Shocking Study: షాక్ ఇస్తున్న కొత్త అధ్యయనం, 2030 నాటికి 45 శాతం మంది మహిళలు పెళ్లికి దూరమై ఒంటరిగా ఉంటారట
10 September 2024, 8:00 IST
- Shocking Study: సమాజంలో మహిళ ఎంతో మారుతూ వస్తోంది. మహిళల అభిప్రాయాలు కూడా ఎంతో మారుతున్నాయి. సాంప్రదాయ కుటుంబ బాధ్యతల కంటే వృత్తినే ఉన్నతంగా భావించే మహిళల సంఖ్య పెరగబోతోంది. మోర్గాన్ స్టాన్లీ చేసిన సర్వే ఇదే చెబుతోంది
పెళ్లి వద్దంటున్న అమ్మాయిలు
Shocking Study: మీకు ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజమే. 2030 నాటికల్లా ప్రపంచంలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయే మహిళలు 45 శాతం పెరుగుతారు. దీని వల్ల ప్రపంచంలో పుట్టే పిల్లల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుంది. మహిళలు ఇంటి బాధ్యతల కన్నా వృత్తినే ఉన్నతంగా భావించి పెళ్లికి, పిల్లలకు దూరంగా ఉంటారు. ఈ విషయాన్ని మోర్గాన్ స్టాన్టీ సంస్థ చేసిన సర్వేలో తెలిసింది. మహిళలు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నట్టు ఈ అధ్యయనంలో తేల్చింది.
పెళ్లే ఫైనల్ కాదు
ఒకప్పుడు మహిళలకు పెళ్లే పరమావిధి. పెళ్లి చేసుకుంటే ఆమె సెటిల్ అయినట్టే లెక్క. కానీ ఇప్పుడు వారి ఆలోచనల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. వ్యక్తిగత అభివృద్ధికి, వృత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పెళ్లి చేసుకోకుండా వృత్తిగత జీవితానికి కట్టుబడి ఉండేందుకు సిద్ధపడుతున్నారు. పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతల వల్ల వారు వృత్తిగతంగా ఎదగలేమని, అలాగే తమని తాము అప్డేట్ చేసుకోలేమని వారు భావిస్తున్నారు. తమకోసం సమయం కేటాయించుకోలేమని కూడా ఎంతోమంది మహిళల భావన. అందుకే వారు పెళ్లి వైపు మొగ్గుచూపడం తగ్గిస్తున్నారు.
పెరగనున్న విడాకులు
అంతేకాదు మధ్య వయసుకు చేరుకున్న తర్వాత అంటే 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలు ఎక్కువమంది విడాకులకు దాఖలు చేసే అవకాశాలు కూడా పెరుగుతున్నాయని ఈ సర్వే చెబుతోంది. ఇలా కూడా ఒంటరి మహిళల సంఖ్య పెరగబోతోంది.
పూర్వం మహిళలు 20 ఏళ్లకే పెళ్లి చేసుకొని తల్లులు అయ్యేవారు. తల్లి కావాలనే ఆలోచనను ఆలస్యం చేసేవారు కాదు. అప్పట్లో వారికి కుటుంబము, భర్త, పిల్లలే లోకంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా తమకంటూ సొంత జీవితాన్ని కోరుకుంటున్నారు. అలా కొంతమంది పని, కుటుంబ జీవితం మధ్య సమతుల్యతను కూడా కోరుకుంటున్నారు. పిల్లలను కనడం ఖర్చుతో కూడిన పని అని కూడా భావించేవారు ఎక్కువమంది అయ్యారు.
ప్రస్తుతం ఉన్న కాలంలో ఎక్కువ మంది మహిళలు తమ ఇళ్లల్లో కుటుంబపోషకులుగా ఉన్నారు. అంతేకాదు శ్రామిక శక్తిలో మహిళల వాటా కూడా పెరుగుతూ వస్తోంది. ఈ మార్పు మహిళలకు వారి వ్యక్తిగత ఆనందంపై, కెరీర్ వృద్ధిపై దృష్టి పెట్టడానికి అవకాశాన్ని ఇస్తుంది.
2030 నాటికల్లా లింగ వేతన వ్యత్యాసం తగ్గకపోతే మహిళలు ఎంతోమంది అవివాహితులుగా మిగిలిపోయే అవకాశం ఉంది. పిల్లల సంరక్షణ, అనువైన పనిగంటలు, సమాన వేతనం ఇవే మహిళలను పెళ్లి వైపు ఆలోచించకుండా చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాబోయే సంవత్సరాల్లో మహిళల పాత్ర కీలకంగా మారబోతోంది. ఎక్కువ మంది మహిళలు వివాహాన్ని, పిల్లలను పక్కనపెట్టి పూర్తిగా తమ ఆర్థిక పరిస్థితుల కోసమే పనిచేయబోతున్నట్టు మోర్గాన్ స్టాన్లీ తన అధ్యయనంలో తేల్చింది. మహిళలు ఎప్పుడైతే పెళ్లికి దూరం అవుతారో పెళ్లి కానీ మగవారి సంఖ్య కూడా పెరిగిపోవడం సహజమే.