Herbs for Kidney Health । కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 అద్భుతమైన మూలికలు ఇవే!
16 March 2023, 11:11 IST
- Herbs for Kidney Health: మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, వాటి పనితీరును మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మూలికలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.
Herbs for Kidney Health
కిడ్నీ మన శరీరంలో ఎంత ముఖ్యమైన అవయవమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవక్రియను నియంత్రించడంలో, రక్త వడపోతను నిర్వహించడంలో, ఎముక మజ్జను ఉత్పత్తి చేయడంలో, హార్మోన్లను విడుదల చేయడంలో అలాగే శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుకోవడంలో మూత్రపిండాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంతేకాదు ఎముకల దృఢత్వానికి, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఇవి సహాయపడతాయి. మొత్తంగా శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలి, అవి సక్రమంగా పనిచేయాలి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచటానికి, వాటి పనితీరు మెరుగుపరచటానికి కొన్ని మూలికలు ప్రభావం చూపుతాయని ఆయుర్వేదం పేర్కొంది.
Herbs for Kidney Health- మూత్రపిండాల ఆరోగ్యానికి ఆయుర్వేద మూలికలు
ఆయుర్వేద వైద్యం ప్రకారంగా, కిడ్నీ ఆరోగ్యానికి తోడ్పడే ఆ ముఖ్యమైన మూలికలు ఏవో ఇక్కడ చూడండి.
గిలోయ్
అఫ్లాటాక్సిన్, దాని అనుబంధిత ఫ్రీ రాడికల్స్ మూత్రపిండాలపై హానికర ప్రభావాలను కలిగి ఉంటాయి. వీటికి విరుగుడుగా యాంటీఆక్సిడెంట్ లక్షణాలను గిలోయ్ మూలిక కలిగి ఉంది. ఈ మూలిక జీర్ణక్రియను మెరుగుపరచడానికి , రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.
త్రిఫల
శరీరాన్ని పునరుజ్జీవింపజేసే గుణాలు కలిగిన మూడు మూలికలు అమలాకి, హరిటాకి, బిభిటాకిల అద్భుతమైన కలయిక త్రిఫల. ఇది మూత్రపిండాల కణజాలాలను బలపరుస్తుంది, ప్లాస్మా ప్రోటీన్లు, అల్బుమిన్, క్రియేటినిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. తద్వారా మూత్రపిండాల పనితీరును పెంచుతుంది.
పసుపు
పసుపు అనేది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ ఎఫెక్ట్‌లతో కూడిన అద్భుతమైన సుగంద్ర ద్రవ్యం. ఆహారాలను తాజా పసుపుతో వండుకోవాలి. పసుపులోని ఔషధ గుణాలు T2DM రోగులలో ప్లాస్మా ప్రోటీన్‌లను మెరుగుపరుస్తుంది. రక్తంలో యూరియా, క్రియేటినిన్ స్థాయిలను తగ్గిస్తుంది, ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
అల్లం
అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌లతో సంబంధం ఉన్న నొప్పి, వాపుని తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం ఒక ప్రయోజనకరమైన హెర్బ్, ఇది రక్త శుద్దీకరణ, ఆహార జీర్ణక్రియ, రక్తంలో ఆక్సిజన్‌ను మెరుగుపరచడం, మూత్ర విసర్జన అసౌకర్యాన్ని తగ్గించడం మొదలైన ప్రయోజనాలను అందిస్తుంది. తద్వారా మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
డాండెలైన్ వేర్లు
డాండెలైన్ రూట్ ఒక సహజ మూత్రవిసర్జక కారకం, ఇది మూత్రపిండాలలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, మూత్ర ప్రవాహాన్ని పెంచుతుంది. కిడ్నీలో ఏర్పడే చిన్న చిన్న రాళ్లను ( Kidney Stones )తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే మూత్రనాళాల్లో మంటను తగ్గించే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలను కలిగి ఉంది.