Rare Operation : 15 ఏళ్ల యువకుడికి అరుదైన సమస్య.. 9 గంటల పాటు ఆపరేషన్
13 April 2024, 12:30 IST
- Rare Operation In Hyderabad : 15 ఏళ్ల యువకుడికి అరుదైన సమస్య వచ్చింది. కుడివైపు ఎదభాగం లోపలకు నొక్కుకుపోయింది. 9 గంటల పాటు వైద్యులు ఆపరేషన్ చేశారు.
యువకుడికి అరుదైన ఆపరేషన్
పురుషులు అందరికీ ఎద భాగం సమతలంగా ఉంటుంది. కానీ 15 ఏళ్ల యువకుడికి పుట్టుకతోనే ఒక సమస్య ఏర్పడింది. కుడివైపు ఎద భాగం బాగా లోతుకు నొక్కుకుపోయినట్లు ఉంది. దీనివల్ల అటువైపు ఉండే ఊపిరితిత్తులు కూడా లోపలకు నొక్కుకుపోయి, అతడికి సరిగా ఊపిరి అందేది కాదు. కొంతదూరం నడిచినా విపరీతమైన ఆయాసం వచ్చేది. దీంతో అతడు బాగా ఇబ్బంది పడేవాడు.
పలు ఆసుపత్రులకు తిరిగినా ఫలితం లేకపోయింది. అయితే హైదరాబాద్ నగరంలోని అమోర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ అమోర్ కేన్సర్ సెంటర్‌లో ఆ యువకుడికి ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స చేసిన ఆసుపత్రి ఎండీ డాక్టర్ కిశోర్ బి. రెడ్డి ఈ కేసు వివరాలు వెల్లడించారు.
'ఆ యువకుడికి పుట్టుకతోనే సమస్య ఉంది. ఎద భాగం లోపలకు నొక్కుకుపోయి ఉండటం వల్ల ఊపిరితిత్తులు కూడా సరిగా పనిచేయని పరిస్థితి ఏర్పడింది. దీన్ని వైద్య పరిభాషలో పెక్టస్ ఎక్స్‌కవాటమ్ అంటారు. ఈ సమస్య ఉన్నవారికి ఊపిరితిత్తులు కూడా బాగా లోపలకు నొక్కుకుపోతాయి. సాధారణంగా మనం ఊపిరి పీల్చుకునేటప్పుడు ఎద భాగం ముందుకు వస్తుంది. ఊపిరి విడిచిపెట్టేటప్పుడు అది లోపలకు వెళ్తుంది. కానీ ఈ కేసులో అలా కాకపోవడం వల్ల అతడికి ఊపిరి కూడా సరిగా అందేది కాదు. ఇందుకు చాలా సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.' అని డాక్టర్ కిశోర్ బి. రెడ్డి చెప్పారు.
ముందుగా అతడి పక్కటెముకలను కత్తిరించి, లోపల అవసరమైన చోట మెటల్ బార్లు, రిబ్ ప్లేట్లు పెట్టామని తెలిపారు డాక్టర్ కిశోర్ బి. రెడ్డి. ఈ మెటల్ బార్లకు పక్కటెముకల్లో రెండోదాని కింద, ఐదో పక్కటెముక కింద పెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. రెండు రిబ్ ప్లేట్లను కూడా పెట్టి, వాటిని పక్కటెముకలకు స్క్రూలతో బిగించామన్నారు. రెండు ప్రధాన ఫ్లాప్ కవర్లు కూడా పెట్టడం వల్ల ఎద భాగం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుందని అన్నారు. అనంతరం చెస్ట్ డ్రెయిన్ కూడా పెట్టామని వివరించారు కిశోర్ బి.రెడ్డి.
ఈ మొత్తం శస్త్రచికిత్సకు దాదాపు 9 గంటలకుపైగా సమయం పట్టింది. ఇందులో ప్రధానంగా కార్డియోథొరాసిక్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ కె. అరుణ్‌తోపాటుగా పలువురు వైద్యులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ సిబ్బంది, ఐసీయూ సిబ్బంది, నర్సులు సైతం అతడు కోలుకోవడానికి సహాయపడ్డారు. శస్త్రచికిత్స నుంచి కోలుకున్న తర్వాత రోగికి పల్మనరీ ఫంక్షన్ టెస్టు చేయగా ఫలితాలు బాగా వచ్చాయి. అతడు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవడంతో పాటు తన పనులన్నీ చేసుకోగలుగుతున్నాడు.
టాపిక్