివల్ల వారిలో కూడా పోషకాహార లోపం రాకుండా ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం