Biryani Maggi: బిర్యానీ మ్యాగీ రెసిపీ, సాధారణ మ్యాగీ బోర్ కొడితే ఈ రెసిపీ ప్రయత్నించండి
04 December 2024, 11:30 IST
- Biryani Maggi: మ్యాగీ ని ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త కొత్తగా బిర్యానీ టైప్ లో మ్యాగీని వండుకొని చూడండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది.
మ్యాగీ బిర్యానీ రెసిపీ
ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే బ్రేక్ ఫాస్ట్ మ్యాగీ. అందుకే ఎక్కువ మంది ఇళ్లలో ఇది కచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మ్యాగీలో మిల్లెట్లతో చేసినవి, గోధుమపిండితో చేసినవి కూడా అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి వీటితో టేస్టీ మ్యాగీని చేసుకోవచ్చు. మైదాతో చేసిన మ్యాగీని కాకుండా గోధుమ పిండి, మిల్లెట్స్ తో చేసిన మ్యాగీని ఇంటికి తీసుకొచ్చి బిర్యానీ మ్యాగీ రెసిపీ ప్రయత్నించండి. ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం.
బిర్యానీ మ్యాగీ రెసిపీకి కావలసిన పదార్థాలు
మ్యాగీ నూడుల్స్ - ఒక ప్యాకెట్
నూనె - రెండు స్పూన్లు
వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
ఉల్లిపాయల తరుగు - అరకప్పు
టమాటో తరుగు - అరకప్పు
క్యాప్సికం తరుగు - పావు కప్పు
పచ్చి బఠానీలు - పావు కప్పు
బీన్స్ - పావు కప్పు
క్యారెట్ తరుగు - పావు కప్పు
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
బిర్యానీ మసాలా - ఒకటిన్నర స్పూను
మ్యాగీ మసాలా పొడి - రెండు ప్యాకెట్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
బిర్యానీ మ్యాగీ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
2. ఆ నూనెలో సగం ఉల్లిపాయల తరుగును వేసి వేయించి అవి రంగు మారేవరకు ఉంచాలి.
3. ఆ ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేశాక తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు మిగతా నూనెలో వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయల తరుగు వేసి వేయించుకోవాలి.
5. ఆ తర్వాత టమోటో తరుగు, క్యాప్సికం తరుగు, క్యారెట్ తరుగు, బీన్స్ తరుగు కూడా వేసి బాగా కలుపుకొని మెత్తగా ఉడికించాలి.
6. అందులోనే కారం, పసుపు, బిర్యానీ మసాలా వేసి బాగా కలపాలి.
7. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
8. ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్ లో ఇచ్చే మసాలా పొడిని కూడా వేసి బాగా కలపాలి.
9. ఈ మొత్తం మిశ్రమం ఉడికేందుకు రెండు కప్పుల నీళ్లు వేయాలి.
10. ఆ తర్వాత మ్యాగీ నూడుల్స్ ను అందులో వేసి బాగా కలుపుకోవాలి. అది దగ్గరగా అయ్యేవరకు ఉంచాలి.
11. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ కట్టేయాలి.
12. అంతే టేస్టీ బిర్యానీ మ్యాగీ రెడీ అయినట్టే. ఇది ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది.
బిర్యానీ మ్యాగీలో మనం ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలను అధికంగా వాడాము. కాబట్టి పోషకాలు కూడా అందుతాయి. అప్పుడప్పుడు దీన్ని వేడి వేడిగా తినేందుకు ప్రయత్నించండి. మీకు ఎంతో నచ్చుతుంది. పిల్లలకు వారానికి ఒకసారి పెడితే వారు ఇష్టంగా తింటారు. మ్యాగీని సాధారణంగా తినేకన్నా ఇలా కూరగాయలు వేసుకుని తింటే ఎలాంటి పోషకాహారలోపం రాకుండా ఉంటుంది.