Kidney Problem: అమ్మాయిలూ జాగ్రత్త,హెయిర్ స్ట్రెయిటనింగ్ కోసం సెలూన్‌కు వెళితే కిడ్నీలు దెబ్బతిన్నాయి
29 March 2024, 12:00 IST
- Kidney Problem: అందం కోసం పాకులాడే ఒక మహిళ ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంది. హెయిర్ స్ట్రెయిట్‌నింగ్ కోసం వెళితే కిడ్నీలు పాడయ్యే పరిస్థితికి చేరుకుంది.
హెయిర్ క్రీములతో సమస్యలు
Kidney Problem: ఆధునిక ప్రపంచంలో అందం మీద శ్రద్ధ పెరిగిపోయింది. జుట్టుకు రకరకాల క్రీములు రాసి చిన్న చిన్న మెషిన్లతో నచ్చినట్టు వాటి తీరును మారుస్తున్నారు. ఇలా ఒక మహిళ హెయిర్ స్ట్రైయిట్‌నింగ్ కోసం సెలూన్‌కి వెళ్ళింది. చివరకు ఆమె కిడ్నీలు పాడయ్యే పరిస్థితికి చేరుకుంది. అసలు ఏం జరిగిందంటే... 26 ఏళ్ల మహిళ తొలిసారిగా 2020 జూన్లో హెయిర్ స్ట్రెయిటనింగ్ ట్రీట్మెంట్స్ తీసుకుంది. తర్వాత మళ్లీ ఏడాదికి అదే ట్రీట్మెంట్ ను తీసుకుంది. మూడోసారి కూడా హెయిర్ ట్రీట్మెంట్ ను తీసుకునేందుకు వెళ్ళింది.
కిడ్నీలపై ప్రభావం
ప్రతిసారీ సెలూన్‌కి వెళ్లి వచ్చాక ఆమెకు వాంతులు, విరేచనాలు, జ్వరం, వెన్నునొప్పి వంటివి వచ్చేవి. నెత్తి మీద మంటగా అనిపించేది. అలా ఎందుకు జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. చివరికి దీర్ఘకాలంలో ఆమె మరిన్ని ఇబ్బందులను పడింది. వైద్యులను కలిస్తే రకరకాల రక్త పరీక్షలు నిర్వహించారు. ఆ రక్త పరీక్షల్లో ఆమె రక్తంలో క్రియాటినిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. దీనివల్ల ఆమె మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని గుర్తించారు. మూత్రంలో కూడా ఆమెకి రక్తం పడడం గమనించారు. సిటీ స్కాన్ లో ఆమె మూత్రపిండాలు ఆరోగ్యాన్ని గమనించారు. ఆమె మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని అర్థం చేసుకున్నాక దానికి కారణాన్ని కనిపెట్టే ప్రయత్నంలో పడ్డారు.
ప్రతిసారి సెలూన్‌కి వెళ్ళాకే ఆమెకు ఎక్కువ లక్షణాలు ఇలాంటివి కనిపించడం మొదలయ్యాయి. అదే విషయాన్ని ఆమె వైద్యులకు తెలియజేసింది. వారు సెలూన్ వారితో మాట్లాడి ఎలాంటి క్రీమ్ ను వాడుతున్నారో తెలుసుకున్నారు. ఆ స్ట్రెయిటనింగ్ క్రీమ్‌లో గ్లైక్సిలిక్ యాసిడ్ అనే రసాయనం ఉన్నట్టు గుర్తించారు. దీనివల్లే ఆమె నెత్తి మీద విపరీతమైన మంట, పుండ్లు ఏర్పడ్డాయని చెప్పారు. ఈ గ్లైక్సిలిక్ యాసిడ్, కిడ్నీ దెబ్బ తినడం మధ్య సంబంధం ఉందని ఒక అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు.
సెలూన్‌లో ఉపయోగించిన స్ట్రెయిటనింగ్ ఉత్పత్తిని ఐదు ఎలుకలపై ప్రయోగించి అధ్యయనం నిర్వహించారు. ఆ ఎలుకల మూత్రంలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్టు గుర్తించారు. దీన్ని బట్టి మూత్రపిండాలు చెడిపోవడానికి ఈ క్రీమ్ కారణమని తెలిపారు.
ఆమె తలకు రాసిన క్రీమును చర్మం శోషించుకోవడం వల్ల శరీరం లోపలికి వెళ్లినట్టు వైద్యులు చెబుతున్నారు. ఆ యాసిడ్ చివరకు మూత్రపిండాలకు చేరుకుందని... అక్కడ ఆ ప్రధాన అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని గుర్తించారు. దీనివల్లే మూత్రపిండాలు సరిగా పనిచేయడం మానేశాయని, రక్తంలో మాత్రం కనిపించడం వంటి సమస్యలు మొదలయ్యాయి అని వివరించారు. ఇప్పుడు ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతోంది. కాబట్టి అందం కోసం పాకులాడే ముందు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోమని చెబుతున్నారు వైద్యులు. ఎంతోమంది అమ్మాయిలు ఇలా రకరకాల క్రీములను జుట్టుకు చర్మానికి అప్లై చేయడం వల్ల వారికి తెలియకుండానే దీర్ఘకాలికంగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
టాపిక్