Varun Sandesh Ninda: మంచోడికి న్యాయం జరగదంటున్న వరుణ్ సందేశ్ - నింద మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!
12 June 2024, 8:21 IST
Varun Sandesh Ninda: వరుణ్ సందేశ్ హీరోగా నటించిన నింద మూవీ ట్రైలర్‌ను విశ్వక్‌సేన్, సందీప్ కిషన్ రిలీజ్ చేశారు. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 21న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
వరుణ్ సందేశ్ నింద
Varun Sandesh Ninda: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ హిట్టు అందుకొని చాలా కాలమైంది. ఓ మంచి సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. కొన్నాళ్లుగా తనకు అచ్చొచ్చిన లవ్‌స్టోరీస్ కాకుండా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తోన్నాడు వరుణ్ సందేశ్.
ఆ లిస్ట్‌లో వరుణ్ సందేశ్ చేసిన తాజా మూవీ నింద. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి రాజేష్ జగన్నాధం వహించాడు. జూన్ 21న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యథార్థ సంఘటనల ఆధారంగా నింద మూవీ రూపొందుతోంది.
విశ్వక్ సేన్...సందీప్ కిషన్...
వరుణ్ సందేశ్ నింద మూవీ ట్రైలర్‌ను యంగ్ హీరోలు విశ్వక్‌సేన్, సందీప్‌కిషన్ కలిసి రిలీజ్ చేశారు. సామాజికాంశాలను టచ్ చేస్తూ నింద ట్రైలర్ ఆసక్తినిపంచుతోంది. ‘మంచోడికి న్యాయం జరుగుతుందని నమ్మకం పోయిన రోజు.. ఒక సమాజం చనిపోయినట్టు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. కొందరిని కిడ్నాప్ చేసి ఓ రూమ్‌లో బంధించడం, వారికి అవసరమైన ఫుడ్, మెడిసిన్స్ ఓ అమ్మాయి తీసుకువచ్చి ఇవ్వడం ఆకట్టుకుంటోంది.
డైలాగ్స్ హైలైట్...
‘మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభం’.. ‘అబద్దాన్ని బలంగా చెప్పినంత మాత్రానా నిజం అయిపోదు’.. ‘బలవంతుడిదే రాజ్యం అని అనుకోవడానికి మనమేమీ అడవుల్లో బతకడం లేము’.. అంటూ సాగిన డైలాగ్స్ ఆలోచించజేస్తున్నాయి. అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడనే నేరంపై బాలరాజు అనే వ్యక్తి అరెస్ట్ అవుతాడు.
అతడు నిజంగా తప్పు చేశాడో లేదో అనే తెలుసుకునేందుకు ప్రయత్నించే వ్యక్తిగా వరుణ్ సందేశ్ ఈ ట్రైలర్ లోకనిపించాడు. అసలు నేరస్థుడు ఎవరో హీరో కనిపెట్టేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠ భరితంగా ఉంది. ట్రైలర్ కు రమీజ్ కెమెరా వర్క్, సంతు ఓంకార్ ఆర్ఆర్ హైలైట్‌గా నిలిచాయి.
మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్...
నింద మూవీని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. నింద సినిమాలో శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు హీరోయిన్లుగా నటిస్తోన్నారు. తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య, చత్రపతి శేఖర్, కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హ్యాపీడేస్‌తో ఎంట్రీ...
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీడేస్‌తో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ సందేశ్. తొలి సినిమాతోనే యూత్ సెన్సేషన్‌గా మారాడు. కొత్త బంగారులోకంతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. శ్రీకాంత్ అడ్దాల దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ స్టోరీ ఆ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
బ్యాక్ టూ బ్యాక్ రెండు సక్సెస్‌లతో తెలుగులో పలు అవకాశాలను దక్కించుకున్నాడు వరుణ్ సందేశ్. కానీ కథల ఎంపికలో పొరపాట్ల వల్ల అతడు నటించిన ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచాయి. ప్రస్తుతం నింద, కానిస్టేబుల్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు వరుణ్ సందేశ్. అతడు హీరోగా నటించిన చిత్ర చూడరా మూవీ ఇటీవల డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. బిగ్‌బాస్ సీజన్ 3లో భార్య వితికా శేరుతో కలిసి ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.