Sugar Cravings in Pregnancy: ప్రెగ్నెన్సీలో ఎక్కువ తీపి తినాలనిపిస్తోందా? ఇలా కంట్రోల్ చేసుకోండి..
12 December 2023, 13:00 IST
Sugar Cravings in Pregnancy: ప్రెగ్నెన్సీలో తీపి తినాలనే కోరిక అప్పుడప్పుడూ ఎక్కువవుతుంది. కానీ అతిగా తీపి తినడం మంచిది కాదు. ఆ కోరికను అదుపులో ఉంచుకునే మార్గాలేంటో తెల్సుకోండి.
ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్
గర్భం ధరించిన స్త్రీల శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల విడుదలలోనూ తేడాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో తీసుకునే ఆహారం విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కొంత మందికి ఎక్కువగా తీపి పదార్థాలు తినాలని అనిపిస్తూ ఉంటుంది.
మనం తీపి తిన్నప్పుడు డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల అవుతూ ఉంటుంది. అందువల్ల ఆనందంగా ఉంటుంది. అలాంటి ఆనందం కోసం వీరు మరింతగా తీపి తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇన్సులిన్ విడుదలలో అసమతుల్యత ఉంటే కొంత మందికి ఈ సమయంలో మధుమేహం వచ్చే అవకాశాలూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా చక్కెరలను తినడం అంత మంచిది కాదు. ఈ తీపి తినాలన్న కోరికను నియంత్రించుకోవడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాల్ని తెల్సుకుందాం.
కొద్ది కొద్దిగా తీపి తినొచ్చు:
స్వీట్లు తినాలని కోరికగా ఉన్న వారు అతిగా చక్కెరలు చేర్చని వాటిని రోజుకు కొద్ది మొత్తంలో తినే ప్రయత్నం చేయాలి. లేదంటే తీపిగా ఉండే ఖర్జూరం, సపోటా, యాపిల్.. లాంటి డ్రైఫ్రూట్స్, పండ్లను ఎంచుకుని తినాలి. అంతే తప్ప ఎక్కువగా చక్కెర వేసి చేసిన వాటిని అస్సలు తినకుండా ఉండటమే ఉత్తమం.
ప్రెగ్నెన్సీ స్నాక్స్ తినాలి:
గర్భధారణ సమయంలో తినడానికి ప్రొటీన్లతో కూడిన బిస్కెట్ల లాంటివి అందుబాటులో ఉంటాయి. అలాగే చీజ్, మాంసాలు లాంటి వాటిని ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి. అందువల్ల మరింత కడుపు నిండుగా ఉన్న భావన కలిగి మరింతగా తీపి తినాలన్నా ఆలోచన రాకుండా ఉంటుంది.
పోషకాహారంపై దృష్టి పెట్టాలి:
గర్భం ధరించిన స్త్రీలు ఏం తింటున్నారు అనే దాని మీదే లోపల శిశువు ఎదుగుదల ఆధార పడి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండే ఆహారపు అలవాట్లను మాత్రమే అనుసరించాలి. తీపి ఎక్కువగా తినడానికి బదులుగా అన్ని రకాల పోషకాలు లభ్యం అయ్యే సమతుల ఆహారం మీద మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టాలి.
ఎక్కువ సార్లు తినాలి:
ఈ సమయంలో కొద్ది కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు తినేందుకు ప్రయత్నించాలి. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమానంగా ఉండి ఎక్కువగా తీపి తినాలని అనిపించకుండా ఉంటుంది.
విశ్రాంతీ అవసరమే:
రోజులో తగినంత సమయం నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. నిద్ర తక్కువ అయితే ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల చక్కెర తినాలన్న కోరికలు పెరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో సరైన నిద్ర పైనా దృష్టి పెట్టాల్సిందే.