Chanakya Niti Telugu : భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటే సమస్యలే
23 March 2024, 8:00 IST
- Chanakya Niti On Age Gap : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి దాంపత్య జీవితం గురించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు. భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే సమస్యలు చాలా వస్తాయని వివరించాడు.
చాణక్య నీతి
ప్రేమకు కారణం అవసరం లేదు. ప్రేమ ఎవరి మీదైనా పుట్టవచ్చు. అందుకు ఏజ్ గ్యాప్ కూడా కచ్చితంగా అడ్డంకి కాదు. ఇటీవలి ప్రేమ వివాహాల్లో చాలా మందిలో వయస్సు అంతరం ఎక్కువగా ఉంది. కానీ ఈ గ్యాప్ అనేది ఒక పరిమితి వరకూ ఏం కాదు. ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంటే భార్యాభర్తలు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అనేక ఇబ్బందులు వస్తాయి.
చాణక్యుడు దంపతుల వయస్సు అంతరం గురించి చెప్పాడు. దంపతుల మధ్య వయస్సు అంతరం ఎంత ఉండాలే వివరించాడు. భార్యాభర్తల మధ్య ఎక్కువగా వయస్సు అంతరం ఉంటే ఏం జరుగుతుందనే విషయాలను తెలిపాడు. అటువంటి వివాహంలో ఆనందాన్ని పొందలేరు. దీని గురించి చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం.
ప్రేమ వివాహం లేదా కుటుంబం ఒత్తిడి కోసం మీ కంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులను వివాహం చేసుకుంటారు. ఈ సంబంధం బాగుండదని చాణక్యుడు చెప్పాడు. భార్యాభర్తల మధ్య వయసు అంతరం ఎక్కువగా ఉన్నప్పుడు జీవితాన్ని సర్దుబాటు చేసుకుంటూ గడపాల్సి వస్తుంది. వృద్ధుడు యువతిని వివాహం చేసుకోకూడదు. వారి మధ్య పొంతన ఉండదు. కుటుంబ జీవితంలోని సందడితో గడపడం కష్టంగా ఉంటుంది. జనరేషన్ గ్యాప్ ఉన్నప్పుడు, వారి ఆలోచనలు, చర్యలు తేడాగా ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉండదు.
దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా వచ్చినప్పుడు భార్య ఏం చేసినా భర్తకు ఇష్టం ఉండదు. అలాగే భర్త ఏం చేసినా భార్యకు నచ్చదు. భర్త ఏదైనా బాగా నేర్చుకుని మంచి ఉద్యోగంలో ఉంటే భార్యను ఆనందంతో వెక్కిరిస్తూ దుర్భాషలాడుతూ ఉంటాడు. అలాంటి భర్త ప్రవర్తనతో భార్య విసిగిపోతుందని చాణక్య నీతి చెబుతుంది.
చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తల సంబంధం చాలా పవిత్రమైనది. సంబంధంలో వయస్సు అంతరం ఉన్నప్పుడు వారు భాగస్వామి అవసరాలకు విలువ ఇవ్వరు. ఎందుకంటే వారు చేసిన పని వారికి సరైనదనిపిస్తుంది. జీవిత భాగస్వామి మాట వినడానికి సిద్ధంగా ఉండరు. ఎక్కువగా జనరేషన్ గ్యాప్ ఉన్నప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది.
జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఒక్కసారి వివాహబంధంతో మన తర్వాతి జీవితాన్ని వారితోనే గడపాలి. అందుకే పెళ్లికి ముందు ఒక్కసారి ఆలోచించి అతడిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుందని అనుకుంటే అలాంటి పెళ్లికి మాత్రం సమ్మతించండి.
భార్యాభర్తల మధ్య వయసు కారణంగా గొడవలు మెుదలైతే సంబంధం పూర్తిగా నాశనం అవుతుంది. ఇద్దరు ఎంత సర్దుకుందామన్నా కుటుంబ జీవితం సరిగా నడవదు. భార్యాభర్తలు సంతోషంగా ఉంటేనే మెుత్తం కుటుంబం బాగుంటుంది. లేదంటే జీవితాలు నాశనం అవుతాయి. సరిగా ముందుకు వెళ్లాలంటే ఏజ్ గ్యాప్ తక్కువగా ఉన్నవారిని పెళ్లి చేసుకోవాలని చాణక్య నీతి వివరిస్తుంది.