Weightloss Foods: ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్‌లో ఆ రెండు పదార్థాలు తిని 31 కిలోలు తగ్గిన యువతి, అదెలాగంటే
08 October 2024, 14:00 IST
- Weightloss Foods: బరువు తగ్గాలనుకునేవారి కోసమే ఈ కథనం. ఒక యువతి బ్రేక్ ఫాస్ట్ లో కేవలం గుడ్లు, బంగాళాదుంపలు తిని 31 కిలోలు బరువు తగ్గిందట. ఆమె తన వెయిట్ లాస్ జర్నీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
సులువుగా బరువు తగ్గడం ఎలా?
ఆధునిక కాలంలో అధిక బరువు బారిన పడుతున్నవారి సంఖ్య చాలా ఎక్కువ. ఊబకాయంతో పాటూ ఎన్నో రోగాలు కూడా శరీరంలో చేరుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ బరువు తగ్గేందుకు ప్రయత్నించండి. అమెరికాకు చెందిన యువతి గుడ్లు, బంగాళాదుంపలు తిని బరువు తగ్గినట్టు చెప్పింది. తన వెయిట్ లాస్ జర్నీని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
అమెరికాకు చెందిన 'వెయిట్ లాస్ అండ్ ఫిట్నెస్ కోచ్' లిడియా ఇనెస్ట్రోజా చెబుతున్న ప్రకారం గుడ్లు, బంగాళాదుంపలతోనే బ్రేక్ ఫాస్ట్ ప్రారంభించాలి. అల్పాహారం కోసం గుడ్లను ఎంతగా తింటే అంత మంచిది. లిడియా ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తో 31 కిలోల బరువు తగ్గింది. గుడ్లు, బంగాళాదుంపలు తినడం వల్ల పొట్ట కొవ్వు కరిగి నడుము సన్నగా మారుతుంది.
బ్రేక్‌ఫాస్ట్‌లో తినాల్సినవి
లిడియా ఇన్స్టాగ్రామ్ లో తాను 31.75 కిలోలు తగ్గినట్టు చెప్పింది. బరువు తగ్గించడంలో తన బ్రేక్ ఫాస్ట్ ఎంతగా ఉపయోగపడిందో వివరించింది. ఆమె తినే అల్పాహారం రెసిపీ గురించి ఆమె ఇటీవల ఒక వీడియోలో వివరించింది. "నా బరువు తగ్గించే ప్రయాణంలో ప్రతిరోజూ నేను ప్రత్యేకమైన అల్పాహారం తీసుకున్నాను. కొన్నిసార్లు ఈ ఆహారాన్ని లంచ్, డిన్నర్ కోసం కూడా తీసుకుంటాను. బహుశా ఈ రోజు వరకు ఇదే నా నెంబర్ వన్ బ్రేక్ ఫాస్ట్ అని కచ్చితంగా చెప్పగలను’ అని వివరిస్తోంది.
లిడియా చెప్పిన ప్రకారం బంగాళాదుంపలను ఉడకబెట్టాలి. ఇలా ఉడకబెట్టడం వల్ల పిండి పదార్థాలు సగానికి తగ్గిపోతాయి. తరువాత వాటిని ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి వేసి బంగాళాదుంప ముక్కులను ఒక స్పూను నూనెతోనే వేయించాలి. ఇందులో ఆలివ్ నూనెను వినియోగించాలి. పావుగంట సేపు చిన్న మంటపై ఈ బంగాళాదుంపలను ఉడికించుకోవాలి. తరువాత గుడ్లు, టమోటాలు, ఉల్లిపాయలు కలిసి వేయించుకోవాలి. దీనికి కూడా కేవలం ఒక స్పూను ఆలివ్ నూనె వాడాలి. కొద్దిగా ఉప్పు, వెల్లుల్లి పొడి కలపాలి. గుడ్డును పగులగొట్టి కీమాలా చేసుకుని తినాలి. ఒక పక్కన రెండు గుడ్లతో చేసిన రెసిపీ, మరో పక్క బంగాళాదుంప రెసిపీ పెట్టుకుని బ్రేక్ ఫాస్ట్ పూర్తిచేయాలి.
బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు, బంగాళాదుంపలు బరువు తగ్గడానికి ఆమె తీసుకున్న మొదటి ఆహారం. కేవలం ఈ రెండూ తినడం వల్లే ఆరోగ్యంగా ఉండలేరు. సమతుల్య ఆహారాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజూ లంచ్, డిన్నర్లో పండ్లు, కూరగాయలతో చేసిన ఆహారాలను తినాలి. వీటిన్నింటితో పాటూ వ్యాయామం చేయడం మర్చిపోకూడదు.
బరువు తగ్గడానికి ఈ రెసిపీ నిజంగా పనిచేస్తుందా?
ఆరోగ్యకరమైన ఆహారంలో అల్పాహారం ముఖ్యమైనది. ఇది జీవక్రియను పెంచుతుంది, ఉదయం పూట మీకు శక్తిని ఇస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఈ బ్రేక్ ఫాస్ట్ ప్రేరేపిస్తుంది.
గుడ్లు, బంగాళాదుంపలు సమతుల్య ఆహారంలో భాగంగా ఉన్నప్పటికీ, 'రోజూ అల్పాహారం కోసం ఈ ఆహారాలను మాత్రమే తీసుకోవడం పూర్తిగా మంచిది కాదు' అని గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ సోనీ అన్నారు. ప్రోటీన్లు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి వాటి కోసం వివిధ రకాల ఆహరాలను తినాల్సి ఉంటుంది.
వ్యక్తిగత అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా సమతుల్య, కేలరీలున్న ఆహారాన్ని ఎంచుకోవాలి. ఆహారంపై నియంత్రణ, శారీరక శ్రమ కలిసి త్వరగా బరువు తగ్గడం సులువవుతుంది.