Kaathal The Core Review: కాదల్ ది కోర్ రివ్యూ.. గే పాత్రలో మెగాస్టార్.. మనసును తాకే మూవీ-mammootty jyothika kaathal the core review in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kaathal The Core Review: కాదల్ ది కోర్ రివ్యూ.. గే పాత్రలో మెగాస్టార్.. మనసును తాకే మూవీ

Kaathal The Core Review: కాదల్ ది కోర్ రివ్యూ.. గే పాత్రలో మెగాస్టార్.. మనసును తాకే మూవీ

Sanjiv Kumar HT Telugu
Jan 11, 2024 06:24 AM IST

Kaathal The Core Review Telugu: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి స్వలింగ సంపర్కుడిగా నటించిన సినిమా కాదల్ ది కోర్. మాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇటీవల ఓటీటీలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో కాదల్ ది కోర్ రివ్యూలో తెలుసుకుందాం.

కాదల్ ది కోర్  రివ్యూ.. మనసును తాకేలా మెగాస్టార్ గే పాత్ర చేసిన మూవీ
కాదల్ ది కోర్ రివ్యూ.. మనసును తాకేలా మెగాస్టార్ గే పాత్ర చేసిన మూవీ

టైటిల్: కాదల్ ది కోర్

నటీనటులు: మమ్ముట్టి, జ్యోతిక, సుది కోజీకోడ్, అనఘ అక్కు (అనఘ రవి), అలెక్స్ అలిస్టర్ తదితరులు

రచన: పాల్సన్ స్కరియా, ఆదర్శ్ సుకుమారన్

దర్శకత్వం: జియో బేబీ

ప్రొడక్షన్: మమ్ముట్టి కంపెనీ

సంగీతం: మ్యాథ్యూ పులికాన్

సినిమాటోగ్రఫీ: సాలు కె. థామస్

ఎడిటింగ్: ఫ్రాన్సిస్ లూయిస్

రిలీజ్ డేట్: జనవరి 5, 2024

ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో

Review Of Kaathal The Core In Telugu: మలయాళ చిత్ర పరిశ్రమలో నవంబర్ 23న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా కువైట్, ఖతర్ వంటి దేశాల్లో నిషేధానికి గురైన సినిమా కాదల్ ది కోర్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సీనియర్ హీరోయిన్ జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన కాదల్ ది కోర్ సినిమా సుమారు 42 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. గే, ఎల్‌జీబీటీక్యూ వర్గానికి చెందిన కథాంశంతో తెరెకెక్కిన కాదల్ ది కోర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

మ్యాథ్యూ దేవసీ (మమ్ముట్టి), ఒమన (జ్యోతిక) ఇద్దరు భార్యాభర్తలు. వీరికి 19 ఏళ్ల ఫెమి (అనఘ రవి) అనే కూతురు ఉంటుంది. వార్డ్ మెంబర్ బై ఎలక్షన్స్‌లో సీఆర్‌పీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మ్యాథ్యూ దేవసీని అంతా కలిసి నిలబెడతారు. సమాజంలో మంచి హోదా, మంచి పేరు, బ్యాంక్ ద్వారా ఎంతోమందికి సహాయం చేసిన పేరు ఉండటంతో మ్యాథ్యూ కచ్చితంగా గెలుస్తాడని అంతా భావిస్తారు. కానీ, అదే సమయంలో మ్యాథ్యూ గే అంటూ తన భార్య ఒమన విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్ వేస్తుంది.

ఎలక్షన్ సమయంలో తానేంటో నిరూపించుకోవడం మ్యాథ్యూకు సవాల్‌గా మారుతుంది. మ్యాథ్యూపై ఒమన వేసిన ఆరోపణలు నిజమేనా..? మ్యాథ్యూ గే అయితే తమకు ఒక కూతురు ఎలా పుట్టింది? దీన్ని అపోజిషన్ పార్టీ ఎలా అడ్వాంటేజ్ తీసుకుంది? మ్యాథ్యూ గే అన్నదానిపై ప్రజలు ఎలా స్పందించారు? చివరికీ కోర్టు తీర్పు ఏమని వచ్చింది? మ్యాథ్యూ ఎన్నికల్లో గెలిచాడా? అనే విషయాలు తెలియాలంటే కాదల్ది కోర్ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

స్త్రీ, పురుష లింగ బేధంతో జీవించడం చాలా సులువు. కానీ, హోమో సెక్సువల్స్‌ (గే లేదా లెస్బిబియన్) వారికి జీవితం చాలా కష్టంగా అనిపిస్తుంది. వారికి నచ్చినట్లు చేయలేరు. అలా అని మనసు చంపుకుని సమాజం కోసం బతకలేరు. సమాజంలో హోమో సెక్సువల్స్‌ని ఎలా చూస్తారో కాదల్ ది కోర్ మూవీలో చూపించారు. అందులోనూ సమాజంలో పేరు పలుకుబడి, ముఖ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించే వారిపై ఎలాంటి రియాక్షన్ ఉంటుందో తెలిపారు.

చూపుల్లోనే లక్ష ప్రశ్నలు

సమాజం స్వలింగ సంపర్కులను ఎలా చూస్తుందో, వారిని ఇతరులు చూసే చూపుల్లోనే లక్ష ప్రశ్నలు దాగి ఉంటాయని తెలియజేయడంతోపాటు వారిని ఎలా అర్థం చేసుకోవాలో సినిమా ద్వారా చెప్పారు. హోమో సెక్సువల్స్‌ను చిన్నతనంలోనే గుర్తించి.. అది పెద్ద నేరంగా పరిగణించకుండా వారికి నచ్చినట్లు స్వేచ్ఛనిస్తే ఎలాంటి బాధలు ఉండవని చెప్పే చిత్రం. పిల్లలు హోమో సెక్సువల్స్ అయితే వారు పెళ్లి చేసుకుంటే ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో.. వారిని వివాహం చేసుకున్న భాగస్వామి జీవితం ఎలా ఉంటుందో తెలిసేలా చేశారు.

సెక్షన్ 377

సాధరణంగా హోమో సెక్సువల్స్‌ అందరిలా బయటపడకపోవడానికి ప్రధానం కారణం తల్లిదండ్రులు, సమాజం అని చూపించారు. తీసుకున్న కథకు పెద్దగా గొడవలు, అరుపులు, అడల్ట్ కంటెంట్, అభ్యంతరకర సన్నివేశాలు లేకుండా చాలా నీట్‌గా సినిమాను ప్రజంట్ చేశారు. భార్యాభర్తలు అన్యూనతంగా ఉన్నట్లు చూపించి వెంటనే విడాకుల పిటిషన్‌తో ట్విస్ట్ ఇచ్చారు. కోర్టు, సెక్షన్ 377ని కథ తగినట్లుగా వాడుకున్నారు.

హత్తుకునేలా క్లైమాక్స్

స్వలింగ సంపర్కులు తమను తాము ప్రేమిస్తూ.. తమకు నచ్చినట్లు స్వేచ్ఛగా బతకమని చెప్పే సినిమా ఇది. పెద్దగా ట్విస్టులు లేకుండా సింపుల్‌గా స్టోరీ సాగిన ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో తను విడాకులు ఎందుకు తీసుకున్నట్లో మ్యాథ్యుకు ఒమన్ చెప్పే సీన్ మనసును హత్తుకుంటుంది. ఒకటి రెండు సీన్స్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. పాత్రల మానసిక పరిస్థితి డెప్త్‌ను తెలిసేలా చేస్తుంది.

అదరగొట్టేశారు

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సాంకేతిక నిర్మాణ విలువలు అంతా బాగున్నాయి. ఇక మమ్ముట్టి, జ్యోతిక తమ నటనతో అదరగొట్టేశారు. మెగాస్టార్ అయి గే పాత్ర చేసిన మమ్ముట్టికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

అలాగే మరో గే పాత్రలో నటించిన సుది కోజీకోడ్ పర్ఫామెన్స్ కూడా చాలా బాగుంది. డైలాగ్స్ లేకుండా కళ్లతోనే ఎక్స్ ప్రెషన్స్ పలికించారు. ఫెమిగా చేసిన అనఘ బాగా చేసింది.

మిగతా వారంతా బాగా నటించారు. ఇదొక నీట్ అండ్ డిఫరెంట్ మూవీ. గే, ఎల్‌జీబీటీ కమ్యూనిటీ నేపథ్యంలో అర్థవంతమైన భాగోద్వేగాలతో సాగే ఈ సినిమా స్లోగా సాగిన ఎంగేజ్ చేస్తుంది. ఆలోచించేలా చేస్తుంది. కాదల్ ది కోర్ కచ్చితంగా చూడాల్సిన సినిమా.

IPL_Entry_Point