తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Gopal Varma: వ్యూహం, శపథం సినిమాలను టీడీపీ, జనసేన వాళ్లు చూస్తారా? ఆర్జీవీ ఆన్సర్ ఇదే

Ram Gopal Varma: వ్యూహం, శపథం సినిమాలను టీడీపీ, జనసేన వాళ్లు చూస్తారా? ఆర్జీవీ ఆన్సర్ ఇదే

19 February 2024, 15:08 IST

google News
    • Ram Gopal Varma - Vyuham Movie: రామ్‍గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన పొలిటికల్ డ్రామా వ్యూహం మూవీ రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. అయితే, ఈ సినిమాను కొన్ని పార్టీల మద్దతుదారులు చూస్తారా అనే విషయంపై తాజాగా సోషల్ మీడియాలో ఆర్జీవీ స్పందించారు.
రామ్‍గోపాల్ వర్మ
రామ్‍గోపాల్ వర్మ

రామ్‍గోపాల్ వర్మ

Ram Gopal Varma: వివాదాస్పద డైరెక్టర్ రామ్‍గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం, శపథం సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వ్యూహం చిత్రాన్ని ఫిబ్రవరి 23వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాలను తెరకెక్కించినట్టు ఆర్జీవీ ఇప్పటికే తెలిపారు. అలాగే, వ్యూహం, శపథం చిత్రాలపై కొన్ని రాజకీయ పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి.

వ్యూహం, శపథం చిత్రాల్లో తెలుగు దేశం, జనసేన పార్టీలను ఉద్దేశ్యపూర్వరంగానే అభ్యంతరకరంగా ఆర్జీవీ చూపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. వ్యూహం సినిమా కూడా కేసులను ఎదుర్కొని ఎట్టకేలకు రిలీజ్ అయ్యేందుకు అనుమతి తెచ్చుకుంది. ఈ తరుణంలో ఈ చిత్రాలను తెలుగుదేశం, జనసేన వాళ్లు చూస్తారా అనే ప్రశ్న తనకు వస్తోందంటూ.. దానికి తన మార్క్ సమాధానం చెప్పారు ఆర్జీవీ. ఈ మేరకు నేడు ఓ వీడియో పోస్ట్ చేశారు.

తెలుగుదేశం, జనసేన వాళ్లు ఎవరికి తెలియకుండా బాత్‍రూమ్‍ల్లో వ్యూహం, శపథం చిత్రాలు చూస్తారంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రామ్‍గోపాల్ వర్మ. తటస్థంగా ఉండేవారు బహిరంగంగా చూడొచ్చని.. ఇష్టం లేకపోతే చూడడం మానేయండని అన్నారు.

వ్యూహం, శపథం చిత్రాల్లో నిజాన్ని నగ్నంగా చూపించాలనేది నా ఉద్దేశం. ఈ పొటిలికల్ సినిమాలను టీడీపీ, జనసేన వాళ్లు చూస్తారా అనే ప్రశ్న వచ్చింది” అని ఆర్జీవీ తెలిపారు. దానికి ఆన్సర్ ఇచ్చారు. తాను పొద్దున్నే శృంగార చిత్రాలు చూసినట్టు.. టీడీపీ వాళ్లు, జనసేన వాళ్లు ఎవ్వరికీ తెలియకుండా వారి బాత్‍రూమ్‍ల్లో వ్యూహం, శపథం సినిమాలను చూసుకుంటారనేది తన ఉద్దేశమని రామ్‍గోపాల్ వర్మ అన్నారు. “ఏ పార్టీ వాళ్లు కాకుండా తటస్థంగా ఉన్న వారికి ఆ అవసరం లేదు. మీరు పబ్లిక్‍గా అందరితో చూడొచ్చు. వ్యూహం ఫిబ్రవరి 23, శపథం మార్చి 1న వస్తుంది. మీకు ఇష్టం ఉంటే చూడండి. లేకపోతే మానేయండి” అని వీడియోను ముగించారు ఆర్జీవీ.

2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం దగ్గరి నుంచి 2019 ఏపీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే మధ్య జరిగిన ఘటనలు వ్యూహం సినిమాలు చూపిస్తానని రామ్‍గోపాల్ వర్మ ఇటీవల చెప్పారు. 2019లో సీఎం జగన్ అయ్యాక ఏపీలో జరిగిన పరిణామాలను శపథం చూపిస్తానని చెప్పారు.

ఈ చిత్రాల్లో వైఎస్ జగన్ పాత్రను అజ్మల్ పోషించగా.. భారతిగా మానస నటించారు. ధనుంజయ్ ప్రభునే, సురభి పద్మావతి, రేఖా నిరోశా, వాసు ఇంటూరి కీరోల్స్ చేసారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆనంద్ ఉన్నారు. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ ఈ మూవీని నిర్మించారు. ఇటీవలే వ్యూహం, శపథం రెండు చిత్రాలకు కలిపి ఒకే ట్రైలర్ రిలీజ్ చేశారు ఆర్జీవీ.

ఆలస్యంగా..

మూడు నెలల క్రితమే రిలీజ్ కావాల్సిన వ్యూహం కోర్టు కేసు వల్ల ఆలస్యమైంది. ఈ సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సెన్సార్ సర్టిఫికేట్‍ను రద్దు చేసింది కోర్టు. అయితే, రెండోసారి సెన్సార్ తర్వాత విడుదలకు అంగీకరించింది డివిజన్ బెంచ్. దీంతో వ్యూహం మూవీ రిలీజ్‍కు గ్రీన్ సిగ్నల్ లభించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం