Afternoon Exercise । మధ్యాహ్నం వ్యాయామంతో మధుమేహం నియంత్రణ, మందులు కూడా అవసరం లేదు!
02 June 2023, 20:03 IST
- Afternoon Exercise for Diabetes: మధ్యాహ్నం వ్యాయామం టైప్ 2 డయాబెటిస్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది అని తాజా అధ్యయనం వెల్లడించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Afternoon Exercise
Afternoon Exercise for Diabetes: రోజులో ఇతర సమయాల్లో అత్యంత చురుకుగా ఉండే వారి కంటే, మధ్యాహ్నం శారీరకంగా చురుకుగా ఉండే పాల్గొనేవారి రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్ 2 డయాబెటిస్ సమస్య ఉన్నవారు తమ రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఉదయానికి బదులుగా మధ్యాహ్నం వ్యాయామం చేయాలనేది ఆ అధ్యయనం సారాంశం.
బ్రిగ్‌హామ్ లోని జోస్లిన్ డయాబెటిస్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. సుమారు 37 మిలియన్లకు పైగా అమెరికన్లకు మధుమేహం ఉంది, అందులో 90-95% మంది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిస్‌ను నయం చేసే చికిత్స ఇప్పటికీ లేదు. మందులతో పాటు సరైన ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం ద్వారానే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
జోస్లిన్ డయాబెటిస్ సెంటర్‌కు చెందిన పరిశోధకుల బృందం సుమారు 2,400 మందికి పైగా అధిక బరువు, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తుల డేటాను అధ్యయనం చేసింది. వారి శారీరక శ్రమను కొలిచేందుకు నడుముకు యాక్సిలెరోమెట్రీ రికార్డింగ్ పరికరాన్ని అమర్చారు. అధ్యయనం మొదటి సంవత్సరం డేటాను సమీక్షించిన తర్వాత, మధ్యాహ్నం మితమైన నుండి శక్తివంతమైన శారీరక శ్రమ చేసేవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో గొప్ప తగ్గింపు ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
ఈ అధ్యయన రచయితల్లో ఒకరు, స్లీప్ అండ్ సిర్కాడియన్ డిజార్డర్స్ విభాగానికి చెందిన డాక్టర్ జింగ్యి కియాన్ మాట్లాడుతూ.. "తమ అధ్యయనంలో, టైప్ 2 మధుమేహం ఉన్న వ్యక్తులు మధ్యాహ్న సమయంలో చాలా చురుకుగా ఉన్నప్పుడు గ్లూకోజ్ నియంత్రణలో గొప్ప మెరుగుదలను కలిగి ఉన్నారని మేము గుర్తించాము" అని ఒక ప్రకటనలో తెలిపారు.
అధ్యయనంలో భాగంగా కొందరు వాలంటీర్లకు మధ్యాహ్నం మితమైన వ్యాయామం కల్పించారు. అంటే చురుకైన నడక, పవర్ మొవర్‌తో పచ్చికను కత్తిరించడం, బ్యాడ్మింటన్ ఆడటం వంటివి చేయించారు. మరికొందరికి తీవ్రమైన శారీరక శ్రమ కల్పించారు, వారితో హైకింగ్, ఫాస్ట్ జాగింగ్, బాస్కెట్‌బాల్ లేదా సాకర్ గేమ్ లేదా గంటకు 16 మైళ్ల వేగంతో సైక్లింగ్ చేయించారు. వీరి నాలుగు సంవత్సరాల డేటాను రికార్డ్ చేశారు.
అధ్యయనం నాల్గవ సంవత్సరం డేటాను పరిశీలించినపుడు, ఉదయంతో పోలిస్తే, మధ్యాహ్నం వ్యాయామం చేసిన వారు, వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో భారీ తగ్గుదల కనిపించింది. ఎంతలా వారు ఇకపై మధుమేహం మందులు కూడా తీసుకోవడం మానేయడానికి అత్యధిక అవకాశం ఉందని పరిశోధక బృందం కనుగొంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, టైప్ 2 డయాబెటిస్ అనేది అత్యంత సాధారణ రకంమైన మధుమేహం. శరీరం ఇన్సులిన్‌కు నిరోధకతను కలిగి ఉన్నప్పుడు లేదా తగినంత ఇన్సులిన్ తయారు చేయనప్పుడు ఇది సంభవిస్తుంది. వృద్ధాప్యం, ఊబకాయం, రక్త సంబంధంలో ఎవరికైనా మధుమేహం ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం వలన ఈ వ్యాధి వస్తుంది. మధుమేహం ఉన్న వ్యక్తులు తమ రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోకపోతే నరాలు దెబ్బతినడం, దృష్టి, వినికిడి సమస్యలు, మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది.