Fake Eggs Vs Real Eggs: మార్కెట్లోకి వస్తున్న ఫేక్ గుడ్లు, ఇంట్లోనే ఫేక్ గుడ్లు, నిజమైన గుడ్ల మధ్య తేడాను గుర్తించండిలా
Fake Eggs Vs Real Eggs: గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అయితే మార్కెట్లోకి ఫేక్ గుడ్లను కూడా విడుదల చేస్తున్నారు. వాటిని తినడం ఎంతో ప్రమాదకరం. ఫేక్ గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసుకోండి.
Fake Eggs Vs Real Eggs: గుడ్డును సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఎంతోమంది గుడ్డును పోషకాహారంగా తింటారు. అయితే మార్కెట్లోకి నకిలీ గుడ్లు కూడా వస్తున్నాయి. ఈ ఫేక్ గుడ్ల వల్ల ఆరోగ్య ప్రమాదాలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. మీరు సురక్షితమైన ఆహారాన్ని మాత్రమే తినాలనుకుంటే నకిలీ గుడ్లు, నిజమైన గుడ్ల మధ్య తేడాను తెలుసుకోవాలి. నకిలీ గుడ్లను కృత్రిమంగా తయారు చేస్తారు. కొన్ని రసాయనాలు, జెలెటిన్, కృత్రిమ రంగులు, సింథటిక్ పదార్థాలు ఉపయోగించి ఈ నకిలీ గుడ్లను తయారు చేసి అమ్ముతారు. ఇవి ఎలాంటి పోషకాలను కలిగి ఉండవు. పైగా రసాయనాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రమాదకరం. నకిలీ గుడ్లు, ఫేక్ గుడ్ల మధ్య తేడాను తెలుసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారమవుతాము.
నకిలీ గుడ్లను ఇలా గుర్తించండి?
1. నిజమైన గుడ్డు పెంకు సాధారణంగా కరుకుగా ఉంటుంది. చేత్తో తడిమినప్పుడు చేతికి ఏదో కరుకుగా తగిలినట్టు అనిపిస్తుంది. నకిలీ గుడ్ షెల్ మాత్రం మృదువుగా ఉంటుంది. ఎత్తు పల్లాలు లేకుండా ఏకరీతిగా ఉంటుంది. నిజమైన గుడ్డు పెంకుతో పోలిస్తే... ఈ నకిలీ గుడ్డు పెంకు మెరుస్తూ కనిపిస్తుంది.
2. నిజమైన గుడ్డును చేత్తో పట్టుకొని కదిలించినప్పుడు అది ఎలాంటి ధ్వని ఉత్పత్తి చేయదు. ఎందుకంటే పచ్చ సొనా, తెల్ల సొన లోపల చాలా గట్టిగా కప్పబడి ఉంటాయి. అవి ఎలాంటి శబ్దాన్ని సృష్టించలేవు. కానీ నకిలీ గుడ్డును షేక్ చేస్తే చిన్నగా శబ్దం వస్తుంది. ఇది లోపల ఉన్న ద్రవం వల్ల వస్తుంది.
3. నిజమైన గుడ్డు పెంకు పెళుసుగా అనిపిస్తుంది. పగలుగొట్టినప్పుడు సులభంగా విరిగిపోతుంది. లోపల సన్నని పలుచటి పొరను కూడా చూపిస్తుంది. నకిలీ గుడ్డు పైన పెంకు మాత్రం పగలగొట్టడానికి కాస్త కష్టంగా ఉంటుంది. ఇది పగిలినప్పుడు రెండు పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయే అవకాశం ఉంది.
4. నిజమైన గుడ్డును పగలగొట్టాక పచ్చ సొన గుండ్రంగా ఉంటుంది. గుడ్డులోని తెల్లసొన ద్రవాకారంలో చూడడానికి కాస్త పారదర్శకంగానే కనిపిస్తుంది. కానీ నకిలీ గుడ్డులోని పచ్చ సొన మాత్రం గుండ్రంగా ఉండదు. అది విరిగిపోయినట్టు అవుతుంది. ఇక తెల్ల సొన నీళ్ల నీళ్లగా ఉంటుంది.
5. నిజమైన గుడ్డును ఉడికిస్తే పచ్చసొన, తెల్లసొన త్వరగానే ఉడికి గడ్డ కడతాయి. కానీ నకిలీ గుడ్డును ఉడికిస్తే తెల్ల సొన, పచ్చ సొన ఒకేలా ఉడకవు. ఇది ఉడకడానికి కాస్త సమయం ఎక్కువ పట్టొచ్చు.
నకిలీ గుడ్లను తింటే ఏమవుతుంది?
నకిలీ గుడ్లు తీసుకోవడం వల్ల అందులో వాడిన రసాయనాలు శరీరంలో చేరి ఆరోగ్య సమస్యలను తెస్తాయి. ఈ సింథటిక్ పదార్థాలు జీర్ణాశయంతర సమస్యలు, అలెర్జీలు కలిగిస్తాయి. మీకు తెలియక దీర్ఘకాలంపాటూ నకిలీ గుడ్లను వినియోగిస్తే తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.
టాపిక్