తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ori Devuda Review: ఓరి దేవుడా సినిమా ఎలా ఉంది? విశ్వక్ సేన్‌కు హిట్ దొరికినట్లేనా?

Ori Devuda Review: ఓరి దేవుడా సినిమా ఎలా ఉంది? విశ్వక్ సేన్‌కు హిట్ దొరికినట్లేనా?

21 October 2022, 16:28 IST

google News
    • Ori Devuda Review: విశ్వక్ సేన్ హీరోగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం ఓరి దేవుడా. ఇందులో మిథిలా పార్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించారు. తమిళ చిత్రం ఓమై కడవులేకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. మాతృకను రూపొందించిన అశ్వత్ మారిముత్తునే ఈ సినిమాను రూపొందించారు.
ఓరి దేవుడా
ఓరి దేవుడా

ఓరి దేవుడా

Ori Devuda Review: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది మేలో అతడు నటించిన అశోక వనంలో అర్జున కల్యాణం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. అతడు హీరోగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం ఓరి దేవుడా. ఓ మై కడవులే అనే తమిళ సినిమా ఆధారంగా మాతృక తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తునే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దిల్ రాజు, ప్రసాద్ వీ పోట్లూరి లాంటి ఇద్దరూ అగ్ర నిర్మాతలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ..

అర్జున్(విశ్వక్ సేన్), అను(మిథిలా పార్కర్) ఇద్దరూ చిన్నప్పట్నుంచి స్నేహితులు. అర్జున్‌ను అను ఇష్టపడటంతో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఇద్దరూ వివాహమైతే చేసుకుంటారు కానీ.. అను పట్ల.. అర్జున్‌కు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. వారి కాపురంలో మనస్పర్థలు కలతలు చోటు చేసుకుంటాయి. ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే అనుతో విడిపోవాలనుకున్న సమయంలో అర్జున్‌కు దేవుడు(వెంకటేష్) రెండో అవకాశమిస్తాడు. మరి ఆ అవకాశమేంటి? ఆ ఛాన్స్ వల్ల అర్జున్ జీవితం ఎలా మలుపు తిరిగింది? లాంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

జీవితంలో చాలా మంది మిస్ చేసుకున్న ఛాన్స్‌ల గురించి ఎంతో ఉబలాట పడిపోతుంటారు. ఆ రోజు అలా జరగకుండా ఉన్నట్లయితే లైఫ్ ఇంకోలా ఉండేదని ప్రశ్చాత్తాపడుతుంటారు. ఇలాంటి సమయంలో దేవుడు రెండో ఛాన్స్ ఇచ్చి చేసిన మిస్టేక్‌ను సరిద్దికునే అవకాశమిస్తే ఎంతో బాగుండు అనుకుంటారు. కానీ నిజజీవితంలో అలా జరగనప్పటికీ ఒకవేళ జరిగితే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథ. అయితే చివరకు జీవితంలో జరగాల్సింది తప్పక జరుగుతుందని గుర్తిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఓరి దేవుడు సినిమాలోనూ ఇదే జరుగుతుంది. సాధారణంగా ఇలాంటి ఊహాగానాలు తలచుకుంటే బాగానే ఉంటాయి. ఎవరికైనా నచ్చుతాయి. అందుకే ఈ ఐడియా బాగానే వర్కౌట్ అయింది.

సినిమా ఆద్యంతం ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఆహ్లాదకరంగా సన్నివేశాలు ఉంటాయి. కామెడీతో పాటు ఎమోషన్లు కూడా బాగానే పండాయి. హీరో తన జీవితాన్ని మార్చుకునేందుకు చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ అంతా కామెడీ, మ్యారేజ్ ఇబ్బందుల ఉంటే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి. అయితే చివరి వరకు ఈ ఎమోషన్‌ను నడిపించడం వల్ల మెలో డ్రామా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అయితే ఎక్కడా బోర్ కొట్టకపోవడం ఈ సినిమాకు బలం చేకూర్చింది. ఇంకా మోడ్రన్ గాడ్ పాత్రలో వెంకీ, ఆయన అసిస్టెంటుగా రాహుల్ రామకృష్ణలతో విశ్వక్ సేన్ చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమా చివరి వరకు తీసుకెళ్లడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు.

ఎవరెలా చేశారంటే..

విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. అర్జున్ పాత్రలో పూర్తిగా దూరిపోయాడు. భార్యతో వేగలేక ఇబ్బంది పడే సగటు యువకుడి ఫ్రస్టేషన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అతడు అద్భుతంగా చేశాడు. అను పాత్రలో నటించిన మిథిలా పార్కర్ అను పాత్రలో ఒదిగిపోయింది. ఆమె ఎక్కడా హీరోయిన్‌లా అనిపించదు. అంత సహజంగా నటించింది. మరో హీరోయిన్ ఆశా భట్‌కు ఫర్వాలేదనిపించింది. పర్ఫార్మెన్స్‌కు ఆమెకు పెద్దగా స్కోప్ లేకపోయింది. మురళీ శర్మ కీలక పాత్రలో మెరిసి మెప్పించారు. ఇక విక్టరీ వెంకటేష్ కనిపించింది కాసేపైనా.. సినిమా అంతా ప్రభావితం చేశారు. ఆయన ఎంట్రీతో ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరుగుతుంది. వెంకీ మామ అసిస్టెంటుగా రామకృష్ణ కూడా కామెడీతో ఆకట్టుకుంటాడు. హీరో ఫ్రెండ్ వెంకటేశ్ కాకుమాను తన పాత్ర పరిధి వరకు ఓకే అనిపిస్తాడు.

సాంకేతిక నిపుణులు..

రీమేక్ అనగానే మాతృకతో పోలిక తప్పకుండా ఉంటుంది. అయితే అశ్వత్ మారిముత్తు ఒరిజనల్‌ను చెడకుట్టకుండా తెలుగు నేటివిటికీ తగ్గట్లుగా మరీ ఎక్కువ ఛేంజెస్ కాకుండా కొద్దిపాటు మార్పులు చేశాడు. ఓమై కడవులే టీమ్‌నే ఈ సినిమాకు తీసుకోవడంతో అతడికి పని బాగా సులభమైంది. లియాన్ జేమ్స్ సంగీతం, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో అతడి ఆర్ఆర్ అదిరిపోయింది. అనిరుధ్ పాడిన గుండెల్లోన సాంగ్ థియేటర్లో మంచి ఊపు తెచ్చింది. విధు అయ్యన్ సినిమాటాగ్రఫీ ఫర్వాలేదనిపించింది. ఇద్దరు పెద్ద నిర్మాతలు కావడంతో సినిమాకు అవసరమైన మేర బాగానే ఖర్చు పెట్టారు. అశ్వత్ మారిముత్తుకు తాను తమిళంలో తీసినట్లుగా ఇక్కడా అదే విధానాన్ని కొనసాగించాడు. తరుణ్ భాస్కర్ సంభాషణలు సహజంగా ఆకట్టుకుంటాయి.

చివరగా- ఓరి దేవుడా సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. విశ్వక్ సేన్ ఖాతాలో మరో హిట్ పడింది. ప్రేక్షకులకు ఎలాంటి బోర్ కొట్టకుండా ఫుల్ టైంపాస్ చేయిస్తుంది.

రేటింగ్- 3.25/5

తదుపరి వ్యాసం