తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bilona Ghee: సాధారణ నెయ్యితో పోలిస్తే బిలోనా నెయ్యి ఖరీదైనది, రుచి అదిరిపోతుంది, దీని స్పెషాలిటీ ఏంటంటే...

Bilona Ghee: సాధారణ నెయ్యితో పోలిస్తే బిలోనా నెయ్యి ఖరీదైనది, రుచి అదిరిపోతుంది, దీని స్పెషాలిటీ ఏంటంటే...

Haritha Chappa HT Telugu

23 June 2024, 8:00 IST

google News
    • Bilona Ghee: నెయ్యి ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. పప్పులో కాస్త నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు. నెయ్యిలో బిలోనా నెయ్యి ఉత్తమ రకానికి చెందినది.
బిలోనా నెయ్యి
బిలోనా నెయ్యి

బిలోనా నెయ్యి

Bilona Ghee: నెయ్యి చేసే పద్ధతులు పూర్వంతో పోలిస్తే ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే పూర్వపు పద్ధతుల్లో చేసే నెయ్యే ఇప్పటికే అత్యుత్తమమైనదిగా భావిస్తారు. అలాంటి వాటిల్లో బిలోనా నెయ్యి ఒకటి. దీని రుచి, ఆరోగ్య ప్రయోజనాలు... దాన్ని ఉత్తమమైనదిగా గుర్తింపు తెచ్చేలా చేశాయి. ఇతర నెయ్యితో పోలిస్తే ఇది నాణ్యమైనది కూడా. బిలోనా నెయ్యిని పురాతన భారతీయ పద్ధతుల్లో తయారు చేస్తారు. అందుకే దీని ఖరీదు అధికంగా ఉంటుంది. అంతేకాదు రుచి అదిరిపోతుంది.

బిలోనా అంటే నెయ్యిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరం. పాలు నుంచి పెరుగు, పెరుగును మజ్జిగగా మార్చి దాన్ని బిలోనా చెక్క పరికరంతో చిలకుతారు. తద్వారా వెన్నను తీసి దాన్ని వేడి చేసి నెయ్యిని తయారు చేసుకునేవారు. దీనిలో పోషక విలువలు అధికంగా ఉంటాయని చెబుతారు. అంతేకాదు ప్రత్యేకమైన రుచి కూడా ఇస్తుందని అంటారు. బిలోనా నెయ్యిని తయారు చేసే ప్రక్రియ అధిక నాణ్యమైన పాలతో తయారుచేస్తారు. ముఖ్యంగా గిర్ జాతి ఆవులు లేదా సాహివాల్ జాతి ఆవుల నుండి తీసిన పాలతోనే ఈ నెయ్యిని తయారు చేస్తారు.

బిలోనా నెయ్యి తయారీ

ఆవు పాలను నీరు కలపకుండా మరగబెట్టి వాటిని చల్లబరుస్తారు. ఆ పాలను తోడు పెట్టడం ద్వారా పెరుగును చేస్తారు. పెరుగును మజ్జిగగా మారుస్తారు. ఆ మజ్జిగలో బిలోనా అనే చెక్క పరికరం ఉపయోగించి చిలుకుతారు. అలా చిలకడం వల్ల వెన్న పైకి తేలుకుంటూ వస్తుంది. దాన్ని చేత్తో తీసి ఓ గిన్నెలో పెడతారు. అలా తీసిన వెన్నను... నెయ్యి తయారు చేసే గిన్నెలో వేసి స్టవ్ మీద పెడతారు. చిన్న మంట మీద ఉడికిస్తారు. అందులోని నీరంతా ఆవిరైపోయి చివరకు బంగారంలా మెరిసే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యిని వడకట్టి ఒక గాజు సీసాలో భద్రపరచుకుంటారు. ఇదే బిలోనా నెయ్యి. సాధారణ నెయ్యితో పోలిస్తే ఈ నెయ్యిలో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి.

బిలోనా నెయ్యి ఉపయోగాలు

రోజుకు ఒక స్పూను నెయ్యి తిన్నాచాలు... దానిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కేలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శారీరక విధులకు అత్యవసరమైనది. పొట్ట ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. లాక్టోస్, కేసైన్ వంటి వాటిని తొలగిస్తాయి. ఆయుర్వేదం నెయ్యిని తినమని సిఫారసు చేస్తుంది. ఇది జీర్ణ క్రియకు పోషకాలు శోషించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని చెబుతారు. బిలోనా నెయ్యిలో సంయోజక లినోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి అరికడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో రకాల వ్యాధులను రాకుండా ఆపుతాయి.

బిలోనా నెయ్యి ఉత్తమమైనదిగా పేరు తెచ్చుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దేశీయ ఆవు జాతుల నుండి తీసిన పాలను దీనికి వినియోగిస్తారు. ఈ ఆవులు A2 పాలను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఇతర పాల ఉత్పత్తుల్లో సాధారణంగా కనిపించే A1 పాలతో పోలిస్తే పోషకాలను అధికంగా కలిగి ఉంటాయి. బిలోనా పద్ధతిలో నెయ్యిని తయారు చేయడం అనేది చాలా సహనంతో కూడినది. అలాగే ఆ నెయ్యిని తయారు చేసేటప్పుడు ఎంతోమంది ఇష్టంగా ప్రేమగా చేస్తారు. అందుకేనేమో ఆ బిలోనా నెయ్యి రుచి కూడా ప్రత్యేకంగా వస్తుంది.

బిలోనా పద్ధతిలో చేసిన నెయ్యి వందశాతం స్వచ్ఛమైనది. ఎలాంటి పరీక్షలనైనా ఇది తట్టుకుంటుంది. ఎందుకంటే బిలోనా నెయ్యిని సాంప్రదాయమైన పద్ధతిలో తయారు చేశారు. కాబట్టి ఇది గొప్ప రుచిని ఒక విలక్షణమైన వగరు వాసనను అందిస్తుంది. ఒక లీటర్ బిలోనా నెయ్యిని తయారు చేయడానికి 25 నుంచి 30 లీటర్ల వరకు పాలు అవసరం పడతాయి. కాబట్టి దీని ధర కూడా అధికంగానే ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం