Wayanad Landslides: వయనాడ్ బాధితుల కోసం భారీ విరాళం ఇచ్చిన చిరంజీవి, రామ్‍చరణ్-chiranjeevi and ram charan donates 1 crore rupees for support to wayanad landslides victims ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Wayanad Landslides: వయనాడ్ బాధితుల కోసం భారీ విరాళం ఇచ్చిన చిరంజీవి, రామ్‍చరణ్

Wayanad Landslides: వయనాడ్ బాధితుల కోసం భారీ విరాళం ఇచ్చిన చిరంజీవి, రామ్‍చరణ్

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 04, 2024 04:53 PM IST

Wayanad Landslides - Chiranjeevi Donation: వయనాడ్ మహా విలయంలో బాధితులకు సాయంగా విరాళం ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి, రామ్‍చరణ్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు చిరూ.

Wayanad Landslides: వయనాడ్ బాధితుల కోసం భారీ విరాళం ఇచ్చిన చిరంజీవి, రామ్‍చరణ్
Wayanad Landslides: వయనాడ్ బాధితుల కోసం భారీ విరాళం ఇచ్చిన చిరంజీవి, రామ్‍చరణ్

కేరళలోని వయనాడ్‍లో మహా విషాదం జరిగింది. భారీ వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడిన ఘటనలో సుమారు 360 మృతి చెందారు. ఇంకా సుమారు 200 మంది ఆచూకీ కనుగొనాల్సి ఉంది. భారీస్థాయిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా బలగాలు చర్యలు ముమ్మరంగా చేపడుతున్నాయి. వయనాడ్ విలయంలో బాధితులైన వారికి సాయం చేసేందుకు వివిధ ఇండస్ట్రీలకు చెందిన సినీ స్టార్లు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ కలిసి భారీ విరాళాన్ని నేడు (ఆగస్టు 4) ప్రకటించారు.

రూ.కోటి విరాళం

వయనాడ్ దుర్ఘటన బాధితులకు సాయం చేయడంలో భాగంగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం ఇస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. తాను, రామ్‍చరణ్ కలిసి ఈ డొనేషన్ ఇస్తున్నామని నేడు ట్వీట్ చేశారు.

కేరళలో వందలాది మంది మృతి చెందడం తన హృదయాన్ని కలిచివేస్తోందని చిరంజీవి పేర్కొన్నారు. “కొన్ని రోజులుగా ప్రకృతి విలయం కారణంగా కేరళలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. వయనాడ్ బాధితులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా. బాధితులకు మా తరఫున సాయం అందించేందుకు చరణ్, నేను కలిసి రూ.కోటిని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‍కు విరాళం ఇస్తున్నాం. ఈ బాధ నుంచి అందరూ కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నా” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయలను విరాళంగా ఇచ్చి మంచి మనసు చాటుకున్నారని చిరంజీవి, రామ్‍చరణ్‍ను అభిమానులు అభినందిస్తున్నారు. బాధితులకు సాయం చేయడాన్ని ప్రశంసిస్తున్నారు.

అల్లు అర్జున్ కూడా..

వయనాడ్ బాధితుల కోసం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూ.25లక్షల విరాళాన్ని నేడే ప్రకటించారు. తనకు కేరళ చాలా ప్రేమను ఇచ్చిందని ట్వీట్ చేశారు. “వయనాడ్‍లో ఇటీవల కొండచరియలు విరిగిన ఘటన నన్ను ఎంతో బాధిస్తోంది. నాకు కేరళ ఎప్పుడూ చాలా ప్రేమను ఇస్తూ వస్తోంది. నేను కొంత సాయంగా సహాయక, పునరావాస చర్యల కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‍కు రూ.25లక్షలను విరాళంగా ఇస్తున్నా” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

సినిమాలు ఇలా..

సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చేస్తున్నారు. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 10న విడుదల కానుంది. విశ్వంభర చిత్రంలో త్రిష హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం రిలీజ్‍కు రెడీ అవుతోంది. డిసెంబర్‌లో ఈ మూవీని రీలీజ్ చేస్తామని నిర్మాత దిల్‍రాజు ఇటీవలే ప్రకటించారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం షూటింగ్‍ను రామ్‍చరణ్ ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. త్వరలోనే గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ వెల్లడయ్యే అవకాశం ఉంది.