Vidya Balan on Mammootty: మమ్ముట్టిలాంటి పాత్ర పోషించే దమ్ము మన ఖాన్‌లకు లేదు: బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
25 April 2024, 15:59 IST
- Vidya Balan on Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషించిన గే పాత్రను హిందీ సినిమా ఖాన్‌లు పోషించలేరని నటి విద్యా బాలన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా మమ్ముట్టితోపాటు మలయాళ ప్రేక్షకులను కూడా ఆమె ప్రశంసించింది.
మమ్ముట్టిలాంటి పాత్ర పోషించే దమ్ము మన ఖాన్‌లకు లేదు: బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Vidya Balan on Mammootty: మలయాళ ఇండస్ట్రీలో మమ్ముట్టి ఎంత పెద్ద స్టారో మనకు తెలుసు. నాలుగు దశాబ్దాలుగా అక్కడి ప్రేక్షకులను అలరిస్తున్న అతడు.. ఇప్పుడు కూడా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. గతేడాది కాథల్: ది కోర్ అనే మూవీలో మమ్ముట్టి ఓ గే పాత్ర పోషించడం సంచలనం రేపింది. దీనిపై నటి విద్యా బాలన్ తాజాగా స్పందించింది.
హిందీ ఖాన్స్ గే పాత్ర పోషించలేరు
బాలీవుడ్ లో ఏ పెద్ద హీరో అందులోనూ ఖాన్‌లలో ఎవరూ ఇలాంటి గే పాత్ర పోషించలేరని విద్యా బాలన్ అనడం విశేషం. అన్‌ఫిల్టర్డ్ అనే పాడ్‌కాస్ట్ లో ఆమె ఈ కామెంట్స్ చేసింది. హిందీలో ఇలాంటి పాత్రలు వాళ్లు చేయడం ఎందుకు అసాధ్యమో కూడా వివరించింది. అదే సమయంలో కేరళ, సౌత్ ప్రేక్షకులు ఇలాంటి వాటిని ఆదరించిన తీరును ప్రశంసించింది.
"కేరళలో ఎక్కువ మంది అక్షరాస్య ఆడియెన్స్ ఉంటారన్న విషయం మనం అంగీకరించాలి. అదే చాలా ముఖ్యమైన తేడా. మమ్ముట్టి ఆ పాత్ర పోషించడాన్ని నేను తీసిపారేయడం లేదు. కానీ అక్కడ అలాంటి పాత్ర చేయడం కాస్త సులువని చెప్పాలి. అతని సమాజాన్ని ప్రతిబింబించేది అది. ఇలాంటి వాటి విషయంలో వాళ్లు చాలా ఓపెన్ గా ఉంటారని అనుకుంటున్నాను. సౌత్ లో వాళ్ల నటులను చాలా గౌరవిస్తారు. వాళ్లను పూజిస్తారు. ముఖ్యంగా మేల్ సూపర్ స్టార్లను. అందుకే అతడు ఆ పాత్రను పోషించి ఉంటాడు" అని విద్యా బాలన్ అభిప్రాయపడింది.
అదే మమ్ముట్టి గొప్పతనం
తాను కాథల్: ది కోర్ మూవీ చూసిన తర్వాత తన సూపర్ స్టార్ తండ్రికి శుభాకాంక్షలు చెప్పాలని తాను దుల్కర్ సల్మాన్ కు మెసేజ్ చేసినట్లు విద్యా చెప్పింది. "మలయాళం సినిమా అతిపెద్ద స్టార్ అందులో నటించడమే కాదు ప్రొడ్యూస్ కూడా చేయడం అంటే అక్కడి సమాజానికి అంతకుమించిన మద్దతు ఇంకేం కావాలి. దురదృష్టవశాత్తూ మన హిందీ స్టార్లలో ఎవరూ అలాంటి పాత్ర చేస్తారని నేను అనుకోవడం లేదు" అని విద్యా చెప్పింది.
అయితే ఇప్పుడు వస్తున్న కొత్త తరం నటీనటులు దీనిని బ్రేక్ చేసి, అలాంటి పాత్రలను కూడా పోషిస్తారని తాను ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఆయుష్మాన్ ఖురానాను ఉదాహరణగా చెప్పింది. అతడు శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ మూవీలో గే పాత్ర పోషించాడు. నిజానికి కాథల్: ది కోర్ మూవీలో మమ్ముట్టిలాంటి పెద్ద హీరో గే పాత్రలో కనిపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ పాత్రలో అతడు ఒదిగిపోయిన తీరు ఎంతోమందిని ఆకట్టుకుంది. ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా ఈ సినిమా ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టర్ జియో బేబీ స్పష్టంగా చెప్పాడు. తన భర్త ఓ గే అని తెలిసి పెళ్లయిన ఎన్నో ఏళ్లకు విడాకులు కోరే భార్య పాత్రలో జ్యోతిక నటన కూడా అద్భుతమనే చెప్పాలి. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.