Vijay Antony Health Update: కోలుకున్న విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడు 2 పనులు మొదలెట్టేసిన హీరో
Vijay Antony Health Update: ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే. బిచ్చగాడు 2 చిత్రీకరణలో గాయపడిన అతడు.. తాజాగా కోలుకుంటున్నట్లు ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిని వివరించాడు.
Vijay Antony Health Update: బిచ్చగాడు సినిమాతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టి, నిర్మాతగా, హీరోగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా అవతరించిన విజయ్ ఆంటోనీ ఇటీవలే ప్రమాదానికి గురయ్యాడు. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ చిత్రీకరణలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. సెట్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన భుజం, ముఖం, ముక్కు భాగాలకు తీవ్రంగా గాయలయ్యాయి. దీంతో ఆసుపత్రి బెడ్‌కే పరిమితమయ్యాడు.
ఇటీవలే తాను కోలుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విజయ్ ఆంటోనీ.. తాజాగా తన ఆరోగ్య పరిస్థితి గురించి మరో అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతానికి తాను బాగానే ఉన్నానని, 90 శాతం కోలుకున్నానని ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
"ప్రియమైన అభిమానులకు.. నేను 90 శాతం కోలుకున్నాను. విరిగిన దవడ. ముక్కు ఎముకులను డాక్టర్లు ఎటాచ్ చేశారు. ఆ సమయంలో నాకు ఏం జరిగిందో తెలియలేదు. గతంలో కంటే ఇప్పుడు నేను మీతో సంతోషంగా ఉన్నాను. ఏప్రిల్‌లో బిచ్చగాడు 2 విడుదల కానుంది. ఆ పనులను ఈ రోజు నుంచే ప్రారంభిస్తాను. అందరికీ ధన్యవాదాలు." అంటూ విజయ్ ఆంటోనీ తన సోషల్ మీడియా వేదితగా ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేశాడు.
2016లో విడుదలైన బిచ్చగాడు సినిమా మాతృక తమిళంలో కంటే కూడా తెలుగులోనే సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. తమిళంలో ఈ సినిమాను పిచ్చైక్కరన్ 2 పేరుతో.. తెలుగులో బిచ్చగాడు పేరుతో రానుంది. కన్నడలో భిక్షుకా-2, మలయాళంలో భిక్షాక్కరన్-2 పేరుతో విడుదల కానుంది. బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు గతేడాదే ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది.
సంబంధిత కథనం