Vishnu Manchu Arshad Warsi: కాస్త చూసి మాట్లాడమనండి: అర్షద్ వార్సీ తీరుపై మంచు విష్ణు ఫిర్యాదు
23 August 2024, 15:24 IST
- Vishnu Manchu Arshad Warsi: ప్రభాస్‌పై నోరు పారేసుకున్న బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ తీరుపై మండిపడుతూ మా అధ్యక్షుడు మంచు విష్ణు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముంబైకి ఓ లేఖ రాశాడు. ఇలాంటి కామెంట్స్ చేయకుండా చూసుకోవాలని అందులో అతడు చెప్పడం గమనార్హం.
కాస్త చూసి మాట్లాడమనండి: అర్షద్ వార్సీ తీరుపై మంచు విష్ణు ఫిర్యాదు
Vishnu Manchu Arshad Warsi: కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ ఓ జోకర్ లా కనిపించాడంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ పై మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించాడు. కాస్త చూసుకొని మాట్లాడాలంటూ అతనిపై సినీ అండ్ టీవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అతడో లేఖ రాశాడు.
మనోభావాలు దెబ్బతిన్నాయి: మంచు విష్ణు
ప్రభాస్ పై నోరు పారేసుకున్న అర్షద్ వార్సీపై ఇప్పటికే టాలీవుడ్ నటులు నాని, సిద్దూ జొన్నలగడ్డ, సుధీర్ బాబులాంటి వాళ్లు మండిపడ్డారు. అయితే ఇప్పుడు అధికారికంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడైన మంచు విష్ణు కూడా స్పందించడం గమనార్హం. అతని కామెంట్స్ వల్ల ఎంతో మంది మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ముంబైలోని సినీ అండ్ టీవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ కు లేఖ రాశాడు.
"ఎవరి అభిప్రాయాలు చెప్పే హక్కు వాళ్లకు ఉంటుందన్న విషయాన్ని గౌరవిస్తున్నాం. అయితే మిస్టర్ ప్రభాస్ ను తక్కువ చేస్తూ అతడు చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు. మిస్టర్ వార్సీ కామెంట్స్ తెలుగు సినీ రంగంలోని వాళ్లవే కాదు అభిమానుల మనోభావాలను కూడా దెబ్బతీశాయి" అని మంచు విష్ణు ఆ లేఖలో స్పష్టంగా చెప్పాడు.
కాస్త చూసుకొని మాట్లాడు..
ఈ మేరకు ఆ లేఖను విష్ణు సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశాడు. "ఓ పబ్లిక్ ఫిగర్ గా తాను మాట్లాడే ప్రతి మాటపై ఎంతో చర్చ జరుగుతుందన్న విషయాన్ని అతడు గుర్తించాల్సింది. దురదృష్టవశాత్తూ మిస్టర్ వార్సీ చేసిన కామెంట్స్ సినిమా లవర్స్ లో, మన సినీ సమాజంలో అనవసర నెగటివిటీని సృష్టించాయి.
భవిష్యత్తులో తన సహచర నటీనటులపై అర్షద్ వార్సీ అలాంటి కామెంట్స్ చేయకుండా ఉండాలని మేము సూచిస్తున్నాం. ప్రాంతాలతో సంబంధం లేకుండా మన సినీ సమాజంలోని ప్రతి వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవ, మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేస్తున్నాం" అని మంచు విష్ణు ఆ లేఖలో అన్నాడు.
అసలేంటీ గొడవ?
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఈ మధ్యే కల్కి 2898 ఏడీ మూవీ చూశానని, తనకు నచ్చలేదని అన్నాడు. అంతటితో ఊరుకోకుండా.. ఇందులో ప్రభాస్ ఓ జోకర్ లాగా కనిపించాడని, ఎందుకిలా చేస్తారని అతడు అనడంతో దుమారం రేగింది. ఇలాంటి కామెంట్స్ సరికాదంటూ ఇప్పటికే నాని, సుధీర్ బాబు, సిద్దూ జొన్నలగడ్డలాంటి వాళ్లు మాట్లాడారు.
ఇప్పుడు అధికారికంగా మా అధ్యక్షుడే స్పందించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభాస్ అంశాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ తేలిగ్గా తీసుకోలేదని ఈ లేఖ ద్వారా స్పష్టమవుతోంది. మరోవైపు కల్కి 2898 ఏడీ మూవీ గురువారం (ఆగస్ట్ 22) నుంచి ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.