Vijay Antony on Bichagadu 2: బిచ్చగాడు-2 బ్లాక్ బాస్టర్ అవుతుంది.. విజయ్ ఆంటోనీ స్పష్టం
06 May 2023, 16:34 IST
- Vijay Antony on Bichagadu 2: విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు 2 మే 19న విడుదల కాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్లలో పాల్గొంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న విజయ్.. సినిమా సక్సెస్‌పై ధీమా వ్యక్తం చేశారు.
బిచ్చగాడు-2 ప్రమోషన్లలో చిత్రబృందం
Vijay Antony on Bichagadu 2: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బిచ్చగాడు-2. 2016లో విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న బిచ్చగాడుకు ఇది సీక్వెల్‌గా రాబోతుంది. మే 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది బిచ్చగాడు-2. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రబృందం. తాజాగా హైదరాబాద్‌లో బిచ్చగాడు-2 టీమ్ సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. "మా సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న విజయ్ గారికి థ్యాంక్యూ చెబుతున్నాను. బిచ్చగాడు మాదిరిగానే ఇది కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇందులో హీరోయిన్‌గా చేసిన కావ్య నన్ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. ఆమెకు ధన్యవాదాలు చెబుతున్నాను. బిచ్చగాడు తర్వాత మరో బిగ్ బ్లాక్ బస్టర్ వస్తోంది. మొదటి భాగంలో చూసిన దానికంటే లార్జర్ స్కేల్ లో సెకండ్ పార్ట్ లో చూస్తారు. మొదటి భాగంలో మదర్ సెంటిమెంట్ చూశారు. ఈ సారి సిస్టర్ సెంటిమెంట్ చూడబోతున్నారు. ఈ నెల 19న రాబోతున్న సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
హీరోయిన్ కావ్య థాఫర్ మాట్లాడుతూ.. "ఈ మూవీ జర్నీలో ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. సినిమా ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లా ఉంటుంది. అద్భుతమైన ఎమోషన్ కనిపిస్తుంది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకూ అనేక మలుపులు, ట్విస్ట్ లు మిమ్మల్ని సీట్లో కూర్చోనివ్వవు. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్." అని స్పష్టం చేశారు.
ఈ సినిమాలో కావ్య థాపర్, రాధా రావి, హరీష్ పెరడి, దేవ్ గిల్, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై ఆయనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. మే 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మాతృక తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో విడుదల కానుంది.