Actress Shobitha Shivanna Suicide: మిస్టరీగా మారిన సీరియల్ నటి శోభిత ఆత్మహత్య.. వివాహమైన ఏడాదన్నర వ్యవధిలోనే విషాదం
02 December 2024, 10:42 IST
Kannada Actress Shobitha Suicide: వీజేగా కెరీర్‌ను ప్రారంభించి.. సీరియల్స్‌లో పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ నటి శోభిత.. సినిమాల్లో కూడా నటించింది. అయితే.. పెళ్లి తర్వాత ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చి..?
నటి శోభిత
బ్రహ్మగంతు సీరియల్ ఫేమ్ నటి శోభిత శివన్న ఆత్మహత్య మిస్టరీగా మారింది. కన్నడలో చాలా సీరియల్స్‌లో నటించిన శోభిత.. గత ఏడాది వివాహం తర్వాత సీరియల్స్‌కి క్రమంగా దూరమైంది. సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకున్న శోభిత హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటూ ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమె భర్త సుధీర్ కూడా ఇంట్లోనే ఉండటంతో.. పలు అనుమానాలకి తావిస్తోంది.
కర్నాటలో పుట్టి.. హైదరాబాద్‌కి వచ్చి
కర్నాటకలోని సకలేష్‌పూర్‌లో పుట్టి పెరిగిన శోభిత.. తొలుత ఓ మ్యూజిక్ ఛానల్‌లో వీడియో జాకీగా పనిచేసేది. వీజేగా బాగా పాపులారిటీ వచ్చిన తర్వాత సీరియల్స్‌లో ఎంట్రీ ఇచ్చింది. సీరియల్స్‌లో ఆమె క్రేజ్ బాగా పెరగడంతో.. సినమాల్లోనూ శోభితకి అవకాశాలు వచ్చాయి. బ్రహ్మగంతు సీరియల్‌లో నెగటివ్ రోల్ చేసిన శోభిత... నీనిదలే సీరియల్‌లోనూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. కన్నడలోనే కాదు.. ఇతర భాషల్లోనూ ఆమెకి సీరియల్స్‌లో అవకాశాలు వచ్చాయి.
సీరియల్స్ నుంచి సినిమాల వైపు
ఒకవైపు సీరియల్స్‌లో చేస్తూనే కన్నడలో పలు సినిమాల్లో శోభిత నటించింది. ఏటీఎం, ఒక్క కథే కెల్తా, రెండు ఒండ్ల మూడు, జాక్‌పాట్, అపార్ట్‌మెంట్ టు మర్డర్, వందన సినిమాలు ఆమెకి మంచి పేరుని తీసుకొచ్చాయి. అయితే.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే శోభిత.. హైదరాబాద్‌లోని తుక్కుగూడకి చెందిన సుధీర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను గత ఏడాది మేలో పెళ్లి చేసుకుంది. అతను హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పెళ్లి తర్వాత నటనకి దూరం
వివాహం తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయిన శోభిత.. తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి సుధీర్‌తో కలిసి భోజనం చేసిన శోభిత ఒక బెడ్ రూములోకి వెళ్లి నిద్రపోగా.. ఆఫీస్ వర్క్ కారణంగా తాను మరో బెడ్‌రూమ్‌లో పనిచేసుకుని అలానే నిద్రపోయినట్లు భర్త సుధీర్ చెప్తున్నారు. అయితే.. ఆదివారం ఉదయం పని మనిషి వచ్చి డోర్ కొట్టినా శోభితా తీయకపోవడంతో అనుమానం వచ్చి.. బెడ్ రూమ్ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా శోభిత ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించింది.
శనివారం రాత్రి ఏం జరిగింది?
శోభితా ఆత్మహత్యకి గల స్పష్టమైన కారణాల్ని పోలీసులు వెల్లడించలేదు. శోభితకి ఏడాదన్నర క్రితం మ్యాట్రీమోని ద్వారా సుధీర్ పరిచయం అవ్వగా.. ఆ తర్వాత ఇద్దరూ ఇష్టపడి పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకున్నారు. శోభిత ఆత్మహత్యకి ముందు సుధీర్‌తో గొడవపడిందా? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.