Plank Benefits : 21 రోజులు కంటిన్యూగా ప్లాంక్ చేస్తే చాలా సమస్యలు మాయం
07 February 2024, 5:30 IST
- Plank Benefits In Telugu : బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ 21 రోజులు కంటిన్యూగా ప్లాంక్ చేస్తే అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ప్లాంక్ చేస్తే చాలా ప్రయోజనాలు
21 రోజులు వరుసగా ఏదైనా చేస్తే అది అలవాటుగా మారుతుందని అంటారు. ఇది నిజమే. మీరు తినే విధానం నుండి నిద్రించే విధానం వరకు అన్నింటిలో ఈ 21 రోజుల సూత్రం వర్తిస్తుంది. శరీరంలో కొత్త మార్పు తీసుకురావడానికి కొందరు అనేక రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ అన్నీ సెట్ కావు. ఎందుకంటే ఏదైనా చేస్తే అది రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.
ప్లాంక్ వ్యాయామం
శరీర బరువు, పొట్టను తగ్గించుకోవడానికి వివిధ వ్యాయామాలు చేస్తుంటాం. కానీ దీన్ని స్థిరంగా చేయకపోవడం వలనే ఫలితాలు చూడలేం. చాలా మంది పొట్ట కొవ్వు తగ్గించుకునేందుకు వ్యాయామాలు చేస్తుంటారు. ఈ బాధలన్నీ తీరాలంటే 21 రోజుల పాటు ఒక్క వ్యాయామం చేస్తే చాలు. అదే ప్లాంక్. ఇలా చేయడం వల్ల శరీరంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోండి.
ప్లాంక్ చేసే విధానం ఇది
ప్లాంక్ అంటే.. బోర్లా పడుకునే విధానంలో పోజ్ తీసుకోవాలి. రెండు మో చేతులు నేలకు అనించాలి. తర్వాత వెనకాల కాళ్లు, మో చేతుల మీదనే శరీరం ఉంచి పైకి లేవాలి. అంటే శరీరం మెుత్తం సమానంగా పైకి ఉండాలి. పొట్టను నేలకు అనించకూడదు. ఇలా మెుదట్లో చేసినప్పుడు వణుకుతుంటారు. కానీ రాను రాను అలవాటవుతుంది.
20 సెకన్లతో ట్రై చేయండి
ఈ స్థానం శరీరం మొత్తం కదలికను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ 5 నుండి 10 సార్లు ఈ భంగిమను చేస్తే ప్రయోజనాలను పొందుతారు. ప్రతిసారీ 2 నుండి 4 నిమిషాలు ఉండేలా చూసుకోండి. మెుదట 20 సెకన్లతో ప్రారంభించండి. క్రమంగా పెంచండి.
వెన్ను నొప్పి తగ్గుతుంది
ఈ ప్లాంక్ వ్యాయమం చేయడం వల్ల పొత్తికడుపు, తొడ కండరాలు దృఢమవుతాయి. అలాగే అవాంఛిత కొవ్వులు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ ప్రయోజనాన్ని పూర్తిగా పొందాలంటే 21 రోజుల పాటు నిరంతరంగా చేయాలి. కొందరు 5 నిమిషాలు కూర్చోవడం లేదా పడుకున్న తర్వాత వెన్నెముకలో విపరీతమైన నొప్పిని అనుభవిస్తారు. అయితే ప్లాంక్ వ్యాయామం 21 రోజుల పాటు కంటిన్యూగా చేస్తే నొప్పి తగ్గుతుంది.
మీరు ఏమి తిన్నా దీర్ఘకాలిక అజీర్ణ సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఇంట్లో రోజూ 10 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయడం వల్ల జీర్ణాశయ రుగ్మతలు నయమవుతాయి. నిద్రలేని రాత్రులతో బాధపడేవారికి ప్లాంక్ చాలా ఉపయోగపడుతుంది. రాత్రి సమయంలో మెదడు పనితీరును స్థిరంగా ఉంచుతుంది. గాఢమైన ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది
ఈ వ్యాయామం 21 రోజుల పాటు నిరంతరం చేస్తే మానసిక గందరగోళం, ఒత్తిడి, అలసట వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇది రక్త ప్రవాహాన్ని స్థిరంగా ఉంచుతుంది, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. శరీరంలోని అనేక అవయవాలు లెక్కలేనన్ని మార్పులకు లోనవుతాయి. ప్లాంక్ చేస్తే అన్ని బాగుంటాయి. దీని వల్ల మెడ, వీపు, పొట్ట, భుజాలు నిటారుగా ఉంటాయి. అనేక ఆరోగ్య రుగ్మతలను నివారించవచ్చు. బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.