Chiranjeevi: చిరంజీవికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు.. మెగాస్టార్‌కు అవార్డు అందించనున్న బాలీవుడ్ స్టార్!
22 September 2024, 14:40 IST
- Chiranjeevi - Guinness world Records: మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం దక్కనుందని తెలుస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు ఎక్కనుందనే సమాచారం బయటికి వచ్చింది. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఈ అవార్డును చిరంజీవికి అందిస్తారని తెలుస్తోంది.
Chiranjeevi: చిరంజీవికి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు.. మెగాస్టార్‌కు అవార్డు అందించనున్న బాలీవుడ్ స్టార్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సుమారు 46ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో వెలుగొందుతున్నారు. ఇప్పటి వరకు 155 సినిమాలు చేశారు. ఫైట్లు, యాక్షన్, డ్యాన్సులు, స్టైల్‍తో ఎప్పటికప్పుడూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు చేరి స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పటి వరకు ఎన్నో ఘనతలు, అవార్డులు దక్కించుకున్నారు. ఇప్పుడు చిరంజీవికి మరో గౌరవం దక్కనుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు చేరనుందనే సమాచారం బయటికి వచ్చింది.
నేడే ఈవెంట్.. బాలీవుడ్ స్టార్ హాజరు!
చిరంజీవికి నేడే (సెప్టెంబర్ 22) గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అవార్డును అందించే ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. నేటి సాయంత్రం హైదరాబాద్‍లోని ఓ హోటల్‍లో కార్యక్రమం ఉంటుందని సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.. చిరంజీవికి గిన్నిస్ రికార్డుకు సంబంధించిన అవార్డు అందించనున్నారని తెలుస్తోంది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిథులతో పాటు ఆమిర్ ఖాన్ హైదరాబాద్‍కు రానున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం తర్వాత చిరంజీవి పేరు అధికారికంగా గిన్నిస్ బుక్‍లో ఎక్కనుంది.
చిరంజీవికి గిన్నిస్ రికార్డు ఏ విషయంలో దక్కనుందో నేటి సాయంత్రం స్పష్టంగా వెల్లడికానుంది. అయితే, 150కు పైగా సినిమాల్లో డ్యాన్స్ చేసినందుకు ఆయనకు ఈ ఘనత దక్కనుందని తెలుస్తోంది. ఇతర నటులు కొందరు ఇంత కంటే ఎక్కువ చిత్రాల్లో నటించినా.. అన్ని చిత్రాల్లో డ్యాన్స్ చేయలేదనే చెప్పవచ్చు. ఈ విషయంలోనే చిరూకు గిన్నిస్ రికార్డు దక్కనుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఈవెంట్ తర్వాతే క్లారిటీ రానుంది.
ఈ ఏడాదే పద్మ విభూషణ్
దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‍ను మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదే అందుకున్నారు. సినీ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరటంతో పాటు చిరూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీటికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చింది. గతంలో పద్మ భూషణ్ అందుకున్న మెగాస్టార్.. ఈ ఏడాది విభూషణ్ కూడా స్వీకరించారు. ఇప్పుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోనూ చోటు దక్కించుకుంటున్నారు.
విశ్వంభరలో బిజీ
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమాగా విశ్వంభర చేస్తున్నారు. సోషియా ఫ్యాంటసీ మూవీగా ఇది రూపొందుతోంది. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
విశ్వంభర చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్టు గతంలోనే వెల్లడించింది మూవీ టీమ్. అందుకు తగ్గట్టే ఈ సినిమా షూటింగ్ చకచకా సాగుతోంది. ముఖ్యమైన సీక్వెన్స్‌ల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో వీఎఫ్‍ఎక్స్ కూడా అధికంగానే ఉండనుంది. భారీ బడ్జెట్‍తో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తుండటంతో క్రేజ్ భారీగా నెలకొంది. విశ్వంభర అప్‍డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఎదురుచూస్తున్నారు.