Allu Aravind: ఒక వ్యక్తి చేసిన పొరపాటుకు.. తెలుగు ఇండస్ట్రీని అనొద్దు.. అతడు మా పీఆర్‌ఓ కాదు: అల్లు అరవింద్
Allu Aravind: సురేశ్ కొండేటి నిర్వహించిన సంతోషం అవార్డుల ఫంక్షన్ సందర్భంగా జరిగిన గందరగోళం గురించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఇతర సినీ ఇండస్ట్రీల వారికి సూచనలు చేశారు.
Allu Aravind: సినిమాల ప్రెస్‍మీట్లలో కొన్నిసార్లు వివాదాస్పద, సంబంధం లేని ప్రశ్నలు అడుగుతుండడం వల్ల ఇటీవల చాలా పాపులర్ అయ్యారు సురేశ్ కొండేటి. ఆయన చాలా సంవత్సరాలుగా సంతోషం అవార్డులను నటీనటులకు, టెక్నిషియన్లకు ఇస్తున్నారు. ఈసారి అవార్డుల కార్యక్రమంలో తీవ్ర గందరగోళం జరిగింది. ఈసారి గోవాలో ఆయన సంతోషం అవార్డుల ఫంక్షన్ ఏర్పాటు చేయగా.. సరిగా నిర్వహించలేకపోయారు. దీంతో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
సంతోషం అవార్డుల ఫంక్షన్ కోసం గోవాకు వివిధ సినీ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు, టెక్నిషియన్లు వెళ్లారు. అయితే, గోవాకు వెళ్లిన వారికి నిర్వాహకులు సరైన ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. ఈ విషయంపై కన్నడ సెలెబ్రెటీలు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా తెలుగు సినీ ఇండస్ట్రీనే విమర్శిస్తున్నారు. ట్రావెల్, హోటల్ ఏర్పాట్లు కూడా సరిగా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం వివాదంగా మారుతోంది.
ఈ సంతోషం అవార్డుల్లో గందరగోళంతో స్టేజీపైనే కొందరు కన్నడ నటులు.. తెలుగు సినీ ఇండస్ట్రీపైనే విమర్శలు చేశారట. సోషల్ మీడియాలోనూ కొందరు పోస్టులు పెడుతున్నారు. దీంతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఒక్క వ్యక్తి చేసిన పని వల్ల.. తెలుగు సినీ పరిశ్రమను మొత్తాన్ని అనడం సరికాదని.. ఇతర ఇండస్ట్రీల వారికి సూచించారు. అతడు (సురేశ్ కొండేటి) తమ పీఆర్వో కాదని, తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
“ఒక జర్నలిస్టు (సురేశ్ కొండేటి) అనేక సంవత్సరాలు అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. ఈసారి గోవాలో చేయాలనుకొని.. ఏవో కారణాల వల్ల అతను ఫెయిల్ అయ్యాడు. చేయలేకపోయాడు. అక్కడికి వెళ్లిన వారు ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ జరిగాయి” అని అల్లు అరవింద్ అన్నారు. అయితే, అతడు తమ కుటుంబానికి సంబంధించిన పీఆర్వో అని కొందరు రాశారని, అది కరెక్ట్ కాదని అల్లు అరవింద్ అన్నారు. అతడు తమ పీఆర్వో కానేకాదని స్పష్టం చేశారు.
“కొన్ని ఇతర భాషల వారికి ఇబ్బందులు జరిగాయి. వాళ్లు తెలుగు ఇండస్ట్రీని నిందిస్తున్నారు. కానీ ఇది వ్యక్తిగత విషయం. తెలుగు ఇండస్ట్రీ ఇంతే.. వాళ్లు ఇంతే అని కొందరు మాట్లాడడం, కొన్ని పత్రికల్లో రావడం చూసి నేను బాధపడ్డా. ఒక వ్యక్తి చేసిన దానిని ఎవరికో ఆపాదిండం కానీ.. ఇండస్ట్రీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. వారందరికీ నా విన్నపం ఏంటంటే.. అతను ఎవరికీ పీఆర్వో కాదు.. మా కుటుంబంలో ఎవరికీ పీఆర్వో కాదు. అతను ఇండస్ట్రీకి ద్రోహం చేయాలని కాదు. అతడి వ్యక్తిగత ఫెయిల్యూర్ అది” అని అల్లు అరవింద్ అన్నారు.
టాపిక్