Improve Eye Sight । ఈ 5 పానీయాలు తాగితే కంటిచూపు పెరుగుతుంది, చీకట్లోనూ స్పష్టంగా చూడగలరు!
14 February 2023, 10:56 IST
- Drinks To Improve Eye Sight: మీరు ఏదీ సరిగ్గా చూడలేకపోతున్నారా? కంటిచూపు మందగించడానికి కారణాలు అనేకం, ఇక్కడ పేర్కొన్న కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు మీ కంటిచూపును పెంచగలవు.
Drinks To Improve Eye Sight
నేటి ఆధునిక జీవనశైలిలో ప్రతిరోజూ కంప్యూటర్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు లేదా సెల్‌ఫోన్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతోనే సవాసం చేయడం ఎక్కువ అవుతుంది. పెరిగిన స్క్రీన్ సమయం ప్రభావంతో కంటిశుక్లం, గ్లాకోమా, పొడి కళ్ళు, రేచీకటి ఇతరత్రా కంటి వ్యాధులకు కారణం అవుతున్నాయని తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూడటం వలన హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ బారినపడి తన కంటి చూపు ఎలా కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అందువల్ల కంటి సంరక్షణ కోసం అవసరమయ్యే అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కంటి వ్యాధులను నివారించడానికి పోషకాహారం కూడా కీలకం. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రకాల పండ్లు, కూరగాయలలో కంటిచూపును మెరుగుపరిచే పోషకాలు ఎన్నో ఉంటాయి.
Drinks To Improve Eye Sight- కంటిచూపును మెరుగుపరిచే పానీయాలు
రాబోయేది ఎండాకాలం, మీరు వాటిని జ్యూసులుగా తీసుకోవడం కూడా పలు విధాలుగా మంచిదే. మీ దృష్టిని మెరుగుపరిచే 5 ఆరోగ్యకరమైన పానీయాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
క్యారెట్- బీట్‌రూట్ - ఆపిల్ జ్యూస్
క్యారెట్‌లోని విటమిన్ ఎ కంటెంట్ మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది, రేచీకటి రాకుండా కాపాడుతుంది. మరోవైపు, బీట్‌రూట్‌లో లుటిన్ , జియాక్సంతిన్ ఉంటాయి, ఇవి మాక్యులర్, రెటీనా ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఆపిల్స్‌లో అనేకమైన బయోఫ్లేవనాయిడ్‌లు ఉంటాయి, ఇవి దృష్టి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ మూడింటిలో మీ దృష్టిని పెంచే పోషకాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ మూడు కలిపి జ్యూస్ చేసుకొని తాగితే దృష్టి లోపాలు ఉండవు.
బ్రోకలీ- పాలకూర- కాలే జ్యూస్
ఆకుపచ్చని ఆకుకూరలు యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. మంచి దృష్టిని అందించడానికి కళ్లకు ఈ పోషకాలు ఎంతో కీలకమైనవి. బ్రోకలీ- పాలకూర- కాలే మిశ్రమంలో లభించే ల్యూటిన్, జియాక్సంతిన్ పోషకాలు కంటిచూపును మెరుగుపరచడనే కాకుండా కళ్లపై హానికరమైన కిరణాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటిని వండినపుడు ఈ పోషకాలు పోవచ్చు, కాబట్టి జ్యూస్ చేసుకొని తాగితే మంచిది.
టమోటా జ్యూస్
కళ్ల ఆరోగ్యానికి కావల్సిన ఎక్కువ పోషకాలు టమోటా రసంలో ఉంటాయి. టొమాటోలో ఉండే పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. లైకోపీన్, వయస్సు సంబంధిత కంటి మచ్చల క్షీణత నుండి రక్షించే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్ టమోటాలలో లభిస్తుంది.
కొబ్బరి నీరు
కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, మినరల్స్ అలాగే అమినో యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి, ఇవి కంటి రక్షిత కణజాలాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇది చిన్న రక్త నాళాలు , ఆప్టిక్ నరాలకి హాని కలిగించే కంటి వ్యాధి. గ్లాకోమా ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆరెంజ్ జ్యూస్
ఆరెంజ్ జ్యూస్ చాలా మందికి ఫేవరెట్ డ్రింక్. ఇది ఎక్కడైనా సులభంగా లభిస్తుంది. నారింజలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది, ఇది కంటిశుక్లం ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే కంటి రక్త నాళాల బలం, స్థిరత్వాన్ని పెంచుతుంది. ఫోలేట్, అనేది దృష్టి అభివృద్ధికి కీలకమైన B విటమిన్, నారింజ రసంలో ఈ పోషకం కూడా ఉంటుంది. మీ కంటిచూపును మెరుగుపరుచుకునేందుకు ఆరెంజ్ జ్యూస్ తాగుతూ ఉండండి.