తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Carrot Milkshake: మండే ఎండల్లో టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ ఇది, ఎంతో ఆరోగ్యం కూడా

Carrot Milkshake: మండే ఎండల్లో టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ ఇది, ఎంతో ఆరోగ్యం కూడా

Haritha Chappa HT Telugu

09 May 2024, 15:30 IST

    • Carrot Milkshake: ఎండలు దంచి కొడుతున్నాయి. కాబట్టి వేడి వేడి వాతావరణంలో చల్ల చల్లని క్యారెట్ మిల్క్ షేక్ తాగి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
క్యారెట్ మిల్క్ షేక్ రెసిపీ
క్యారెట్ మిల్క్ షేక్ రెసిపీ (Youtube)

క్యారెట్ మిల్క్ షేక్ రెసిపీ

Carrot Milkshake: క్యారెట్ మిల్క్ షేక్ పిల్లలకు, పెద్దలకూ ఆరోగ్యాన్ని అందించే పానీయం. ముఖ్యంగా వేసవిలో ఈ చల్ల చల్లని పానీయాన్ని తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. అలాగే శరీరానికి పోషణ కూడా అందుతుంది. క్యారెట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా కంటి చూపుని మెరుగుపరిచే శక్తి క్యారెట్ కి ఉంది. కాబట్టి చక్కెర వేయని ఈ క్యారెట్ మిల్క్ షేక్ ను తాగండి. ఎంతో ఆరోగ్యం కూడా. తీపిదనం కోసం చూసుకుంటే పంచదార శరీరంలో ఎన్నో అనారోగ్యాలకి కారణం అవుతుంది. కాబట్టి పంచదార వేయకుండానే ఈ మిల్క్ షేక్ తాగితే మంచిది.

క్యారెట్ మిల్క్ షేక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

క్యారెట్ తరుగు - ముప్పావు కప్పు

యాలకుల పొడి - చిటికెడు

పాలు - ఒక కప్పు

బాదం తరుగు - మూడు స్పూన్లు

కోవా - రెండు స్పూన్లు

హార్లిక్స్ పొడి - ఒక స్పూను

క్యారెట్ మిల్క్ షేక్ రెసిపీ

1. క్యారెట్‌ని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2. బాదం పప్పులను నాలుగు గంటల పాటు నానబెట్టి దాని పైన ఉన్న తొక్కను తీసేయాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి పాలు వేయాలి.

4. పాలు బాగా మరగనివ్వాలి. అలా మరుగుతున్నప్పుడు తరిగిన బాదం, క్యారెట్ తరుగు, యాలకుల పొడి వేసి కలపాలి.

5. అలాగే కోవాను కూడా వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లార్చక మిక్సీలో వేసి ఒకసారి రుబ్బుకోవాలి.

6. పైన యాలకుల పొడిని చల్లుకోవాలి.

7. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గ్లాసులో వేసుకోవాలి.

8. పైన హార్లిక్స్ పొడి వేసుకోవాలి.

9. అంతే టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయినట్టే.

క్యారెట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో క్యారెట్స్ అధికంగా వినియోగించాం, కాబట్టి క్యారెట్ మిల్క్ షేక్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలు, క్యారెట్, కోవా ఇవన్నీ కూడా మన శరీరానికి పోషకాలను అందించేవే. క్యారెట్లో పొటాషియం, విటమిన్ కె, విటమిన్ b6, బయోటిన్, విటమిన్ ఏ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. కంటి చూపును కాపాడుతాయి. శరీరానికి శక్తిని అందిస్తాయి. ఎముకలను బలంగా మారుస్తాయి. కాబట్టి ఇతర మిల్క్ షేక్ జోలికి వెళ్లకుండా క్యారెట్ మిల్క్ షేక్‌ను ఇంటి దగ్గర తయారు చేసుకుని తాగేందుకు ప్రయత్నించండి.

టాపిక్

తదుపరి వ్యాసం