Best Winter Teas: చలికాలం వచ్చేస్తోంది, ఉదయాన్నే ఈ వేడి వేడీ టీ తాగితే ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం మీ సొంతం
26 October 2024, 8:30 IST
చలికాలం మొదలవుతోంది. దానికి తోడు అకాల వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలే. అయితే రోజూ మనకి అందుబాటులో ఉన్న ఒక టీ తాగితే ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం మన సొంతమవుతుంది.
చలికాలంలో టీ
చలికాలం వచ్చేస్తోంది. సాధారణ రోజులతో పోలిస్తే శీతాకాలంలో గాలిలోని తేమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్రిముల సంఖ్య అనేక రెట్లు పెరుగుతుంది. అవి మీ శరీరానికి లెక్కలేనన్ని రోగాలను తెచ్చిపెడతాయి. కాబట్టి చలికాలంలో శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మీరు ప్రతిరోజూ ఒక స్పెషల్ టీ తాగితే మీకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా సొంతమవుతుంది.
తులసి ఆకులతో టీ
తులసి ఆకులతో తయారు చేసే టీ మీ శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. కాబట్టి ఒక గ్లాసు నీటిలో 10 తులసి ఆకులను వేసి బాగా మరిగించండి. అది మరుగుతున్నప్పుడు పావు చెంచా మిరియాలపొడిని కలపండి. ఆ తర్వాత వడపోసి తేనెతో కలిపి గోరువెచ్చగా తాగితే వ్యాధుల నుండి మీకు రక్షణ లభిస్తుంది.
అల్లం విత్ పసుపు టీ
అల్లం, పసుపు కాంబినేషన్‌తో టీ తయారు చేయడం చాలా సులభం. ఒక గ్లాసు నీటిలో పావు చెంచా తురిమిన అల్లం కలపండి. ఆ తర్వాత పావు చెంచా పసుపుతో ఆ నీటిని మరిగించండి. అల్లం, పసుపు టీ బాగా మరిగిన తర్వాత వడకట్టి అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి ఒక చెంచా తేనె కలపండి. భోజనం తర్వాత ఈ టీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలానే రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.
ఉసిరి టీ
ఒక గ్లాసు నీటిని బాగా మరిగించాలి. అందులో అందులో ఒక చెంచా మిరియాలు, జీలకర్ర వేయాలి. ఇవన్నీ మరిగిన తర్వాత కొన్ని పుదీనా ఆకులు వేసి కలపాలి. వడకట్టి అందులో కొద్దిగా అల్లం వేసి తాగితే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరికాయ రసాన్ని నీరు, తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగాలి.
దాల్చిన చెక్కతో టీ
సాధారణంగా మెటబాలిజం మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒక దాల్చిన చెక్కని నీటిలో మరిగించి అనంతరం వడగట్టి తేనెతో కలిపి తాగాలి.ఇలా ప్రతిరోజూ సాయంత్రం తాగితే శరీరానికి మంచి మెటబాలిజం అందుతుంది. అలానే శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తి లభిస్తుంది.
పుదీనా విత్ తులసి టీ
కొన్ని పుదీనా, తులసి ఆకులను నీటిలో మరిగించండి. దానిని వడకట్టి అందులో కొన్ని చుక్కల నిమ్మరసం, తేనె కలపాలి. మధ్యాహ్న భోజనం తర్వాత ఈ టీ తాగితే జీర్ణక్రియ మెరుగై శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.