Chiranjeevi on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi on CM Revanth Reddy: గద్దర్ అవార్డులను ఇస్తామని ప్రకటించినా టాలీవుడ్ నుంచి స్పందన రాకపోవటంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ విషయంపై ట్వీట్ చేశారు.
తెలుగు సినిమాల్లో నటీనటులు, టెక్నిషియన్ల ప్రతిభకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు చాలా ఏళ్లుగా నిలిచిపోయాయి. గతంలో ప్రతీ సంవత్సరం జరిగే ఈ అవార్డుల వేడుక ఎనిమిదేళ్లుగా నిర్వహించడం లేదు. చివరగా 2016కు గాను నంది అవార్డుల ప్రకటన జరిగింది. ఈ విషయంపై ప్రస్తావన కూడా ఎక్కువగా రాలేదు. అయితే, మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నంది అవార్డుల గురించి మాట్లాడారు. తాము గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామన్నారు. అయితే, తాము ఆ ప్రతిపాదన చేసినా టాలీవుడ్ నుంచి సరైన స్పందన రాలేదని నేడు (జూలై 30) రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేయగా.. మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
ముందుకు తీసుకెళ్లాలి
గద్దర్ అవార్డులను ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఈ ప్రతిపాదనను తెలుగు సినీ పరిశ్రమ తరఫున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూజర్స్ కౌన్సిల్ ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకోవాలని చిరంజీవి నేడు ట్వీట్ చేశారు. ఈ విషయంపై టాలీవుడ్ ఏకతాటిపైకి వచ్చి చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదను ముందుకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలంటూ చిరంజీవి సూచించారు. “తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ, సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రజా కళాకారుడు గద్దర్ పేరు మీదుగా ‘గద్దర్ అవార్ట్స్’ను ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించారు. తెలుగు పరిశ్రమ తరఫున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూజర్స్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నా” అని చిరంజీవి నేడు పోస్ట్ చేశారు. పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తనను సత్కరించిన వేడుకలో తాను మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు మెగాస్టార్.
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, మహాకవి సి.నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్‍లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి నేడు మాట్లాడారు. టాలీవుడ్‍కు చేసిన గద్దర్ అవార్డుల ప్రతిపాదనను గుర్తు చేశారు. తామే చొరవ తీసుకొని చెప్పినా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి సరైన స్పందన రాలేదని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున తాము గద్దర్ అవార్డులు ఇస్తామని గతంలోనే చెప్పినా.. సినీ రంగ ప్రముఖులు ఎవరూ తమను సంప్రదించలేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. “గద్దర్ జయంతి సందర్భంగా డిసెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, సినీ ఇండస్ట్రీలో బాధ్యత వహిస్తున్న వారు ప్రభుత్వానికి ప్రతిపాదన తీసుకురావాలని గతంలో నేను ఈ వేదిక మీదనే విజ్ఞప్తి చేశా. కానీ ఏ కారణం వల్లనో సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. మీరు విజ్ఞప్తి చేసే కంటే ముందే నేను ప్రకటన చేశా. నంది అవార్డులంత గొప్పగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డుల కార్యక్రమం చేపడుతుందని అన్నాం. కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా ముందుకు వచ్చి.. కార్యాచరణను ముందుకు తీసుకెళితే ప్రభుత్వం కూడా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది” అని రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో చిరంజీవి స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 10న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఒలింపిక్స్ సందర్భంగా ప్రస్తుతం పారిస్‍కు వెళ్లారు చిరూ.