Healthy Nuts | జీడిపప్పుకు బదులు ఈ పప్పులు తినండి, ఆరోగ్యానికి ఇవి మంచివి!
20 July 2023, 12:43 IST
- Healthy Nuts: జీడిపప్పుకు బదులుగా ఏవైనా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నట్లయితే, తినగలిగే కొన్ని గింజలు ఉన్నాయి, అవేమిటో చూడండి.
Healthy Nuts
Healthy Nuts: మీకు జీడిపప్పు తినడం అంటే ఇష్టమా? జీడిపప్పు ఎంతో రుచికరమైన స్నాక్స్. ఇవి వివిధ మసాలా ఫ్లేవర్లతో కలిపి నేరుగా తినవచ్చు. అలాగే రుచికోసం వివిధ వంటకాలు, పాయసంలో కూడా కలుపుతారు. ఇవి ఆహారాలలో క్రంచీగా ఉంటాయి. గ్రేవీ వంటకాలకు జీడిపప్పు పేస్ట్ మంచి ఆకృతిని, ప్రత్యేక రుచిని అందిస్తాయి. కానీ, జీడిపప్పును ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే జీడిపప్పులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా, జీడిపప్పులు బరువును నియంత్రించడానికి లేదా తగ్గించుకోవడానికి ప్రయత్నించేవారికి ప్రయోజనకరం కావు. ఇవి బరువును మరింత పెంచగలవు.
అలాగే జీడిపప్పు గణనీయమైన మొత్తంలో ఆక్సలేట్‌ను కలిగి ఉంటాయి, వీటిని పెద్ద పరిమాణంలో తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కాల్షియం ఆక్సలేట్ శోషణను తగ్గిస్తుంది కాబట్టి, వాటిని పాలతో తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. అయినప్పటికీ, రోజుకు 30 గ్రాములకు మించి జీడిపప్పు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు. జీడిపప్పుకు బదులుగా ఏవైనా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నట్లయితే, తినగలిగే కొన్ని గింజలు ఉన్నాయి, అవేమిటో చూడండి.
బాదం పప్పులు
బాదంపప్పులలో మంచి పోషక విలువలు ఉంటాయి. బాదంలోని పోషకాలు క్యాన్సర్‌ను నిరోధించవచ్చు, ఎముకలను స్థిరీకరించవచ్చు, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి, మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాకాహారులు ప్రోటీన్ కోసం బాదంపప్పును తినవచ్చు. బాదంపప్పులు కొద్దిగా తీపి, వగరు రుచిని కలిగి ఉంటాయి, కాబట్టి వీటిని మీరు అనేక రెసిపీలలో ఉపయోగించవచ్చు. ఇవి జీడిపప్పుకు అద్భుతమైన ప్రత్యామ్నాయం.
పిస్తా పప్పులు
పిస్తాపప్పులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇవి ఎంతో రుచికరమైనవి, తేలికపాటి తీపి రుచిని కలిగి ఉంటాయి. పిస్తాపప్పులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చురుకైన జీవనశైలిని ప్రోత్సహించడానికి, పోషకాహార సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి పిస్తాపప్పులు సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న అతి కొద్ది ఆహారాలలో ఇవి ఒకటి. పిస్తాపప్పులు మొత్తం 9 అమైనో ఆమ్లాలతో కూడిన పూర్తి ప్రోటీన్‌గా ఉంటాయి, ఇవి యాంటీ ఏజింగ్ గుణాలు కలిగినవి. మెరుగైన చర్మం, జుట్టును ప్రోత్సహించడంలో సహాయపడతాయి. మానసిక, శారీరక ఆరోగ్యానికి అమెరికన్ పిస్తాలు ఆరోగ్యకరమైన చిరుతిండి.
వాల్‌నట్‌లు
వాల్‌నట్‌లు ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ లతో కూడిన సూపర్‌ఫుడ్‌లు. ఈ గింజలలో ఒమేగా -3 కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాల్‌నట్‌లు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఇవి గొప్ప పోషకాహారం. జీడిపప్పుతో పోల్చితే వాల్‌నట్‌లు ఎంతో ఆరోగ్యకరమైనవి. పాస్తాలు, ఓట్స్, సూప్‌లు, సలాడ్‌లు వంటి వివిధ వంటకాలకు వాల్‌నట్‌లు మంచి క్రంచ్. రుచిని అందిస్తాయి.
హాజెల్ నట్స్
హాజెల్ నట్స్ కూడా జీడిపప్పును పోలిన ఆకృతికి, రుచికి ప్రసిద్ధి అధిక కొవ్వు పదార్థాలను కలిగి ఉంటాయి. అయితే, హాజెల్‌నట్స్‌లో అదనంగా శరీరానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి, ఇవి మీకు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. పేగు ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు, రోగనిరోధక శక్తిని పెంపొందించుటకు మొదలైనవాటికి తోడ్పడుతుంది. వీటిని చాక్లెట్లు, ట్రఫుల్స్, మిఠాయిలు తయారు చేయడాని కూడా ఉపయోగిస్తారు.
పైన్ నట్స్
పైన్ గింజలను జీడిపప్పుకు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఇవి కూడా కొంత అవే ఆకృతిని, రుచిని కలిగి ఉంటాయి. అయితే వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పైన్ గింజలు అసంతృప్త కొవ్వులు లినోలెయిక్ యాసిడ్, పినోలెనిక్ యాసిడ్‌లను కలిగి ఉంటాయి, ఇవి రక్తపోటు నియంత్రణ, బరువు తగ్గడం, కడుపు పూతల నివారణకు సహాయపడతాయి.