తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Badam Milk Recipe: వేసవిలో చల్లచల్లని బాదం మిల్క్ తాగితే ఆ రుచే వేరు, ఇంట్లోనే ఇలా చేసేయండి

Badam milk Recipe: వేసవిలో చల్లచల్లని బాదం మిల్క్ తాగితే ఆ రుచే వేరు, ఇంట్లోనే ఇలా చేసేయండి

Haritha Chappa HT Telugu

12 March 2024, 15:47 IST

google News
    • Badam milk Recipe: బాదం మిల్క్ పేరు చెప్తేనే నోరూరి పోతుంది. అందులోను వేసవిలో చల్లచల్లగా బాదంపాలు తాగుతూ ఉంటే ఆ రుచే వేరు. ఇంట్లో టేస్టీగా బాదం పాలు ఎలా చేయాలో తెలుసుకుందాం.
బాదం పాలు రెసిపీ
బాదం పాలు రెసిపీ

బాదం పాలు రెసిపీ

Badam milk Recipe: వేసవిలో ఎక్కువగా ద్రవపదార్థాలు తాగాలనిపిస్తుంది. ఎండ వేడిమి మీరు తట్టుకోవాలంటే శరీరానికి అందించాల్సింది ఎక్కువగా ద్రవ ఆహారాలే. ఒకసారి చల్లచల్లగా బాదం మిల్క్ తాగి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాదం మిల్క్ అనగానే బాదం పొడి బయట నుంచి కొనుక్కొచ్చి పాలల్లో కలిపి వేసుకొని తాగేది కాదు. ఇంట్లోనే టేస్టీగా దీన్ని తయారు చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది. పిల్లలకు నచ్చుతుంది. సాయంత్రం వేళ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఒక గ్లాసు బాదం మిల్క్‌ను అందిస్తే... శరీరానికి శక్తి వెంటనే అందుతుంది. పెద్దలకు కూడా ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. వేసవిలో కచ్చితంగా తాగాల్సిన పానీయాల్లో బాదం మిల్క్ ఒకటి. ఈ బాదంపాలు ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

బాదం పాలు రెసిపీకి కావలసిన పదార్థాలు

బాదం పప్పులు - ఒక కప్పు

జీడిపప్పు - ఒక కప్పు

పంచదార - 100 గ్రాములు

యాలకుల పొడి - అర స్పూను

పాలు - అర లీటరు

బాదం పాలు రెసిపీ

1. బాదంపప్పు, జీడిపప్పును మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి.

2. వెన్న తీయని పాలను గిన్నెలో వేసి మరగ కాచాలి. అందులో యాలకుల పొడిని కూడా వేయాలి.

3. ఆ పాలల్లో పంచదారని వేసి బాగా కలుపుకోవాలి.

4. ముందుగా మిక్సీలో చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు పొడిని ఈ పాలల్లో వేసి చిన్న మంట మీద పది నిమిషాల పాటు మరగనివ్వాలి.

5. ఇప్పుడు స్టవ్ కట్టేసి వాటిని చల్లారనివ్వాలి.

6. ఈ బాదం మిల్క్‌ను గ్లాసుల్లో వేసి పైన సన్నగా తరిగిన బాదం, జీడిపప్పులను వేసి ఫ్రిజ్లో పెట్టాలి.

7. అవి బాగా చల్లగా అయ్యాక తాగి చూడండి.

8. రుచి మామూలుగా ఉండదు. పిల్లలకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. బయటకొనే బాదం పొడులు కన్నా దీని టేస్ట్ బాగుంటుంది.

ఈ రెసిపీలో మనం బాదం, జీడిపప్పు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను వాడాము. అలాగే పంచదారను చాలా తక్కువగా వాడాము. బాదం, జీడిపప్పులు మన శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. బరువు తగ్గడానికి కూడా ఇవి సహాయం చేస్తాయి. ఎన్నో పోషకాలను శరీరానికి అందిస్తాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు బాదంపప్పు ఎంతో మేలు చేస్తుంది. ఇక పాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది శరీరానికి కాల్షియాన్ని అందిస్తుంది. అలాగే పిల్లలకు శక్తిని అందించి వారు ఏకాగ్రతగా చదివేలా చేస్తుంది. బాదం, జీడిపప్పు, పాలు ఈ మూడు కూడా పిల్లలకు అత్యవసరమైనవి. వేసవిలో పకోడీలు, పునుకులు వంటివి సాయంత్రం పూట స్నాక్స్‌గా ఇచ్చే కన్నా ఇలాంటి బాదం పాలు ఇవ్వడం వల్ల వారు మరింత శక్తివంతంగా మారతారు.

తదుపరి వ్యాసం