తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Banana Appam: అరటిపండుతో తీయని అప్పాలు, సాయంత్రం పూట పిల్లలకు బెస్ట్ స్నాక్ రెసిపీ

Banana Appam: అరటిపండుతో తీయని అప్పాలు, సాయంత్రం పూట పిల్లలకు బెస్ట్ స్నాక్ రెసిపీ

Haritha Chappa HT Telugu

29 February 2024, 15:37 IST

google News
    • Banana Appam: సాయంత్రం పూట తినేందుకు బెస్ట్ స్నాక్ రెసిపీ అరటిపండు అప్పాలు. ఇవి చాలా తియ్యగా ఉంటాయి. వీటిని చేయడం చాలా సులువు.
అరటిపండు అప్పాలు
అరటిపండు అప్పాలు

అరటిపండు అప్పాలు

Banana Appam: పిల్లలకు నచ్చే స్నాక్స్ ఎప్పుడూ తీయగా ఉంటాయి. వారికి అప్పాలను అరటిపండ్లతో చేసి పెట్టండి. ఇది దక్షిణ భారతదేశంలో చేసే స్వీట్స్. ముఖ్యంగా తమిళనాడులో, కేరళలో దీన్ని తింటూ ఉంటారు. అరటిపండుతో చేసే ఈ అప్పాలను చాలా వేగంగా చేసేయొచ్చు. ఇది వండడానికి ఎక్కువ సమయం తీసుకోదు. 10 నిమిషాల్లో అరటిపండు అప్పాలు రెడీ అయిపోతాయి. ఇవి పిల్లలకు శక్తిని ఇవ్వడంతో పాటు, పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తాయి. అరటిపండు అప్పాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

అరటిపండు అప్పాలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు

అరటి పండ్లు - రెండు

బియ్యప్పిండి - ఒక కప్పు

బెల్లం తురుము - అరకప్పు

కొబ్బరి తురుము - పావు కప్పు

యాలకుల పొడి - అర స్పూను

ఉప్పు - చిటికెడు

నీరు - తగినంత

నూనె - రెండు స్పూన్లు

అరటిపండు అప్పం రెసిపీ

1. బాగా పండిన అరటి పండ్లను తీసుకుంటే ఈ రెసిపీ టేస్టీగా వస్తుంది.

2. ఆ అరటి పండ్లను చేత్తోనే మెదిపి మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో వేయాలి.

3. అదే గిన్నెలో బియ్యప్పిండిని, తురిమిన బెల్లాన్ని, కొబ్బరి తురుమును, యాలకులు పొడిని, చిటికెడు ఉప్పును వేసి బాగా కలపాలి.

4. ఇది మృదువుగా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి.

5. తర్వాత కాస్త నీటిని కలిపి గరిటతో కలుపుతూ ఉండాలి.

6. గుంత పొంగనాలు వేయడానికి పిండిని ఎలా చేస్తామో అలాగే దీన్ని కూడా చేసి పక్కన పెట్టుకోవాలి.

7. ఇప్పుడు గుంతపొంగనాలు వేసే కళాయిని తీసుకొని నూనెను రాయాలి.

8. గుంతల్లో ఈ పిండిని వేసుకోవాలి. అప్పుడు అంచులను దగ్గర నుంచి చాకుతో మెల్లగా ఈ అప్పాన్ని రెండోవైపు తిప్పుకోవాలి.

9. అటు కూడా క్రిస్పీగా మారేవరకు కాల్చుకోవాలి.

10. రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు కాల్చాక తీసి పక్కన పెట్టుకోవాలి.

11. అంతే రుచికరమైన తీయని అరటిపండు అప్పాలు రెడీ అయినట్టే.

12. ఇవి పిల్లలకు కచ్చితంగా నచ్చుతాయి. వేడివేడిగా తింటే వీటి రుచి మరింతగా బాగుంటుంది.

రెసిపీలో మనం శరీరానికి మేలు చేసే పదార్థాలను వాడాం. అరటి పండ్లు, బియ్యప్పిండి, బెల్లం తురుము, కొబ్బరి తురుము ఇవన్నీ కూడా మన శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. అరటి పండ్లు తిన్న వెంటనే శరీరానికి శక్తిని అందిస్తాయి. కాబట్టి పిల్లలు అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు వీటిని తినిపించడం మంచిది. అరటిపండ్లలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. అది ఫైబర్‌తో కలిసి శరీరానికి వచ్చే అవసరమైన శక్తిని విడుదల చేస్తాయి. అలాగే ఇందులో ఉన్న పొటాషియం మనకు అత్యవసరమైనది.

దీనిలో మనం అరకప్పు బెల్లాన్ని వాడాము. బెల్లం తినడం వల్ల రక్తంలో శుద్ధి అవుతుంది. జీర్ణక్రియ కూడా సులువుగా మారుతుంది. ప్రతిరోజూ చిటికెడు బెల్లాన్ని తినడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లంతో బాధపడేవారు ప్రతిరోజూ బెల్లాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే కొబ్బరి తురుము మన శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపుతుంది. అలాగే దెబ్బతిన్న కణాలను ఆరోగ్యంగా మారుస్తుంది. మలబద్ధకం థైరాయిడ్ వంటి సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది. దీనిలో నియాసిన్, కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరమైనవే. అందుకే పిల్లలకు సాయంత్రం పూట స్నాక్ గా ఈ అరటి అప్పాలను అందిస్తే ఇక్కడ చెప్పిన పోషకాలన్నీ వారికి అందుతాయి. వారు ఆరోగ్యంగా ఎదుగుతారు.

తదుపరి వ్యాసం