Prabhas Kalki 2898 AD: ప్రభాస్ ఓ జోకర్‌లా కనిపించాడు.. ఎందుకలా చేశారు: కల్కి 2898 ఏడీపై బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్
Prabhas Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు స్టార్ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ. ఈ సినిమాలో ప్రభాస్ ఓ జోకర్ లా కనిపించాడని అతడు అనడం గమనార్హం. అతన్ని ఎందుకలా చూపించారో అర్థం కావడం లేదని అర్షద్ అన్నాడు.
Prabhas Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పించి రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమాకు చాలా వరకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. అయితే సినిమా రిలీజైన 50 రోజుల తర్వాత ఇప్పుడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ మాత్రం చాలా దారుణంగా మాట్లాడాడు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ జోకర్ లా కనిపించాడని అనడం గమనార్హం.
ప్రభాస్ జోకర్‌లా కనిపించాడు
బాలీవుడ్ లో కామెడీ పాత్రలు ఎక్కువగా పోషించే అర్షద్ వార్సీ తాజాగా ఈ కల్కి 2898 ఏడీ మూవీపై స్పందించాడు. తనకు ఈ సినిమా నచ్చలేదని చెప్పాడు. "నేను కల్కి చూశాను. నాకు నచ్చలేదు. చాలా కష్టంగా అనిపించింది.
ప్రభాస్ ను చూస్తే నాకు చాలా బాధేసింది. అతడు ఎందుకలా? అతడో జోకర్ లాగా కనిపించాడు. ఎందుకు? నేను మ్యాడ్ మ్యాక్స్ చూడాలనుకుంటాను. అక్కడ మెల్ గిబ్సన్ ను చూడాలనుకుంటాను. మీరు అతన్ని ఏం చేశారు? ఎందుకిలా చేస్తారో నాకు అర్థం కాదు" అని అర్షద్ అన్నాడు.
అమితాబ్ ఓ అద్భుతం
అదే సమయంలో ఈ కల్కి 2898 ఏడీ మూవీలో అశ్వత్థామ పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పై మాత్రం అర్షద్ ప్రశంసలు కురిపించాడు. అతడో అద్బుతం అని అన్నాడు. "అమిత్ జీ అద్భుతం. ఆ మనిషి నాకు అర్థం కాడు. అతని దగ్గర ఉన్న శక్తి మాలో ఉండి ఉంటే.. మా జీవితాలు పరిపూర్ణమయ్యేవి. అతడో నమ్మశక్యం కాని వ్యక్తి" అని అర్షద్ వార్సీ అన్నాడు.
బాలీవుడ్ లో వచ్చిన మున్నాభాయ్ ఎంబీబీఎ్ మూవీలో సర్కిట్ పాత్ర ద్వారా అర్షద్ వార్సీ పేరు సంపాదించాడు. ఈ మధ్యే అతడు అసుర్ 2 వెబ్ సిరీస్ లోనూ కనిపించాడు. ధమాల్, గోల్‌మాల్, జాలీ ఎల్ఎల్‌బీలాంటి కామెడీ సినిమాలతో పాపులర్ అయ్యాడు.
కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్
ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న రిలీజైన కల్కి 2898 ఏడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ రెండు ఓటీటీల్లో ఐదు భాషల్లో రానుంది. ఆగస్ట్ 22 నుంచి ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ కు రానుంది. హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో రానుండగా.. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల వెర్షన్లు ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానున్నాయి.
ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయాన్ని సదరు ఓటీటీలు శనివారం (ఆగస్ట్ 17) వెల్లడించాయి. నిజానికి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించడంతో ఈ సినిమా పది వారాల తర్వాత గానీ ఓటీటీలోకి రాదని భావించినా.. ఓ రెండు వారాల ముందే వచ్చేస్తుండటం విశేషం.