UI vs Vidudala 2: తమిళం, కన్నడంలో కోట్లు - తెలుగులో లక్షలు - ఉపేంద్ర, విజయ్ సేతుపతి డబ్బింగ్ సినిమాలు డీలా!
22 December 2024, 15:50 IST
UI vs Vidudala 2: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డబ్బింగ్ సినిమాలు విజయ్ సేతుపతి విడుదల 2, ఉపేంద్ర యూఐ పోటీపడ్డాయి తమిళం, కన్నడ భాషల్లో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోన్న ఈ సినిమాలు తెలుగులో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. రెండు రోజుల్లో కోటీలోపే కలెక్షన్స్ దక్కించుకున్నాయి.
యూఐ వర్సెస్ విడుదల 2
UI vs Vidudala 2: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ వారం డబ్బింగ్ సినిమాలదే జోరు కనిపించింది. విజయ్ సేతుపతి విడుదల 2తో పాటు కన్నడ అగ్ర హీరో ఉపేంద్ర నటించిన యూఐ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటితో పాటు వాల్ట్ డిస్నీ మూవీ ముఫాసా కూడా థియేటర్లలో రిలీజైంది.
ఉపేంద్ర, విజయ్ సేతుపతికి తెలుగులో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో స్ట్రెయిట్ మూవీస్‌కు ధీటుగా తెలుగు ఆడియెన్స్‌లో ఈ రెండు డబ్బింగ్ సినిమాలు ఆసక్తిని రేకెత్తించాయి. కన్నడం, తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న యూఐ, విడుదల 2 తెలుగులో మాత్రం పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి.
విడుదల 2 కలెక్షన్స్...
విజయ్ సేతుపతి హీరోగా నటించిన విడుదల 2 మూవీకి తమిళ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. గత ఏడాది రిలీజైన విడుదల మూవీకి సీక్వెల్‌గా విడుదల 2 రూపొందింది.
జమీందారి వ్యవస్థ కారణంగా అణగారిన వర్గాలు ఎలాంటి వివక్షను ఎదుర్కొన్నారు? ఈ అసమానతల్ని ఎదురించి పోరాటం సాగించిన పెరుమాళ్ అనే టీచర్ ఎందుకు హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవాల్సివచ్చిందనే కాన్సెప్ట్‌తో విడుదల 2 మూవీని వెట్రిమారన్ తెరకెక్కించాడు.
తమిళంలో పదిహేను కోట్లు...
తమిళంలో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. తొలిరోజు ఏడున్నర కోట్లు, రెండో రోజు ఎనిమిది కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది. రెండురోజుల్లోనే పదిహేను కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతోంది.
తెలుగులో మాత్రం రెండు రోజుల్లో ఈ మూవీ కోటిలోపే వసూళ్లను రాబట్టింది. మొదటిరోజు 45 లక్షల, రెండోరోజు యాభై లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. షేర్ పరంగా చూసుకుంటే రెండు రోజుల్లో ఈ మూవీ యాభై లక్షల లోపే కలెక్షన్స్ దక్కించుకున్నట్లు చెబుతోన్నారు.
బ్రేక్ ఈవెన్ టార్గెట్...
తెలుగులో రెండున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైనట్లు సమాచారం. రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. విడుదల 2 మూవీలో సూరి, మంజువారియర్ కీలక పాత్రల్లో నటించారు.
కన్నడంలో వసూళ్ల వర్షం...
ఉపేంద్ర యూఐ కన్నడంలో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోండగా...తెలుగులో మాత్రం డీలా పడింది. కన్నడంలో యూఐ మూవీ రెండు రోజుల్లో పదమూడున్నర కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. తెలుగులో మాత్రం తొలిరోజు 80 లక్షలు, రెండు రోజు 65 లక్షల వరకు యూఐ మూవీకి కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
సత్య, కల్కి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య మంచి చెడు మధ్య జరిగిన పోరాటం నేపథ్యంలో ఉపేంద్ర ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో రెండు పాత్రల్లో కనిపిస్తూనే స్వయంగా ఈ మూవీకి ఉపేంద్ర దర్శకత్వం వహించాడు. సన్నీలియోన్, జిషుసేన్ గుప్తా యూఐ మూవీలో కీలక పాత్రలు పోషించారు.