Fact check: సబ్బు నురగతో పుట్టబోయే బిడ్డ ఆడో మగో చెప్పవచ్చా? ఇది ఎంతవరకు నిజం?
28 November 2024, 16:30 IST
- గర్భం ధరించాక పుట్టబోయేది ఆడపిల్లో, మగపిల్లడో అనే ఆత్రుత కాబోయే తల్లిదండ్రుల్లో ఉంటుంది. కొందరు ఊహించి లింగ నిర్ధారణ చేస్తూ ఉంటారు. అలాగే సబ్బు నురగ ద్వారా కూడా పుట్టబోయే బిడ్డ ఎవరో తెలుసుకోవచ్చనే అపోహ కొంతమందిలో ఉంది.
సబ్బు నురగతో లింగ నిర్ధారణ చేయవచ్చా?
గర్భం ధరించాక పుట్టబోయే బిడ్డపై తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు ఉంటాయి. ఆడపిల్ల పుడుతుందో, మగపిల్లాడు పుడతాడో అన్న ఆత్రుత కూడా ఉంటుంది. ఒకప్పుడు లింగ నిర్ధారణ చట్టం లేదు, దీనివల్ల ముందుగానే పుట్టబోయేది ఆడపిల్లో, మగ పిల్లడో తెలుసుకునేవారు. కానీ గర్భంలో ఆడపిల్ల ఉంటే ఎంతోమంది గర్భస్రావం చేయించుకునే సందర్భాలు ఎక్కువైపోయాయి. దీనివల్లే లింగ నిర్ధారణపై నిషేధం విధించారు. అయితే ఇప్పటికీ స్థానికంగా కొన్నిచోట్ల కొన్ని రకాల అపోహలు ఉన్నాయి. చిన్నచిన్న చిట్కాలు, పద్ధతుల ద్వారా పుట్టబోయేది ఆడపిల్లో, మగపిల్లాడో చెప్పేయవచ్చని అంటుంటారు. అందులో ఒకటి సబ్బు నురగతో చేసే ప్రయోగం.
యూట్యూబ్ వీడియోల రూపంలో కూడా ఈ సబ్బు నురగ ప్రయోగం ఎన్నోసార్లు వైరల్ అయింది. ఇందులో భాగంగా గర్భం ధరించిన స్త్రీ మూత్రాన్ని సేకరిస్తారు. ఆ మూత్రాన్ని ఒక ప్లాస్టిక్ గ్లాసులో వేస్తారు. అందులో సబ్బు ముక్కలను కలుపుతారు. పావుగంట వరకు ఆ గ్లాసులను అలా వదిలేస్తారు. ఆ తరువాత గ్లాసులో సబ్బు ముక్క కరిగి నురగలా కనిపిస్తే మగ బిడ్డ పుడతాడని అంటారు. మూత్రంలో సబ్బు నురగగా మారకుండా ఉంటే ఆడపిల్ల అని చెబుతారు. చాలా చోట్ల ఇలాంటి పద్ధతులను ద్వారా పరీక్షించుకునేవారు ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమో నిపుణులు వివరిస్తున్నారు.
తెలిసే అవకాశం లేదు
గర్భం ధరించిన పద్నాలుగు తర్వాత పుట్టబోయేది మగ బిడ్డో ఆడబిడ్డో వైద్యులకు తెలుస్తుంది. అంతవరకు వారికి కూడా తెలియదు. అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా శిశువు జననాంగాలను చూడవచ్చు. ఆ జననాంగాల ఆకారాన్ని బట్టి వైద్యులు పుట్టబోయేది మగ బిడ్డో, ఆడబిడ్డో తెలుసుకుంటారు. అయితే వారు తెలుసుకున్నా కూడా బయటికి చెప్పరు. అలా చెప్పడం చట్టరీత్యా నేరం. అందుకే ఎంతోమంది దేశీ పద్ధతుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకుంటూ ఉంటారు. నిజానికి ఇంటి దగ్గర చేసే ఏ లింగ నిర్ధారణ పరీక్ష కూడా హేతుబద్ధమైనది కాదు, చట్టబద్ధమైనది కాదు. అది పూర్తిగా కేవలం అపోహ మాత్రమేనని అంటున్నారు నిపుణులు.
మూత్రంలో సబ్బు ముక్క వేయడం ద్వారా లింగ నిర్ధారణ చేయడం వెనుక ఇలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం అల్ట్రాసౌండ్ లేదా రక్త పరీక్ష ద్వారా మాత్రమే సైన్స్ పరంగా పుట్టబోయే బిడ్డ ఆడ బిడ్డో మగ బిడ్డో తేల్చగలరు. అయితే పుట్టబోయే బిడ్డకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం భారతదేశంలో పూర్తిగా నేరం. దీనికి శిక్ష కూడా పడుతుంది. కాబట్టి అలాంటి యూట్యూబ్ వీడియోలను చూసి ఎవరూ మోసపోకండి.
సబ్బు మూత్రం ఈ రెండు లింగ నిర్ధారణ పరీక్షకు పనికిరావు. గర్భిణీ స్త్రీ మూత్రాన్ని పరీక్షించడం ద్వారా కూడా వైద్యులు లింగ నిర్ధారణ చేయలేరు. కేవలం రక్త పరీక్ష, ఆల్ట్రా సౌండ్ స్కాన్ ద్వారా మాత్రమే వారు కూడా పుట్టబోయేది ఎవరనేది తెలుసుకోగలరు. కాబట్టి ఇలాంటి యూట్యూబ్ వీడియోలను అపోహలను నమ్మకండి. ఎవరు పుట్టినా కూడా బాధ్యతగా పెంచి రేపటికి మంచి పౌరులుగా తీర్చిదిద్దండి.
టాపిక్