Writer Padmabhushan in ZEE5 OTT: జీ5 ఓటీటీలో నంబర్ వన్.. రైటర్ పద్మభూషణ్
21 March 2023, 20:45 IST
Writer Padmabhushan in ZEE5 OTT: జీ5 ఓటీటీలో నంబర్ వన్ గా నిలుస్తోంది రైటర్ పద్మభూషణ్ మూవీ. ఈ కామెడీ డ్రామాకు థియేటర్లలోనే కాదు డిజిటల్ ప్లాట్‌ఫామ్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.
రైటర్ పద్మభూషణ్ లో సుహాస్
Writer Padmabhushan in ZEE5 OTT: చిన్న సినిమాలే అనుకుంటాం కానీ కొన్ని పెద్ద విజయాలే సాధిస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటి రైటర్ పద్మభూషణ్. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.12 కోట్లు వసూలు చేసింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో చిన్న సినిమా అయినా కూడా ప్రేక్షకులు ఆదరించారు.
ఇక థియేటర్లలో తన రన్ ముగిసిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో దూసుకెళ్తోంది. జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో జీ5 ఇండియా ట్రెండింగ్ లో నంబర్ 1గా ఉందీ రైటర్ పద్మభూషణ్ మూవీ. సుహాస్ లీడ్ రోల్ లో నటించిన ఈ కామెడీ డ్రామాను జీ5లో ఎగబడి చూస్తున్నారు.
ఈ మూవీని శణ్ముఖ ప్రశాంత్ డైరెక్ట్ చేశాడు. అతనికిదే తొలి సినిమా కావడం విశేషం. అయితే ఓ మంచి ఫీల్ గుడ్ మూవీని అందించాడంటూ అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమాలో సుహాస్ తోపాటు ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గౌరి ప్రియా రెడ్డి, గోపరాజులాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మించింది.
రైటర్ పద్మభూషణ్ టీజర్స్, ట్రైలర్స్ చూసి ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా అనే నమ్మకంతో థియేటర్‌లో అడుగుపెట్టిన ప్రేక్షకులకు ఫన్‌తో పాటు చక్కటి సందేశాన్ని అందించి సర్ ప్రైజ్ చేశాడు డైరెక్టర్ షణ్ముఖ్ ప్రశాంత్.
నిజాయితీతో కష్టపడి సంపాదించుకున్న పేరు, డబ్బు ఏదైనా దానిని మనస్ఫూర్తిగా ఆస్వాదించగలుగుతాం. అలా కాకుండా అప్పనంగా వచ్చే పేరుప్రతిష్టల్ని ఎంజాయ్ చేయడంలో భయం అభద్రతా భావం కలుగుతాయి. అలాంటి ఓ రచయిత కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు.
తనది కాని పేరు, గౌరవాన్ని అబద్ధంతో పొంది సమాజంలో సెలబ్రిటీగా మారిపోయిన అతడు ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నాడన్నది ఆద్యంతం వినోదాత్మకంగా ఈ సినిమాలో (Writer Padmabhushan Review)చూపించారు.
మగవాళ్ల విషయంలో కలల్ని, అభిరుచులను ప్రోత్సహించే సమాజం మహిళలకు వచ్చే సరికి కనీసం వారి ఇష్టాల్ని, అభిప్రాయాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించరనే సందేశాన్ని చూపించారు. పెళ్లి తో మహిళల కలలకు ముగింపు పడినట్లు కాదని,వారి ఇష్టాల్ని గౌరవించాలని ఈ సినిమాలో భావోద్వేగభరితంగా చూపించారు.